ఉపాధ్యక్ష అభ్యర్థిగా మరో భారత సంతతి వ్యక్తి

తాజా వార్తలు

Updated : 29/10/2020 18:06 IST

ఉపాధ్యక్ష అభ్యర్థిగా మరో భారత సంతతి వ్యక్తి

పీఎస్‌ఎల్‌ తరపున అమెరికా ఎన్నికల్లో పోటీ

వాషింగ్టన్‌: అమెరికాలో నవంబర్‌ 3న జరగనున్న ఎన్నికల్లో మొత్తం ఇద్దరు భారత సంతతి వ్యక్తులు ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. డెమొక్రటిక్‌ అభ్యర్థిగా కమలా హారిస్‌ ప్రముఖం కాగా.. తాజాగా సునీల్‌ ఫ్రీమన్‌ అనే మరో అభ్యర్థి పేరు వెలుగులోకి వచ్చింది. ఈయన ‘పార్టీ ఫర్‌ సోషలిజం అండ్‌ లిబరేషన్’ (పీఎస్‌ఎల్‌) తరపున పోటీ చేస్తున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా కమల సోషలిస్టు అయితే.. సునీల్‌ మరింత కరడుగట్టిన సోషలిస్టు అని అధ్యక్షుడు ట్రంప్‌ అభివర్ణించారు.

సునీల్‌ ఫ్రీమన్‌ ఎవరు?

సునీల్‌ ఫ్రీమన్‌ తల్లి ఫ్లోరా నవితా భారత్‌కు చెందిన మహిళ కాగా.. ఆయన తండ్రి ఛార్లెస్‌ ఫ్రీమన్‌ అమెరికన్‌. దశాబ్దాల తరబడి అమెరికాలోనే ఉన్నా తన తల్లి ఇంట్లో చీరలనే ధరిస్తారని.. ఆమెకు ఇప్పటికీ భారతీయ పౌరసత్వం ఉందని 65 ఏళ్ల సునీల్‌ తెలిపారు. దిల్లీకి చెందిన ఫ్లోరా లఖ్‌నవూలోని ఇసాబెల్‌ థౌబర్న్‌ కళాశాలలో పట్టభద్రులయ్యారు. ఇక సునీల్‌ వాషింగ్టన్‌లో పెరిగారు. తన చిన్నతనంలో మొత్తం మూడేళ్లు భారత్‌లో ఉన్నానని.. పదేళ్ల వయసులో భారత పర్యటన తన జీవితంలో బలమైన ముద్ర వేసిందని ఆయన అన్నారు.

తమ పీఎస్‌ఎల్‌ పార్టీ కమ్యూనిస్ట్‌ సిద్ధాంతాలను అవలంబిస్తుందని సునీల్‌ వివరించారు. అయితే తాము హింసామార్గంలో కాకుండా.. చట్టబద్ధంగా మార్పు తెచ్చేందుకే కట్టుబడి ఉన్నామన్నారు. తమ ఆశయాలను చేరుకునేందుకు సోషలిజాన్ని సోపానంగా భావిస్తామన్నారు. అయితే ఇందుకు చాలా సమయం తీసుకుంటుందని ఆయన అంగీకరించారు. ఈ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా నిలబడుతున్న గ్లోరియా లా రివా 2008 ఎన్నికల్లో కూడా పోటీచేశారు. తమ పార్టీ కాలిఫోర్నియా, న్యూజెర్సీ, ఇల్లినాయిస్‌ తదితర 14 రాష్ట్రాల్లో మాత్రమే పోటీ చేస్తోందని ఆయన తెలిపారు.

అమ్మ చెప్పింది..

స్వాతంత్ర్యానికి పూర్వం భారతీయ విద్యార్థులను ఆంగ్లేయ చిన్నారులు ఏ విధంగా చులకన చేసేవారో తన తల్లి చెప్పారన్నారు. శరణార్థుల శిబిరాల్లో సేవ చేసిన ఆమె.. అక్కడ ఉండేవారి దీన స్థితిని గురించి కూడా తనకు వివరించారని సునీల్‌ తెలిపారు. అయితే తన తండ్రి ఛార్లెస్‌ వర్ణవివక్షకు పూర్తి వ్యతిరేకి అని.. ఆయన అమెరికన్‌ శాంతి స్థాపక సంఘం సభ్యుడిగా భారత్‌ను పలుమార్లు సందర్శించారని  వెల్లడించారు.

తన ప్రత్యర్థి కమలా హ్యారిస్‌ గురించి కూడా సునీల్‌ ఫ్రీమన్‌ స్పందించారు. ఆమె కాలిఫోర్నియా ప్రాసిక్యూటర్‌గా ఉండగా పేదలకు, శ్రామికులకు వ్యతిరేకంగా తన అధికారాన్ని వినియోగించేవారని ఆయన విమర్శించారు. వారిపట్ల కఠినంగా వ్యవహరించేవారని అంతేకాకుండా తప్పుచేసిన కొందరి పట్ల ఆమె చూసీ చూడనట్టు వ్యవహరించేవారని ఆరోపించారు. నిక్కీ హేలీ, కమలా హారిస్‌ అనంతరం ఇప్పుడు సునీల్‌ ప్రవేశం అగ్రరాజ్య  రాజకీయ వేదికపై విస్తరిస్తున్న భారతీయుల పరపతిని సూచిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని