సరిహద్దుల్లో 60,000 మంది చైనా సైనికులు

తాజా వార్తలు

Updated : 10/10/2020 12:49 IST

సరిహద్దుల్లో 60,000 మంది చైనా సైనికులు

భారత్‌కు అమెరికా చేదోడు అవసరం: మైక్‌ పాంపియో

వాషింగ్టన్‌: భారత్‌- చైనా వాస్తవాధీన రేఖ సమీపంలో డ్రాగన్ 60,000 సైనికులను మోహరించిందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో వెల్లడించారు. కయ్యాలమారి చైనా ప్రవర్తన క్వాడ్‌ దేశాలకు పక్కలో బల్లెంగా మారిందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా లద్దాఖ్‌ ప్రాంతంలో భారత్‌, చైనాల మధ్య చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌, అమెరికాల సంబంధాలు మరింత దృఢమవ్వాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. భారీ సైనిక సమీకరణ దిశగా చైనా పావులు కదుపుతున్న ప్రస్తుత పరిస్థితిలో భారత్‌కు అమెరికా దన్ను అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈయన గతంలో కూడా పలుమార్లు భారత్‌ పక్షాన నిలిచి.. చైనా దుందుడుకుతనాన్ని ఖండించారు.

‘‘ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ పక్షాన అమెరికా ఉండటం చాలా అవసరం. భారత్‌కు వ్యతిరేకంగా చైనా భారీ సైనిక బలగాల సమీకరణ చేపట్టింది. అయితే చైనా వైఖరిని ప్రపంచమంతా గమనిస్తోంది. పరిస్థితులు మారుతున్నాయి. ఈ ప్రమాదాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు ట్రంప్‌ నాయకత్వంలో ఓ కూటమిగా ఏర్పడటం అవసరముంది.’’ అని ఆయన వెల్లడించారు. ఈ వారం టోక్యోలో జరిగిన భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, అమెరికా దేశాల సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌-చైనా సరిహద్దుల్లో లద్దాఖ్‌‌ వద్ద మే నెల నుంచి పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఇక జూన్‌లో ఇరు పక్షాల సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులవ్వగా..  చైనా నిర్ధారించనప్పటికీ 40 మందికి పైగా ఆ దేశ రక్షణ బలగాలు హతమైనట్లు వార్తలొచ్చాయి.

మరోవైపు మైక్‌ పాంపియో, అమెరికా రక్షణశాఖ మంత్రి మార్క్‌ ఎస్పర్‌ చర్చలు జరిపేందుకు ఈ నెల 26, 27 తేదీల్లో భారత్‌ రానున్నారు. ఈ విషయమై అమెరికాలో భారత రాయబారి తరన్‌జిత్‌ సింగ్‌ సంధూ మాట్లాడుతూ.. ప్రస్తుత చైనా సమస్య నేపథ్యంలో మాత్రమే కాకుండా ఇతర విషయాల్లోనూ భారత్‌, అమెరికా మధ్య సంబంధాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. పాంపియో భారత పర్యటనలో రక్షణ సంబంధాల బలోపేతం దిశగా చర్చలు జరగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని