Corona: కేరళలో తగ్గని ఉద్ధృతి.. కర్ణాటకలోనూ పెరిగిన కేసులు

తాజా వార్తలు

Published : 29/07/2021 20:47 IST

Corona: కేరళలో తగ్గని ఉద్ధృతి.. కర్ణాటకలోనూ పెరిగిన కేసులు

తిరువనంతపురం‌: కరోనా మహమ్మారి కేరళను కుదిపేస్తోంది. దేశమంతా కేసులు తగ్గుముఖం పట్టినట్టు కనబడుతున్నా.. కేరళ మాత్రం భారీ సంఖ్యలో కేసులతో నంబర్‌ 1 హాట్‌స్పాట్‌గా కొనసాగుతుండటం కలవరానికి గురిచేస్తోంది. దీంతో శని, ఆదివారాల్లో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ) డైరెక్టర్‌ ఎస్‌కే సింగ్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల బృందాన్ని కేరళకు పంపిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్విటర్‌లో వెల్లడించారు. 

మరోవైపు, గురువారం కొత్తగా 22,064 కేసులు, 128 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 33,49,365కి చేరగా.. మరణాల సంఖ్య 16,585కి పెరిగింది. 24గంటల్లో అక్కడ 1,63,098 పరీక్షలు నిర్వహించినట్టు ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ ప్రకటించారు. మలప్పురం జిల్లాలో రికార్డు స్థాయిలో 3679 కేసులు రాగా.. త్రిస్సూరు జిల్లాలో 2752, కోలికోడ్‌లో 2619, ఎర్నాకుళం 2359, పాలక్కడ్‌ 2034 చొప్పున కొత్త కేసులు వచ్చినట్టు ఆమె వివరించారు. 

దేశంలో ప్రస్తుతం 4.03లక్షల క్రియాశీల కేసులు ఉండగా.. వాటిలో దాదాపు 1.5లక్షల పాజిటివ్‌ కేసులు (37శాతం) ఒక్క కేరళలోనే ఉన్నట్టు  ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కేరళలో కరోనా కేసుల పెరుగుదలను చూస్తుంటే థర్డ్‌ వేవ్‌ ప్రారంభమైనట్టుగా కనబడుతోందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్‌ తోపె వ్యాఖ్యానించడం గమనార్హం. మే నెలలో సెకండ్‌ వేవ్‌తో దేశం అల్లాడుతున్న సమయంలో కేరళలో రోజుకు 43వేలకు పైగా కేసులు నమోదయ్యేవి. ఆ తర్వాత జూన్‌ తొలి వారం నాటికి క్రమంగా తగ్గడం ప్రారంభించాయి. అప్పటితో పోలిస్తే తాజాగా దాదాపు రోజుకు 22వేల కేసులు వస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. కేరళలో వీక్లీ పాజిటివిటీ రేటు 10.5శాతం నుంచి 14.8శాతం మధ్య కొనసాగుతోంది. గత ఎనిమిది వారాలుగా 10శాతానికి తగ్గకపోవడం గమనార్హం. అలాగే, జూన్‌ 3నుంచి జూన్‌ 9 మధ్య కాలంలో రోజువారీ పరీక్షలు సగటున 1.11లక్షల చొప్పున ఉండగా.. జూన్‌ 22 జులై 28నాటికి ఆ సంఖ్య సగటున 96వేలకు చేరినట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. 

మరోవైపు, కర్ణాటకలోనూ కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 2052 కొత్త కేసులు రాగా.. 35మరణాలు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే గురువారం దాదాపు 500 కేసులు పెరగడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 29,01,247కి చేరగా.. మరణాల సంఖ్య 36,491కి పెరిగింది. ప్రస్తుతం 36,491 క్రియాశీల కేసులు ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని