
తాజా వార్తలు
రైతుల ఆందోళన.. చర్చలు ఫలించేనా?
ఎనిమిదో రోజుకు చేరిన అన్నదాతల నిరసన
దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తోన్న రైతులతో కేంద్రప్రభుత్వం నేడు మరోసారి భేటీ కానుంది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రులు సమావేశం కానున్నారు. ఇప్పటికే పలు రైతు సంఘాల నేతలు దిల్లీ సరిహద్దుల నుంచి విజ్ఞాన్ భవన్‌కు బయల్దేరారు. అయితే, ఈ చర్చల్లోనైనా తమ డిమాండ్లను పరిష్కరించాలని లేదంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.
అమిత్‌షా.. అమరీందర్ భేటీ..
ఇదిలా ఉండగా.. రైతులతో చర్చలకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో కీలకంగా భేటీ కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమచారం. రైతుల ఆందోళనకు బహిరంగంగా మద్దతు తెలిపిన పంజాబ్ సీఎం కేంద్ర చట్టాలను వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర శాసనసభలో పలు చట్టాలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అమరీందర్ సింగ్‌ను కలిసి రైతుల సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.
ఎనిమిదో రోజుకు ఆందోళన..
మరోవైపు అన్నదాతలు చేపట్టిన ఆందోళన ఎనిమిదో రోజుకు చేరింది. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుడా దిల్లీ శివారుల్లో రైతులు రహదారులపైనే బైఠాయించారు. సింఘ, టిక్రి సరిహద్దుల వద్ద వేలాది మంది శాంతియుతంగా నిరసన సాగిస్తున్నారు. వీరికి మద్దతుగా రాజస్థాన్, గుజరాత్ రైతులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు.
ఆందోళన నేపథ్యంలో దిల్లీలో మరోసారి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సింఘ సరిహద్దును పూర్తిగా మూసేశారు. దిల్లీ-నోయిడా రహదారిని కూడా మూసేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. అయితే, సరిహద్దులు మూసివేయడంతో దిల్లీలో ట్రాఫిక్ సమస్యలు పెరిగాయి. దిల్లీ నుంచి హరియాణా వైపు వెళ్లాలంటే ధన్సా, దౌరాలా, కపషేరా, ఎన్‌హెచ్-8, పాలమ్ విహార్, దున్దహేరా మార్గాలే అందుబాటులో ఉన్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల వైపు వాహనాలను మళ్లించటంతో ఆ రహదారులన్నీ రద్దీగా మారాయి. ట్రాఫిక్ జామ్‌లో గంటల తరబడి వాహనదారులు నిరీక్షించాల్సి వస్తోంది.
వివాహాలకూ ఇబ్బంది
దిల్లీ నుంచి పంజాబ్, హరియాణాలకు వెళ్లే ప్రధాన రహదారులన్నీ రైతులతో నిండిపోవటంతో ఆయా రాష్ట్రాల్లో జరగాల్సిన వివాహాల పైనా ప్రభావంపడుతోంది. ఈ వారంలో పెళ్లిళ్లు జరగాల్సిన వధూవరులు, వారి బంధువుల రాకపోకలకు ఇబ్బందులు తప్పటంలేదు. తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషించుకోవాల్సి వస్తుందని పలువురు వాపోయారు.
రైతుల పోరుకు ఆర్ఎల్డీ మద్దతు
అన్నదాతల అవిశ్రాంత పోరుకు రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) ఉపాధ్యక్షుడు జయంత్ చౌధరి సంఘీభావం తెలిపారు. సింఘు సరిహద్దుల్లో ధర్నా చేస్తున్న రైతులను బుధవారం ఆయన కలిశారు. ఆందోళనకారులకు ఆహారపదార్థాలను అందజేశారు.
ఇప్పటికే మంగళవారం అన్నదాతలో కేంద్రం చర్చలు జరిపినప్పటికీ అవి కొలిక్కి రాలేదు. రైతుల సమస్య పరిష్కారానికి కమిటీని నియమిస్తామని కేంద్రం చేసిన ప్రతిపాదనను రైతు సంఘాలు మూకుమ్మడిగా తిరస్కరించాయి. కమిటీతో తమకు న్యాయం జరగదని, వెంటనే కొత్త చట్టాలను వాపస్ తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో చర్చలను నేటికి వాయిదా వేశారు. ఈ చర్చల్లో వివిధ అంశాలపై అధికారులే సమాధానాలు ఇవ్వనున్నారు. ఇందుకోసం కార్యదర్శి స్థాయి అధికారుల జాబితాను కేంద్రం తయారుచేసినట్లు సమాచారం. వ్యవసాయ, గృహ, వినియోగదారుల మంత్రిత్వశాఖ అధికారులు పాల్గొనే అవకాశాలున్నాయి. కొత్తగా తీసుకొచ్చిన మూడు చట్టాల్లోని ప్రతి అంశాన్నీ వీరే రైతులకు వివరించారు.