close

తాజా వార్తలు

Updated : 02/12/2020 12:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘అమెరికా భారీ సంక్షోభంలో ఉంది’

వెంటనే గాడినపెడతామన్న నూతన ఆర్థిక మంత్రి యెల్లెన్‌

వాషింగ్టన్‌: అమెరికా మరోసారి చరిత్రాత్మక ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయిందని ఆ దేశ కాబోయే ఆర్థిక మంత్రి జానెట్‌ యెల్లెన్‌ తెలిపారు. వీలైనంత త్వరగా స్పందించి చర్యలు తీసుకోకపోతే మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ తమ బృందంపై ఉన్న బాధ్యతను గుర్తుచేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌ తమ పాలక వర్గంలోని ఆర్థిక బృందాన్ని మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యెల్లెన్‌ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో తమపై ఉన్న సవాళ్లు, వాటిని ఎలా అధిగమించనున్నారో వివరించారు. 

ప్రజలకు ఉపాధి కల్పించి వారిని ఆర్థికంగా పరిపుష్టం చేయడంపైనే ఇన్నాళ్లు తన కృషి కొనసాగిందని యెల్లెన్‌ తెలిపారు. బైడెన్ సైతం తన జీవితం మొత్తం ఆ దిశగానే పనిచేశారని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి అమెరికా ప్రజల ఆర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని తెలిపారు. అనేక మంది జీవనోపాధి కోల్పోయారన్నారు. చిరు వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. ఆహారం, అద్దె కోసం కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వీలైనంత త్వరగా దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లేదంటే మరింత గడ్డుకాలం ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. నిర్మాణాత్మక లోపాలపై ప్రధానంగా దృష్టి సారిస్తామన్నారు. ఆర్థిక అసమానత్వం, స్థిర వేతనాల వంటి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.  

ఈ సందర్భంగా యెల్లెన్‌పై బైడెన్‌ ప్రశంసల వర్షం కురింపించారు. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్ని యెల్లెన్‌ కంటే సమర్థంగా ఎవరూ ఎదుర్కోలేరని అభిప్రాయపడ్డారు. ప్రజల ఆర్థిక పరిస్థితులు, జీవనోపాధిపై ఆమెకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. సమకాలీన ప్రపంచంలో ఉన్న ఉత్తమ ఆర్థికవేత్తల్లో యెల్లెన్‌ ఒకరని కీర్తించారు. అలాగే తాను ఎంపిక చేసిన ఆర్థిక బృందం ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణను వీలైనంత త్వరగా సుసాధ్యం చేయనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉద్యోగాల కల్పన, ప్రజల ఆదాయాల పెరుగుదల, ఔషధాల ధరల తగ్గింపు, వివిధ వర్గాల మధ్య ఆర్థిక అంతరం వంటి సమస్యల్ని రూపుమాపడంలో విశేషంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బడ్జెట్‌ చీఫ్‌గా ఎన్నికైన భారతీయ అమెరికన్‌ నీరా టాండన్‌పైనా బైడెన్‌ ప్రశంసలు కురిపించారు. సుదీర్ఘకాలంగా టాండన్‌తో పరిచయం ఉందని.. కీలక విధానకర్తగా అద్భుతమైన సేవలు అందించనున్నారని కొనియాడారు.    


Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని