ఈ స్టార్స్‌.. కొవిడ్‌ను జయించారు

తాజా వార్తలు

Published : 05/10/2020 14:47 IST

ఈ స్టార్స్‌.. కొవిడ్‌ను జయించారు

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా అతలాకుతలమయ్యాయి. అగ్రరాజ్యం అమెరికా సహా దాదాపు అన్ని దేశాల్లో ఈ వైరస్‌ విజృంభించింది. సామాన్యుల నుంచి ప్రపంచ స్థాయి ప్రముఖుల వరకు కోట్లాది మంది కొవిడ్‌ బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా మూడున్నర కోట్ల మందికి పైగా వైరస్‌ సోకినట్లు ప్రపంచ ఆరోగ్య గణాంకాలు చెబుతున్నాయి. అయితే మానసిక ధైర్యం, వైద్య చికిత్సతో వీరిలో చాలా మంది కొవిడ్‌ నుంచి క్షేమంగా బయటపడుతున్నారు. వైరస్‌ నుంచి కోలుకున్న రాజకీయ, క్రీడా, సినీ రంగాలకు చెందిన ఎంతో మంది అంతర్జాతీయ ప్రముఖుల గురించి ఓ సారి తెలుసుకుందాం..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన సతీమణి మెలానియా ఇటీవలే కొవిడ్‌ బారిన పడ్డారు. తమకు వైరస్‌ పాజిటివ్‌ వచ్చినట్లు ట్రంప్‌ ఈ నెల 1న ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం వీరు సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్‌ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ నటుడు రాబర్ట్‌ పాటిన్సన్‌ సెప్టెంబర్‌ 3న కొవిడ్‌కు గురయ్యారు. దీంతో ఆయన నటిస్తున్న ‘ది బ్యాట్‌మన్‌’ చిత్ర నిర్మాణాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.

బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, ఆయన కుమారుడు, నటుడు అభిషేక్‌ బచ్చన్‌, కోడలు ఐశ్వర్యరాయ్‌ ఈ ఏడాది జులైలో వైరస్‌ బారిన పడి కోలుకున్నారు. 

హాలీవుడ్‌ నటుడు డ్వేన్‌ ‘ది రాక్‌’ జాన్సన్‌ కూడా వైరస్‌ బారిన పడ్డారు. తనకు, తన భార్యాపిల్లలకు కొవిడ్‌ సోకినట్లు డ్వేన్‌ సెప్టెంబరు 2న సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇటీవలే వారంతా వైరస్‌ నుంచి కోలుకున్నారు.

ఈ ఏడాది జులైలో బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బొల్సొనారో, ఆ తర్వాత ఆగస్టులో ఆయన పెద్ద కుమారుడు ఫ్లావియో బొల్సొనారో కొవిడ్‌కు గురయ్యారు. ప్రస్తుతం వారు కోలుకుని తిరిగి ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. 

ప్రపంచ స్థాయి స్ప్రింటర్‌, ఎనిమిదిసార్లు ఒలింపిక్‌ పతక విజేత ఉసెన్‌ బోల్డ్‌ కూడా గత ఆగస్టులో కొవిడ్‌ బారిన పడి కోలుకున్నారు. 

అమెరికా నటుడు బ్రయన్‌ క్రాన్‌స్టన్‌ తనకు కొవిడ్‌ సోకినట్లు జులై 30న ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారు. 

ప్రపంచ అగ్రశ్రేణి టెన్నిస్‌ క్రీడాకారుడు నొవాక్‌ జకోవిచ్‌ జూన్‌లో కొవిడ్‌ బారిన పడ్డారు. ఆ తర్వాత కోలుకున్న జకోవిచ్‌ ఈ మధ్య యూఎస్‌ ఓపెన్‌ సహా పలు టోర్నమెంట్లలో ఆడాడు. 

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వైరస్‌ విజృంభించిన తొలినాళ్లలోనే కొవిడ్‌కు గురయ్యారు. వైరస్‌ సోకి ఏప్రిల్‌ 5న బోరిస్‌ ఆసుపత్రిలో చేరారు. మూడు రోజులు ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉన్న ఆయన.. మనోధైర్యంతో కరోనాను జయించారు. 

ఈ ఏడాది మార్చిలో ఆస్కార్‌ విజేత టామ్‌ హాంక్స్, ఆయన సతీమణి రీటా విల్సన్‌ కూడా కొవిడ్‌కు గురై.. కోలుకున్నారు. 

బ్రిటన్‌ రాజకుమారుడు ప్రిన్స్‌ ఛార్లెస్‌ మార్చి నెలలో కొవిడ్‌ బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో స్కాట్లాండ్‌లోని ఆయన నివాసంలో ఛార్లెస్‌ ఏడు రోజుల పాటు స్వీయనిర్బంధంలోకి వెళ్లారు. 

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో సతీమణి సోఫీ కూడా మార్చిలోనే కరోనాకు గురయ్యారు. దీంతో ప్రధాని కుటుంబం రెండు వారాల పాటు స్వీయనిర్బంధంలోకి వెళ్లింది. ట్రూడో కూడా ఇంటి నుంచే విధులు నిర్వహించారు. ఆ తర్వాత కోలుకున్న సోఫీ.. ఇటీవల ప్లాస్మా దానం కూడా చేశారు. 

వీరే గాక, లైంగిక వేధింపుల కేసులో జైల్లో ఉన్న హాలీవుడ్‌ మాజీ నిర్మాత హార్వే వీన్‌స్టన్‌, మొనాకో రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్‌ ఆల్బర్ట్‌, స్పానిష్‌ ఒపేరా సింగ్‌ ప్లాసిడో డమింగో, మాజీ బాండ్‌ గర్ల్‌ ఓల్గా కురిలెంకో, బ్రిటిష్‌ నటుడు ఇడ్రిస్‌ ఎల్బా, యూఎస్‌ నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ రాబర్ట్‌ ఓబ్రెయిన్‌ తదితరులు కొవిడ్‌ నుంచి క్షేమంగా కోలుకున్నారు. 

మనదేశంలోనూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సహా పలువురు రాజకీయ నేతలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సినీ, క్రీడా రంగానికి చెందిన ఎందరో ప్రముఖులు కరోనాను జయించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని