ఐరోపా సమాఖ్యలో టీకా పంపిణీ మొదలు!

తాజా వార్తలు

Published : 27/12/2020 18:51 IST

ఐరోపా సమాఖ్యలో టీకా పంపిణీ మొదలు!

వార్సా: కొవిడ్‌-19 మహమ్మారి తాకిడికి ఐరోపా దేశాల సమాఖ్య (ఈయూ)లో భాగస్వాములైన పలు దేశాల ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలిన సంగతి తెలిసిందే. కాగా, ఈయూ పరిధిలోకి వచ్చే 27 దేశాల్లో కరోనా టీకా అందచేసే  కార్యక్రమం నేడు  ప్రారంభమయ్యింది. ఇందులో భాగంగా ఆయా దేశాల్లో  సమాన ప్రాధాన్యతతో, సమగ్ర వ్యాక్సిన్‌ పంపిణీ జరుగుతోంది.

ఐక్యతకు ఉదాహరణ

ఇది ఐక్యతకు ఉదాహరణగా నిలిచి, మనసులను కదిలించే సందర్భంగా పేర్కొంటూ యూరోపియన్ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వోన్‌ డెర్‌ లెయాన్‌ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ శతాబ్దంలోనే అత్యంత భయంకరమైన ప్రజారోగ్య సమస్య కరోనా నుంచి రక్షించే యుద్ధంలో విజయం సాధిస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈయూ సమాఖ్యలో భాగంగా ఉన్న దేశాల్లో సుమారు 1 కోటి 60 లక్షల మందికి కరోనా సోకగా.. వారిలో కనీసం 3 లక్షల 36 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కరోనా మహమ్మారి అమిత ప్రభావం చూపిన ఇటలీ, స్పెయిన్‌ తదితర యూరోపియన్‌ దేశాల్లో పంపిణీ మొదలవటం ఆశాజనక పరిణామంగా భావిస్తున్నారు.

జర్మనీ, ఇటలీలో కూడా మహిళకే..

ఈ నేపథ్యంలో జర్మనీకి చెందిన బయో ఎన్‌టెక్‌, అమెరికా సంస్థ ఫైజర్‌లు ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ల సరఫరా ఈయూలో ప్రారంభమైంది. కాగా, సభ్యదేశాలైన  జర్మనీ, హంగేరీ, స్లొవేకియాల్లో ఒకరోజు ముందే .. అంటే శనివారమే పంపిణీ మొదలైంది. జర్మనీలో తొలి వ్యాక్సిన్‌ను 101 ఏళ్ల వృద్ధ మహిళకు అందచేశారు. ఐతే పలు దేశాలకు తొలివిడత పంపిణీలో భాగంగా పదివేల డోసులు మాత్రమే లభించనున్నాయి. వయోవృద్ధులు, ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న వారికి తొలుత టీకా లభించనుంది. కాగా, జనవరిలో భారీస్థాయిలో వ్యాక్సిన్‌ సరఫరా జరుగగలదని అంటున్నారు. 71 వేల కరోనా మరణాలతో కుదేలైన యూరోప్‌ దేశాల్లో ప్రథమ స్థానంలో ఉన్న ఇటలీలో.. రోమ్‌లోని స్పల్లాన్‌జానీ హాస్పిటల్‌కు చెందిన నర్సుకు తొలి టీకా లభించనుంది. కాగా, ఇది క్రిస్మస్‌ సమయంలో వెల్లడైన శుభవార్త అని ఆయా దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

కొత్తరకంపై ప్రభావవంతమే..

ఇదిలా ఉండగా తొలుత లండన్, దక్షిణ ఇంగ్లాండ్‌లలో తలెత్తిన కొత్తరకం కొవిడ్‌ వైరస్‌.. ఫ్రాన్స్‌, స్పెయిన్‌లకు కూడా వ్యాప్తించింది. మరింత త్వరితంగా వ్యాప్తించే ఈ కొవిడ్‌ వ్యాప్తిని నిరోధించేందుకు అమెరికా, చైనాలు బ్రిటన్‌ నుంచి వచ్చే పర్యాటకులపై ఆంక్షలు విధించే ఆలోచనలో ఉన్నాయి. మరోవైపు, ఈ కొత్త కరోనా వైరస్‌పై తమ వ్యాక్సిన్‌ ప్రభావం చూపగలదని.. జర్మనీ ఫార్మా సంస్థ బయో ఎన్‌టెక్‌ విశ్వాసం వ్యక్తం చేసింది. ఐతే ఇందుకు గాను మరింత అధ్యయనం జరగాల్సి ఉందని ఆ దేశం అంగీకరించింది.

ఇవీ చదవండి..

8 కోట్లు దాటిన కరోనా కేసులు

బ్రిటన్‌ ప్రయాణికుల సన్నిహితులకూ కొవిడ్‌Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని