ఫ్రాన్స్‌లో కరోనా మళ్లీ విజృంభణ..!

తాజా వార్తలు

Published : 13/09/2020 18:03 IST

ఫ్రాన్స్‌లో కరోనా మళ్లీ విజృంభణ..!

పారిస్‌: యూరప్‌ దేశాల్లో కరోనా వైరస్‌ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా ఫ్రాన్స్‌లో ఒక్కరోజు వ్యవధిలోనే 10,561 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 24గంటల వ్యవధిలో రికార్డుస్థాయిలో 10వేల కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. రెండు రోజుల క్రితం అత్యధికంగా ఒక్కరోజే 9వేల కేసులు బయటపడ్డాయి. లాక్‌డౌన్ నిబంధనల‌ సడలింపుల అనంతరం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్న సమయంలోనే వైరస్‌ ఉద్ధృతి పెరిగినట్లు ఫ్రెంచ్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన వారం రోజుల్లో దాదాపు 2432 మంది ఆసుపత్రుల్లో చేరగా వారిలో 417మంది ఐసీయూలో చికిత్స అందిస్తోన్నట్లు పేర్కొంది. నిన్న ఒక్కరోజే 17మంది మృత్యువాతపడ్డట్లు తెలిపింది. వైరస్‌ తీవ్రత మరింత పెరగడంతో ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇప్పటికే వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న 772 ప్రాంతాలను గుర్తించి వైరస్‌ కట్టడి చర్యలు చేపట్టింది.

అయితే, వైరస్‌ తీవ్రత పెరుగుతున్నప్పటికీ లాక్‌డౌన్‌ నిబంధనలు మాత్రం ఉండవని ఫ్రెంచ్‌ ప్రధానమంత్రి జీన్‌ కాస్‌టెక్స్‌ రెండురోజుల క్రితమే వెల్లడించారు. వైరస్‌ మరికొన్ని నెలలపాటు మనతోనే ఉంటుందని అభిప్రాయపడ్డారు. అందుకే, ముందస్తు జాగ్రత్తగా భౌతిక దూరం, మాస్కులతో పాటు టెస్టుల సంఖ్యను పెంచి వైరస్‌సోకినవారిని వేగంగా గుర్తించే ప్రక్రియ కొనసాగించాలని ఆదేశించారు. ఇలాంటి ముందస్తు జాగ్రత్తలతోనే వైరస్‌ కట్టడిచేయాలని ఆయన అధికారులకు, ప్రజలకు సూచించారు.

ఇదిలాఉంటే, గత కొన్ని రోజుల క్రితం మహమ్మారి ధాటికి ఫ్రాన్స్‌ వణికిపోయింది. ఇప్పటివరకు అక్కడ 4లక్షల కేసులు నమోదుకాగా 30,900 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు సంభివిస్తోన్న దేశాల్లో ఫ్రాన్స్‌ ఏడో స్థానంలో ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని