గడ్డు పరిస్థితుల్లోకి జారుకున్నాం: పౌఛీ

తాజా వార్తలు

Updated : 02/11/2020 14:40 IST

గడ్డు పరిస్థితుల్లోకి జారుకున్నాం: పౌఛీ

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా విజృంభిస్తున్న తీరుపై ఆ దేశ అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, మహమ్మారి కట్టడిపై అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకుంటున్న చర్యలపై పెదవి విరిచారు. వీలైనంత త్వరగా ప్రజారోగ్య విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని సూచించారు. రోజురోజుకీ దాదాపు లక్షకు చేరువలో కొత్త కేసులు నమోదవుతున్నా.. ట్రంప్ మాత్రం వైరస్‌ విజృంభణను తేలిగ్గా తీసుకుంటున్న నేపథ్యంలో ఫౌచీ స్పందించారు. అక్కడి ప్రముఖ దినపత్రిక ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇప్పటికే గడ్డు పరిస్థితుల్లోకి జారుకున్నామని.. ఇది ఏమాత్రం మంచిది కాదని ఫౌచీ హెచ్చరించారు. వర్షాకాలం, శీతాకాలంలోకి వెళుతున్న కొద్దీ ప్రజలు ఇళ్లలోనే ఉండాల్సి ఉంటుందని.. ఇలాంటి తరుణంలో కరోనా వ్యాప్తి మరింత దయనీయంగా మారుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజారోగ్య విధానాల్ని వెంటనే మార్చాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. త్వరలో రోజుకి లక్షకు పైగా కేసులు, మరిన్ని ఎక్కువ మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. 

డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ ప్రచారం ప్రజారోగ్య కోణాన్ని పరిగణనలోకి తీసుకొని జరుగుతోందని ఫౌచీ అభిప్రాయపడ్డారు. అదే ట్రంప్‌ మాత్రం ఆర్థిక వ్యవస్థ, దేశాన్ని కరోనాకు పూర్వ స్థితిలోకి తీసుకెళ్లడంపైనే దృష్టి పెట్టారన్నారు. మహమ్మారి విజృంభణను ట్రంప్‌ పాలకవర్గం నియంత్రించలేదని బహిరంగంగా అంగీకరించిన శ్వేతసౌధం చీఫ్‌ ఆఫ్‌ స్టాప్‌ మార్క్‌ మీడోస్‌ని ఫౌచీ ప్రశంసించారు. తన మదిలో ఉన్న విషయాన్ని నేరుగా బయటకు చెప్పడం గొప్ప విషయమన్నారు.

ఫౌచీ వ్యాఖ్యలను శ్వేతసౌధం అధికార ప్రతినిధులలో ఒకరైన జడ్‌ డీర్‌ ఖండించారు. అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఫౌచీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కరోనా కట్టడి కోసం ట్రంప్‌ ఏర్పాటు చేసిన కార్యదళంలో ఉంటూ ఫౌచీ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేయడం తగదని వ్యాఖ్యానించారు. మహమ్మారి నియంత్రణకు సూచనలు చేయాల్సింది మరచి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అధ్యక్షుడిపై విమర్శలు గుప్పించడం ఆయన రాజకీయపరమైన ఉద్దేశాల్ని తెలియజేస్తోందని ఆరోపించారు.

అమెరికా సీడీసీ గణాంకాల ప్రకారం ఆదివారం కొత్తగా 80,932 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో 823 మంది మృత్యువాతపడ్డారు. దీంతో అమెరికాలో ఇప్పటి వరకు 9,206,975 మంది కరోనా బారిన పడగా.. వీరిలో 230,995 మంది మృతి చెందారు. శుక్రవారం అత్యధికంగా 98వేలకు పైగా కేసులు నమోదుకావడం గమనార్హం. గత వారం రోజుల్లో ఐదు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని