
తాజా వార్తలు
దిల్లీ: 71ఏళ్లలో అత్యల్ప ఉష్ణోగ్రతలు!
తగ్గిన ఉష్ణోగ్రతలతో రాజధాని గజగజ
దిల్లీ: కనిష్ఠ ఉష్ణోగ్రతలతో దేశ రాజధాని వణికిపోతోంది. దిల్లీలో గత 71ఏళ్లలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన మాసంగా నవంబర్ నెల రికార్డుకెక్కింది. ఈ నెలలో దిల్లీలో సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఏడు దశాబ్దాల తర్వాత నవంబర్ మాసంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని..రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది.
సాధారణంగా దిల్లీలో నవంబర్ మాసంలో సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12.9గా నమోదవుతుంటాయి. ఇప్పటివరకు నవంబర్ మాసంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు 1949 సంవత్సరంలో రికార్డయ్యాయి. అప్పుడు సరాసరి అత్యల్ప ఉష్ణోగ్రత 10.2 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఇక 1938లో అత్యంత తక్కువగా 9.6 డిగ్రీలు, 1930లో 8.9 డిగ్రీల సరాసరి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత సంవత్సరం నవంబర్ మాసంలో 15డిగ్రీలు నమోదుకాగా, 2018లో 13.4డిగ్రీలు, 2016, 2017లలో 12.8 డిగ్రీలుగా నమోదయ్యాయి. 71ఏళ్ల తర్వాత ప్రస్తుతం అత్యల్ప ఉష్ణోగ్రతలతో ఈ నవంబర్ మాసం రికార్డు నమోదుచేసుకుంది.
శీతల గాలులను ఎప్పుడు ప్రకటిస్తారంటే..!
సాధారణంగా 10డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయినప్పుడు లేదా వరుసగా రెండు రోజులు సాధారణం కంటే 4.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు శీతల గాలులుగా (కోల్డ్ వేవ్)గా భారత వాతావరణ శాఖ ప్రకటిస్తుంది. ఒక్కోసారి దిల్లీ లాంటి నగరంలో ఇలా ఉష్ణోగ్రతలు ఒక్కరోజు పడిపోయినా కోల్డ్ వేవ్‌గానే ఐఎండీ పేర్కొంటుంది. ఇదిలా ఉంటే, సోమవారం నాడు అత్యల్పంగా 6.9డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది. నవంబర్ నెలలో ఇప్పటికి ఎనిమిది సార్లు పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక అక్టోబర్ నెలలోనూ రికార్డు స్థాయిలో సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మౌంట్ అబూలో అత్యల్ప ఉష్ణోగ్రతలు..
రాజస్థాన్‌లోని మౌంట్ అబూలో అత్యల్పంగా 2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ముఖ్యంగా చురు (5.5డిగ్రీలు), సిఖర్ (6.0డిగ్రీలు), బిల్వారా (8.0 డిగ్రీలు)లలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రానున్న రోజుల్లో ఉత్తర, మధ్య భారత్‌లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోవడంతో పాటు శీతల గాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.