close

తాజా వార్తలు

ఆ రైలు ఆలస్యం.. 630 మందికి రిఫండ్‌!

దిల్లీ: ముంబయి- అహ్మదాబాద్‌ స్టేషన్ల మధ్య ఇటీవల పట్టాలెక్కిన తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆలస్యమైతే రిఫండ్‌ చేస్తామంటూ ఐఆర్‌సీటీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నెల 19న అహ్మదాబాద్‌ - ముంబయి తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు గంటన్నర పాటు ఆలస్యమైంది. దీంతో ప్రయాణికులకు పరిహారం చెల్లించేందుకు ఐఆర్‌సీటీసీ సిద్ధమైంది. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 19న అహ్మదాబాద్‌ నుంచి బయల్దేరిన తేజస్‌ గంటన్నర పాటు ఆలస్యమైంది. ఐఆర్‌సీటీసీ ప్రకటించిన విధానం ప్రకారం.. ప్రయాణికులందరికీ పరిహారం రిఫండ్‌ చేయనుంది. దీనిపై ఐఆర్‌సీటీసీ అధికార ప్రతినిధి చెప్పిన వివరాల ప్రకారం.. ఒక్కొక్కరికి  రూ.100 చొప్పున మొత్తం 630 మంది ప్రయాణికులకు చెల్లించనున్నట్టు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. అయితే, ఈ పరిహారాన్ని క్లెయిమ్‌ చేసుకొనేందుకు ప్రయాణికులు పీఎన్‌ఆర్‌ వివరాలను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వాటిని ధ్రువీకరించిన తర్వాత మొత్తాన్ని రిఫండ్‌ చేస్తామని తెలిపారు. 

మరోవైపు, ఈ రైలు ఆలస్యానికి గల కారణాలను భారతీయ రైల్వే అధికారులు వివరించారు. ‘‘తేజస్‌ రైలు అహ్మదాబాద్‌ నుంచి ఉదయం 6.42 గంటలకు ముంబయి బయల్దేరింది. అప్పటికే రెండు నిమిషాలు ఆలస్యంగా బయల్దేరిన ఈ రైలు ముంబయి సెంట్రల్‌కు మధ్యాహ్నం 1.10గంటలకు చేరుకోవాల్సి ఉంది. కానీ  మధ్యాహ్నం 2.36 గంటలకు చేరింది. ముంబయి శివార్లలోని బయాందర్‌ స్టేషన్‌, దాహిసర్‌ స్టేషన్ల  వద్ద కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొన్ని సబర్బన్‌ రైళ్లు నిలిచిపోయాయి. దీంతో తేజస్‌ రైలు ఆలస్యమైంది’’ అని వివరించారు. అయితే, తేజస్‌కు సంబంధించి ఐఆర్‌సీటీసీ ప్రకటించిన పాలసీ ప్రకారం గంట ఆలస్యానికి 100, రెండు గంటల ఆలస్యానికి రూ.250ల చొప్పున రిఫండ్‌ చేయాల్సి ఉంటుంది. క్లెయిమ్‌ చేసుకొనేవారి సంఖ్యను బట్టి ఐఆర్‌సీటీసీ రూ.63000 వరకు చెల్లించే అవకాశం ఉంది. ఈ రైలు ఆలస్యమైతే ప్రయాణికులు రిఫండ్‌ను క్లెయిమ్‌ చేసుకొనేందుకు 18002665844 కు ఫోన్‌ చేయడం లేదా irctcclaims@libertyinsurance.inకు మెయిల్‌ చేయవచ్చు. ఇందుకోసం ప్రయాణికులు తమ పీఎన్‌ఆర్‌ నంబర్‌ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. 

ఐఆర్‌సీటీసీ ఆధునిక సదుపాయాలతో పట్టాలెక్కించిన రెండో తేజస్‌ రైలు సేవలు ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యాయి.  అహ్మదాబాద్‌ నుంచి ఈ రైలును గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ పచ్చజెండా ఊపి ప్రారంభించిన విషయ తెలిసిందే. అహ్మదాబాద్‌-ముంబయి (500కి.మీ) మధ్య నడిచే ఈ రైలును రైల్వే శాఖకు అనుబంధంగా ఉండే ఐఆర్‌సీటీసీ నడుపుతుంది. ప్రతిరోజు అహ్మదాబాద్‌లో ఉదయం 6.40కు ప్రారంభమై ముంబయికి మధ్యాహ్నం 1.10కి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ముంబయిలో మధ్యాహ్నం 3.40కి ప్రారంభమై అహ్మదాబాద్‌కు రాత్రి 9.55కి చేరుకుంటుంది. తొలి తేజస్‌ రైలును దిల్లీ-లఖ్‌నవూల మధ్య ఐఆర్‌సీటీసీ నడుపుతున్న విషయం తెలిసిందే. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.