ఆ అల్లర్ల వెనుక పెద్ద కుట్ర: నిత్యానంద్‌ రాయ్‌

తాజా వార్తలు

Published : 07/10/2020 23:39 IST

ఆ అల్లర్ల వెనుక పెద్ద కుట్ర: నిత్యానంద్‌ రాయ్‌

దిల్లీ: ఈ ఏడాది ఫిబ్రవరిలో దిల్లీలో చోటుచేసుకున్న అల్లర్లు దేశంలో అలజడి సృష్టించేందుకు జరిగిన ఓ పెద్ద కుట్ర అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ వ్యాఖ్యానించారు. కానీ, ఆ సమయంలో హింసను ప్రేరేపించే శక్తుల్ని అణిచివేయడంలో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌ఏఎఫ్‌) వంటి బలగాలు కీలక పాత్ర పోషించాయని ప్రశంసించారు. బుధవారం ఆయన ఆర్‌ఏఎఫ్‌ 28వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. దిల్లీలోని సీఆర్‌పీఎఫ్‌ అకాడమీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్‌ఏఎఫ్‌ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అల్లరి మూకల దుర్మార్గపు చర్యల్ని సైనిక సిబ్బంది దీటుగా ఎదుర్కొన్నారన్నారు. అంతర్గత భద్రత, శాంతి ఈ రెండూ దేశాభివృద్ధికి ఎంతో కీలకమని చెప్పారు. కశ్మీర్‌ లోయలో ఉగ్రకార్యకలాపాలు కొనసాగిస్తున్న ఇద్దరు పాకిస్థాన్‌ టాప్‌ కమాండర్లను హతమార్చారని, పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాలను దీటుగా ఎదుర్కొంటున్నారంటూ సీఆర్‌పీఎఫ్‌ను అభినందించారు.

అంతకముందు ట్వీట్‌ చేసిన నిత్యానంద్‌ రాయ్‌.. ఆర్‌ఏఎఫ్‌ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. దేశంలో శాంతిభద్రతలకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కోవడంలో ఆర్‌ఏఎఫ్‌ తనకు తానే సాటి అని పేర్కొన్నారు. హింసను నియంత్రించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభాగమే ఆర్‌ఏఎఫ్‌. సీఆర్‌పీఎఫ్‌లో అంతర్భాగమైన దీన్ని 1992లో ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా 15 ఆర్‌ఏఎఫ్‌ బెటాలియన్లు (15వేల మందికి పైగా సిబ్బంది) పలు ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి. ఈ సందర్భంగా సీఆర్‌పీఎఫ్‌ డీజీ ఏపీ మహేశ్వరి మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాల్లో నకిలీ సందేశాలు పెద్ద సవాల్‌గా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో సమస్యలు భౌతిక పరమైనవిగా ఉంటే.. తాజాగా సైబర్‌ స్పేస్‌లో వాటిని ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. వీటిని ఎదుర్కోవడం సవాల్‌గా మారిందన్నారు.

ఫిబ్రవరిలో ఈశాన్య దిల్లీలో చోటుచేసుకున్న ఘర్షణల్లో 53 మంది మృతిచెందగా.. 200 మందికి పైగా గాయపడిన విషయ తెలిసిందే. ఇప్పటికే దిల్లీ పోలీసులు దీనిపై పలు ఛార్జిషీట్లు కోర్టులో దాఖలు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని