ఐరాస సమావేశాలకు ‘ఒకేఒక్కడు’..?

తాజా వార్తలు

Published : 31/07/2020 16:15 IST

ఐరాస సమావేశాలకు ‘ఒకేఒక్కడు’..?

సర్వసభ్య సమావేశాలకు డొనాల్డ్‌ ట్రంప్‌ నేరుగా హాజరయ్యే అవకాశం!
తొలిసారిగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వార్షిక సమావేశాలు

న్యూయార్క్‌: ఐక్యరాజ్యసమితి 75వ వార్షిక సమావేశాలకు న్యూయార్క్‌లోని ప్రధాన కార్యాలయం ముస్తాబవుతోంది. అయితే అమెరికాలో కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఈసారి వార్షిక సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగనున్నాయి. సెప్టెంబర్‌లో జరిగే ఈ సమావేశాలు 75ఏళ్ల చరిత్రలో తొలిసారిగా వర్చువల్‌ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. 193 సభ్యదేశాల ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే ప్రసంగించనున్నారు. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం సమావేశాలకు నేరుగా హాజరై ప్రసంగించే అవకాశం ఉందని ఐరాసలో అమెరికా రాయబారి కెల్లీ క్రాఫ్ట్‌ వెల్లడించారు. ఒకవేళ ఇదే జరిగితే ఈసారి ఐరాస సర్వసభ్య సమావేశాలకు వ్యక్తిగతంగా హాజరై ప్రసంగించే ఏకైక నాయకుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అవుతారని కెల్లీ క్రాఫ్ట్‌ అభిప్రాయపడ్డారు.

ఐరాస వార్షిక సర్వసభ్య సమావేశాలు సెప్టెంబర్‌ 22న ప్రారంభం కానున్నాయి. 75వ వార్షిక సమావేశాలు ఐనందున ఈసారి ఒకరోజు ముందే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అయితే ప్రతి ఏటా నిర్వహించే ఈ  సమావేశాల్లో 193 దేశాల నుంచి దేశాధినేతలు, విదేశాంగ మంత్రులు హాజరవుతారు. కానీ, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఉన్న న్యూయార్క్‌ కరోనా వైరస్‌కు కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. దీంతో తొలిసారిగా ఈ సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహిస్తున్నారు.

ఐరాసలో ఉన్న ఆరు ప్రధాన విభాగాల్లో సర్వసభ్య సమావేశం ఒకటి. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ సర్వసభ్య సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఐరాస సభ్యత్వం కలిగిన 193 దేశాలకూ ప్రాతినిధ్యం ఉన్న ఒకేఒక్క విభాగం ఇదే.

ఇదిలా ఉంటే, అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభణ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పటికే అమెరికాలో 45లక్షల మందికి వైరస్‌ సోకగా వీరిలో లక్షా 52వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కోటీ 73లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఇప్పటికే 6లక్షల 73వేల మందిని ఈ వైరస్‌ బలితీసుకుంది.

ఇవీ చదవండి..
యువతకూ ముప్పే..:WHO హెచ్చరిక
కరోనా వ్యాక్సిన్ల రేసులో దేశాల పరుగు..!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని