
తాజా వార్తలు
కొలిక్కిరాని చర్చలు.. సరిహద్దుల్లోనే రైతన్నలు
ఏడో రోజుకు చేరిన అన్నదాతల ఆందోళన
దిల్లీలో ట్రాఫిక్‌పై ఆంక్షలు.. పలు రైళ్లు రద్దు
దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. అన్నదాతలు లేవనెత్తిన అంశాలపై చర్చిండానికి కమిటీని నియమిస్తామన్న కేంద్రం ప్రతిపాదనను రైతు సంఘాలు మూకుమ్మడిగా తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో చర్చలు గురువారానికి వాయిదా పడటంతో హస్తిన సరిహద్దుల్లో రైతన్నల ఆందోళన ఏడో రోజు కొనసాగుతోంది. తీవ్రమైన చలిని కూడా లెక్కచేయకుండా సింఘు, టిక్రి రహదారుల్లోనే రైతులు బైఠాయించారు. చర్చలు కొలిక్కివచ్చే వరకు శాంతియుతంగా నిరసన సాగిస్తామని రైతుసంఘాలు చెబుతున్నాయి.
మరోవైపు రైతుల ఆందోళన నేపథ్యంలో హరియాణా, యూపీల నుంచి దిల్లీకి దారితీసే మార్గాల్లో వాహనాల రాకపోకలపై దిల్లీ పోలీసులు ఆంక్షలు విధించారు. నోయిడాను కలిపే చిల్లా సరిహద్దుతో పాటు టిక్రి, ఝరోడా, ఝతిక్రా సరిహద్దులను పూర్తిగా మూసేశారు. బదుసరయ్ సరిహద్దుల్లో మాత్రం కేవలం ద్విచక్రవాహనాల రాకపోకలకు అనుమతి కల్పించినట్లు దిల్లీ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉండగా.. ఆందోళన కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. అజ్మేర్-అమృత్సర్ ఎక్స్‌ప్రెస్, దిరుగఢ్-అమృత్సర్ ఎక్స్‌ప్రెస్ స్పెషల్ రైళ్లతో పాటు మరిన్ని రైళ్లను రద్దు చేసినట్లు ఉత్తర రైల్వే వెల్లడించింది. కొన్ని రైళ్లను దారిమళ్లించినట్లు తెలిపింది.
యూపీ సరిహద్దుల్లో స్వల్ప ఉద్రిక్తత
కాగా.. రైతుల ఆందోళనతో దిల్లీ-యూపీ సరిహద్దుల్లో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వేలాది మంది రైతులు ఘాజీపూర్-ఘజియాబాద్ రహదారిపై ఆందోళనకు దిగారు. వారు దిల్లీలోకి రాకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేశారు. అయితే రైతులు వాటిని తొలగించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా దేశ రాజధాని చుట్టుపక్కల ఆందోళన చేస్తున్న అన్నదాతలతో మంగళవారం కేంద్రం దాదాపు మూడు గంటలపాటు చర్చలు జరిపింది. రైతులు లేవనెత్తిన అంశాలపై చర్చించడానికి ఐదుగురితో కూడిన కమిటీ నియమిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించగా.. ఇందుకు రైతు సంఘాలు అంగీకరించలేదు. నవంబరులో చర్చించినప్పుడే కమిటీ వేసి సమస్యన పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకూ ఏమీ చేయలేదని, అందువల్ల తక్షణమే కొత్త చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎటూ తేలకపోవడంతో చర్చలను రేపటికి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో రైతులు తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా బుధవారం సమర్పించాలని కేంద్రం సూచించింది.