మాస్కు ధరిస్తారా..లాక్‌డౌన్‌ విధించాలా?

తాజా వార్తలు

Published : 12/10/2020 11:07 IST

మాస్కు ధరిస్తారా..లాక్‌డౌన్‌ విధించాలా?

ప్రజలనే తేల్చుకోమన్న మహారాష్ట్ర సీఎం

ముంబయి: మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఆదివారం నాటికి రాష్ట్రంలో 15,28,226 కేసులు నమోదయ్యాయి. వీరిలో 40,349 మంది మరణించారు. గత కొన్ని రోజులుగా క్రియాశీలక కేసులు తగ్గుతూ వస్తున్నా.. ఆదివారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల్ల్లో మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ముంబయిలో కేసుల ఉద్ధృతి ఏమాత్రం అదుపులోకి రావడం లేదు. కరోనా రెండో విడత విజృంభించే అవకాశం ఉందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రజలకు ఆల్టిమేటం జారీ చేశారు. మాస్కులు ధరిస్తారా లేదా లాక్‌డౌన్‌ విధించమంటారా అని సూటిగా ప్రశ్నించారు. దీనిపై ప్రజలే నిర్ణయించుకోవాలని తేల్చి చెప్పారు.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తుందని ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. కానీ, ప్రజల నిర్లక్ష్య వైఖరి వల్ల మళ్లీ విజృంభించే అవకాశం ఉందని హెచ్చరించారు. పండగల సీజన్‌ రానున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐరోపా దేశాల తరహాలో రెండోసారి లాక్‌డౌన్ విధించే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. ‘‘మాస్కు ధరిస్తారా లేక రెండోసారి లాక్‌డౌన్‌ విధించాలా? ఆంక్షలన్నీ మళ్లీ అమలు చేయాలా లేక సామాజిక దూరం పాటిస్తారా? మీరే నిర్ణయించుకోండి’’ అని తేల్చి చెప్పారు.  

లోకల్‌ రైళ్లలో మరింత మంది ప్రయాణించేందుకు అనుమతిస్తామని తెలిపారు. ఈ మేరకు రైల్వే శాఖకు కూడా విజ్ఞప్తి పంపుతామన్నారు. కానీ, ఎక్కువ మంది గుమిగూడకుండా జాగ్రత్త పడాలని ప్రజలకు సూచించారు. ఇక వ్యాయామశాలల్లో కూడా సరైన నిబంధనలు పాటించాలన్నారు. పండగల సీజన్‌ నేపథ్యంలో ఆలయాల్ని ఇప్పుడప్పుడే తెరిచేది లేదన్నారు. భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ క్రమంగా అన్ని కార్యకలాపాల్ని పునరుద్ధరిస్తామన్నారు.

ముంబయిలో చాలా మంది మాస్కులు లేకుండానే తిరుగుతున్న విషయాన్ని తాను స్వయంగా గమనించానని ఉద్ధవ్‌ తెలిపారు. దీనికి రెండు కారణాలున్నాయన్నాయని వివరించారు. ఒకటి.. కొవిడ్‌ ఉందని అని తేలితే తమని ఎక్కడికి తీసుకెళ్తారో అని ప్రజలు భయపడుతున్నారన్నారు. కానీ, వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయన్నారు. కొవిడ్‌ కేంద్రాల్లో చికిత్స పొంది కోలుకున్న వారిని పరిశీలిస్తే అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో అర్థమవుతుందన్నారు. రెండోది.. బాధ్యతారాహిత్యం. దీన్ని మార్చుకోకపోతే తీవ్ర నష్టం చవిచూడాల్సిందేనని హెచ్చరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని