
తాజా వార్తలు
అది మరో మహమ్మారి..
కొవిడ్ అపోహలపై రెడ్‌క్రాస్ హెచ్చరిక
జెనీవా: కరోనా వైరస్‌ను అంతం చేయాలంటే.. దానికి సమాంతరంగా విస్తరిస్తోన్న అపోహలనే మహమ్మారిని ఓడించాలని అంతర్జాతీయ సేవా సంస్థ రెడ్‌క్రాస్ హెచ్చరించింది. కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ఎంత ముఖ్యమో.. టీకా పట్ల నమ్మకాన్ని పెంపొందించే చర్యలను చేపట్టడం కూడా అంతే ముఖ్యమని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సొసైటీ అధ్యక్షుడు ఫ్రాన్సెస్కో రోక్కా సూచించారు. ఇందుకుగాను సుమారు కోటిన్నర మంది రెడ్‌క్రాస్ వాలంటీర్లు 192 దేశాల్లో నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో వారు ఇప్పటికే 24 కోట్ల మందికిపైగా సమాచారం, సలహాలు, సూచనలను అందించారన్నారు.
వ్యాక్సిన్ పట్ల సందేహాలు..
కొవిడ్-19 వ్యాక్సిన్ పట్ల సందేహాలు వ్యాప్తించడం ఇటీవల సాధారణమవుతోందని ఫ్రాన్సెస్కో అన్నారు. ఈ మేరకు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఓ అధ్యయనంలో.. ఈ ధోరణి పాశ్చాత్య దేశాల్లో అధికంగా ఉందని తెలిసింది. జులై నుంచి అక్టోబర్ మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా 67 దేశాల్లో కరోనా వ్యాక్సిన్ పట్ల సానుకూల దృక్పథం తగ్గినట్టు వెల్లడైంది. ఇక నాలుగోవంతు ప్రపంచ దేశాల్లో వ్యాక్సిన్ పట్ల నమ్మకం 50 శాతం కంటే తక్కువగా ఉందన్నారు. జపాన్‌లో ఈ శాతం 70 నుంచి 50కి, ఫ్రాన్స్‌లో 51 నుంచి 38కి పడిపోయిందన్నారు.
మహమ్మారి ఉన్నట్టే తెలియదు..
తమ దేశాలను ప్రయోగశాలలుగా వాడుకుంటున్నారనే అభిప్రాయం నెలకొని ఉండటంతో.. కొన్ని ఆఫ్రికా దేశాల్లో కూడా వ్యాక్సిన్ పట్ల వ్యతిరేకత ఉంది. కొవిడ్ వైరస్ చిన్నారులు, ఆఫ్రికా దేశాల వారికి సోకదని, అసలిప్పుడు కొవిడ్ లేనేలేదని వింత వింత నమ్మకాలు ప్రపంచ వ్యాప్తంగా చలామణిలో ఉన్నట్టు తెలిసింది. మరి కొన్ని మారుమూల ప్రాంతాల వారికి, వెనుకబడిన తెగలకు అసలు ఈ మహమ్మారి ఉన్నట్టు తెలియనే తెలియదని రెడ్‌క్రాస్ అధ్యక్షుడు వెల్లడించారు. పాకిస్థాన్‌లో తమ సంస్థ నిర్వహించిన సర్వేలో పదిశాతం మంది కొవిడ్ వ్యాధి అంటే తెలియదని చెప్పటాన్ని ఆయన ఉదహరించారు.
అంతేకాకుండా కరోనా వ్యాక్సిన్ పంపిణీని రాజకీయం చేయటం వల్ల ప్రపంచ దేశాలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఫ్రాన్సెస్కో రోక్కా ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రపంచ ప్రజలకు కొవిడ్ టీకా సక్రమ పంపిణీ జరగాలంటే కొవాక్స్ ద్వారా అందించటమే సరైన విధానమని ఆయన అభిప్రాయపడ్డారు.