ఎట్టకేలకు బైడెన్‌ గెలుపును గుర్తించిన చైనా!

తాజా వార్తలు

Published : 13/11/2020 16:19 IST

ఎట్టకేలకు బైడెన్‌ గెలుపును గుర్తించిన చైనా!

బీజింగ్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ గెలుపును ఎట్టకేలకు చైనా గుర్తించింది. దాదాపు వారం రోజులు ఆచితూచి వ్యవహరించిన డ్రాగన్‌ మౌనం వీడింది. బైడెన్‌, కమలా హారిస్‌కు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అమెరికా ప్రజల తీర్పును మేం గౌరవిస్తున్నాం. బైడెన్‌, కమలా హారిస్‌కు మా శుభాకాంక్షలు. ఎన్నికల ఫలితాల్ని అమెరికా చట్టాల ప్రకారం ధ్రువీకరిస్తారని భావిస్తున్నాం’’ అని రోజువారీ విలేకరుల సమావేశంలో వెన్‌బిన్‌ వ్యాఖ్యానించారు.  

బైడెన్‌ గెలుపును గుర్తిస్తూ అనేక దేశాలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపినప్పటికీ.. కొన్ని కీలక దేశాలు మాత్రం మౌనం వహిస్తూ వచ్చాయి. అందులో ఒకటైన చైనా తాజాగా మౌనం వీడింది. రష్యా, బ్రెజిల్‌, టర్కీ, మెక్సికో దేశాధినేతలు ఇంకా స్పందించాల్సి ఉంది. ట్రంప్‌ హయాంలో చైనా-అమెరికా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. కొవిడ్‌ వ్యాప్తితో అవి మరింత పతనమయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన బైడెన్ చైనాతో ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తిగా మారింది. చైనా విషయంలో ట్రంప్‌ తీసుకున్న కొన్ని నిర్ణయాల్ని బైడెన్‌ అమలు చేయక తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే డ్రాగన్‌ ఆచితూచి వ్యవహరిస్తోంది.

మరోవైపు పోప్‌ ఫ్రాన్సిస్‌ సైతం బైడెన్‌కు శుభాకాంక్షలు తెలపుతూ.. ఆశీర్వాదాలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన గురువారం బైడెన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోప్‌కు కృతజ్ఞతలు తెలిపిన బైడెన్‌.. ప్రపంచ శాంతి కోసం కలిసి పనిచేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని