ఇది అహ్మదాబాద్‌ కాదు హైదరాబాద్‌
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇది అహ్మదాబాద్‌ కాదు హైదరాబాద్‌

భాజపా మాయ మాటలను ఇక్కడి ప్రజలు నమ్మరు
ఐదేళ్లలో హైదరాబాద్‌ను పెట్టుబడుల స్వర్గధామంగా మార్చాం
శాంతిభద్రతలు, తాగునీరు సహా అన్ని రంగాల్లో స్పష్టమైన మార్పు
మహానగర ప్రతిష్ఠను కాపాడటంలో రాజీపడబోం
ఎన్నికల తర్వాత వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం
ఫిబ్రవరిలోగా జీహెచ్‌ఎంసీకి కొత్త చట్టం తెస్తాం
కేంద్రం పైసా విదల్చడం లేదనేది నూరు శాతం నిజం
వరదసాయంగా కర్ణాటక, గుజరాత్‌కు నిధులు..
తెలంగాణకు మొండిచేయా?
కిషన్‌రెడ్డి పైసా తేలేదని ఆక్షేపణ
‘ఈనాడు’ ముఖాముఖిలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌
ఈనాడు - హైదరాబాద్‌

బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చిన వాళ్లంతా తెలంగాణ బిడ్డలే. వీరితో ఏ తగాదా లేదు. అభివృద్ధి తప్ప మాకు మరో ధ్యాస లేదు. అభివృద్ధి-సంక్షేమం ఎజెండాతో సీఎం ముందుకెళ్లారు. దాని ఫలితంగానే నగరంలో ఆరేళ్లుగా ఎలాంటి ఉద్రిక్తతలు లేవు.

తెరాస అభివృద్ధి ఎజెండాతో ముందుకెళ్తోంది. భాజపా విద్వేషాలు రెచ్చగొట్టే పంథాను అనుసరిస్తోంది.హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజీకి నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది. అభివృద్ధి పనులతో పాటు నగరంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటాం. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి, మంటల్లో చలికాచుకోవాలని ప్రయత్నించడం సమర్థనీయం కాదు. వారు చెప్పే మాయమాటలు నమ్మడానికి ఇది అహ్మదాబాద్‌ కాదు. హైదరాబాద్‌’ అని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కె.టి.రామారావు పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ‘ఈనాడు’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గత ఆరేళ్లలో చేపట్టిన పనులు. చేపట్టబోయే పనుల గురించి మంత్రి వివరించారు.

వికాసమా.. విద్వేషమా!
తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ అభివృద్ధిలో స్పష్టమైన మార్పు వచ్చిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి రాష్ట్రానికి నిధులేమీ తేలేదని, కనీసం ఆయన నియోజకవర్గానికి కూడా రూపాయి అదనంగా తీసుకురాలేకపోయారని ఆక్షేపించారు. సొంత నియోజకవర్గానికి రూపాయి అదనంగా తేలేని వారు రాష్ట్రానికి, జీహెచ్‌ఎంసీకి ఏం చేయగలరని ఎద్దేవా చేశారు. ‘తెరాస హైదరాబాద్‌కు ఏం చేసిందని ప్రశ్నించే వారికి వంద పనులు చూపిస్తాం. భాజపా కేంద్రంలో అధికారంలో ఉండి ఏం చేసిందో చెప్పగలరా? ఒకాయన రూ.25 వేలు ఇస్తామంటున్నారు. ఎలా ఇస్తారు. ’ అని నిలదీశారు. ఇదంతా ఎన్నికల కోసం చేసే ఆపద మొక్కుల వ్యవహారమని అభివర్ణించారు. కాంగ్రెస్‌ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో లేదని, ఆ పార్టీ ఇక్కడి అభివృద్ధికి చేయగలిగిందేమీ లేదని పెదవి విరిచారు.  

అగ్గిమండాలా? చల్లగుండాలా?
మేము ఫలానా పనిచేశాం. ఫలానా పనులు చేస్తామని చెప్పి ఓట్లు అడుగుతున్నాం. వాళ్లు తెల్లారింది మొదలు హిందూ,ముస్లింల మధ్య ఉద్రిక్తతలు పెంచడం, ఇండియా-పాకిస్థాన్‌ గురించి మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఉన్న మంచి వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చలాన్లు రద్దు చేస్తామనే వారు బెంగళూరులో, అహ్మదాబాద్‌లో ఎందుకు చేయరో చెప్పాలి.
 2014 ముందు హైదరాబాద్‌కు, తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌కు తేడా ఏమిటి?
తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడే ముందు, ఏర్పడే నాటికి ఉన్న పరిస్థితులను గుర్తుచేసుకోవాలి. ఇంకేం అభివృద్ధి చేస్తారు? పరిపాలనైనా చేయగలరా? అనే అనుమానాల మధ్య రాష్ట్రం ఆవిర్భవించింది. అన్నింటినీ మించి హైదరాబాద్‌ ఒక మినీ భారతదేశం. అన్నికులాలు, మతాలు ఉండే ఈ నగరంలో ఏ చిన్న పొరపాటు జరిగినా మొత్తం రాష్ట్రానికే నష్టం కదా! అనే ఆందోళన ప్రతిఒక్కరి మనసులో ఉండేది. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక అసాధారణ పరిణితిని ప్రదర్శించారు. అధికారం చేపట్టగానే అనేక సంస్కరణలు తెచ్చాం. ప్రజల కనీస అవసరాలు తీర్చడం ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యంగా భావించాం. తెరాస అధికారంలోకి వచ్చేనాటికి తాగునీటికి కటకటలాడే పరిస్థితి. ఈ కారణంగానే రోజూ కాలనీల్లో గొడవలు జరిగేవి. మూడేళ్లలోనే పరిస్థితి మారిపోయింది. మొత్తమ్మీద తాగునీటి సమస్యను 90-95 శాతం వరకు పరిష్కరించాం. ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త, ఇప్పుడు కరెంటు పోతే వార్త. ఇది ప్రజల అనుభవంలో ఉంది. వైద్యానికి ప్రాధాన్యం ఇచ్చి బస్తీ దవాఖానాలు ప్రారంభించాం. ఐటీ, పరిశ్రమలు, రోడ్లు, పారిశుద్ధ్యం..ఇలా అన్నింటిలోనూ స్పష్టమైన మార్పు వచ్చింది. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాలు చేపట్టాం. మిస్సింగ్‌ రోడ్లు, లింకురోడ్లు.. ఇలా చాలా పనులు చేపట్టాం. ఇంతెందుకు పారిశుద్ధ్యం సంగతే తీసుకుందాం! రాష్ట్రం ఏర్పడే నాటికి 3,500 టన్నుల చెత్త సేకరించే వారు. స్వచ్ఛ  హైదరాబాద్‌లో భాగంగా ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ప్రస్తుతం ఆరువేల టన్నుల చెత్త సేకరిస్తున్నాం. దాని ద్వారా 28 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నాం. మరో 28 మెగావాట్ల ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించాం. ఇలా ప్రజల కనీస అవసరాలు తీరుస్తూనే..శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యమిచ్చాం. నగరంలో ఐదు లక్షల సీసీ టీవీ కెమెరాలున్నాయి. వీటిని త్వరలో పది లక్షలకు పెంచనున్నాం. ఎక్కడ ఏం జరిగినా పోలీసులకు క్షణాల్లో తెలిసిపోతుంది. సమీకృత కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థను ప్రారంభించాం. ఇవన్నీ తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన, కళ్లెదుట కనిపించే మార్పులు. ఇలాంటి మార్పుల వల్లే అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించగలుగుతున్నాం. 2001లో ఏర్పడిన ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాయి. తెలంగాణ మాత్రం ఆరేళ్లలోనే అభివృద్ధి దశకు చేరుకుని, వేగంగా ముందుకెళ్తోంది.

 

 ఎన్నికల తర్వాత వరద సాయం కొనసాగుతుందా?
ఎన్నికలు ముగిసిన తర్వాత కచ్చితంగా అర్హులైన వారికి సాయం అందిస్తాం. రెండు పడకల ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ. అవి కూడా పూర్తిచేసి అందజేస్తాం. కాంగ్రెస్‌, తెదేపా ప్రభుత్వాలు 1983 తర్వాత బలహీన వర్గాలకు చెందిన 45 లక్షల మందికి ఇళ్లు కట్టామంటున్నాయి. అంతమందికి ఇళ్లు ఇచ్చి ఉంటే మళ్లీ సమస్య ఎందుకొచ్చిందో ఆ పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. సొంత జాగా ఉంటే లక్ష మందికి ఇళ్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేయాలనుకున్నాం. కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. రూ.52 వేల కోట్ల ఆదాయం తగ్గింది. కేంద్రం నిర్వాకం వల్ల సాయం అందడం లేదు. వచ్చే బడ్జెట్‌లో పేదలకు గృహ నిర్మాణానికి సాయం అందిస్తాం.

అభివృద్ధి నగరం నలు దిక్కులా విస్తరించడం లేదు. శివారు ప్రాంతాలు ఇంకా అలాగే ఉన్నాయనే విమర్శలకు మీ సమాధానం ఏమిటి?
హైదరాబాద్‌లో కోర్‌ సిటీ ప్రధానమైంది. ఇది 625 చ.కి.మీ. పరిధిలో ఉంది. ఇంకోటి ఔటర్‌ రింగ్‌రోడ్డు అవతల ఉంది. కోర్‌ సిటీలో జన సాంద్రత ఎక్కువ. ఓ.ఆర్‌.ఆర్‌ లోపలే కోటి 50 లక్షల జనాభా నివసిస్తోంది. శివారు ప్రాంతాల్లోనూ (సబర్బన్‌ ఏరియాలో) సమతుల్యతతో కూడిన అభివృద్ధి జరిగితేనే కోర్‌సిటీపై ఒత్తిడి తగ్గుతుంది. మరోవైపు ఐ.టి.రంగంలో పెట్టుబడులు పశ్చిమ హైదరాబాద్‌ వైపు ఎక్కువగా రావడం వల్ల కొండాపూర్‌, మాదాపూర్‌, నానక్‌రాంగూడ, గోపనపల్లి తదితర ప్రాంతాల్లోనూ జనసాంద్రత పెరుగుతుంది. దీన్ని గుర్తించే అన్ని వైపులా నగరాన్ని విస్తరించే వ్యూహంతో గ్రిడ్‌ పాలసీ(అభివృద్ధి వికేంద్రీకరణ) తెచ్చాం. ఉప్పల్‌లో ఐదు ఐటీ పార్కులకు అనుమతిచ్చాం. కొంపల్లిలో ఐ.టి. టవర్‌కు శంకుస్థాపన చేయాలనుకునేలోపే ఎన్నికలు వచ్చాయి. ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపరిచే ఉద్దేశంతో మెట్రోరైలు రెండో దశ, ఎం.ఎం.టి.ఎస్‌, విమానాశ్రయం దాకా మెట్రో విస్తరణ తదితరాలు చేయబోతున్నాం. నగరంపై ఒత్తిడి తగ్గించేందుకు ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీ తెచ్చాం.

హైదరాబాద్‌కు కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదనేది మీ ప్రధాన ఆరోపణ. భాజపా నాయకులు మాత్రం కేంద్రం ఇచ్చింది కూడా మీరు ఖర్చుపెట్టలేదంటున్నారు. ఇందులో ఏది నిజం?
ఈ విషయంలో కేంద్ర మంత్రులు, నాయకులు చాలా బాధ్యతా రహితంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ నుంచి అన్ని రకాల పన్నుల రూపంలో ఆరేళ్లలో కేంద్రానికి వెళ్లింది రూ.2.72 లక్షల కోట్లు. ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రానికి తిరిగి వచ్చింది రూ.లక్షా 40 వేల కోట్లు. అదంతా చట్టబద్ధంగా రావాల్సిందే. అంటే తెలంగాణ కేంద్రానికి నిధులు ఇచ్చినట్టా? కేంద్రం తెలంగాణకు సొమ్ములు ఇచ్చినట్టా! రూపాయి కడితే అర్ధ రూపాయి వెనక్కు ఇచ్చి మేము చాలా ఇచ్చామంటూ మాట్లాడటం హాస్యాస్పదం. ఆరేళ్లలో తెలంగాణకు కేంద్రం రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదు.

అభివృద్ధా? విధ్వంసమా? ఏది కావాలో తేల్చుకోండి అంటున్నారు. భాజపాకు ఆధిక్యం వస్తే అలాంటి పరిస్థితి వస్తుందని చెప్పదలచుకున్నారా?
భాజపాకు ఆధిక్యం అనే మాట లేదు. కాకపోతే ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేది ఆ పార్టీ వ్యూహం. మంటల్లో చలికాచుకోవాలనే ఆలోచన. ‘నిన్న ఏదో ధర్నా చేయాలనుకున్నారు. హైదరాబాద్‌లో గుళ్లూ గోపురాలకు కొదవ ఉందా? బిర్లామందిర్‌కు పోవచ్చు. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి వెళ్లొచ్చు. లేదంటే అంజన్న ఆలయాన్ని దర్శించుకోవచ్చు. పాతబస్తీకి వెళ్లడం ఎందుకు. హిందూ, ముస్లిం  పంచాయితీ పెట్టాలనే కదా!’ ఈ ఆలోచనా విధానమే మంచిది కాదు. ఈయన కరీంనగర్‌లోనూ ఇలాగే చేశారు. ఇక్కడా అలా చేయాలనుకుంటున్నారు.  హైదరాబాద్‌ తెలంగాణకు కీలకం. ఆర్థిక పురోగతికి ఇంజిన్‌ లాంటిది. దాన్ని పాడు చేసుకుంటే రాష్ట్రానికి ప్రమాదకరమనే ఈ విషయం చెప్తున్నా.

రోడ్లపై గుంత చూపితే రూ.వెయ్యి ఇస్తామని గతంలో చెప్పారు. అనేకచోట్ల రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. వేసిన రోడ్లు వెంటనే పాడవుతున్నాయి. మెరుగైన రోడ్ల నిర్మాణం ఎప్పటికి సాధ్యమవుతుంది?
రోడ్లకు సంబంధించి రెండు రకాల ముఖ్యమైన సమస్యలున్నాయి. రోడ్డు వేయడం, దెబ్బతినడం, మళ్లీ జీహెచ్‌ఎంసీ వేయడం సరైన పద్ధతి కాదనేది ప్రభుత్వ ఉద్దేశం. దీనిని దృష్టిలో పెట్టుకునే సమీకృత రోడ్డు నిర్వహణ వ్యవస్థ(సీఆర్‌ఎంపీ)ను తెచ్చాం. ఈ పథకం కింద 710 కి.మీ ప్రధాన రోడ్లను ఆరు ప్యాకేజీలుగా విభజించి పెద్ద గుత్తేదారు సంస్థకు ఇచ్చాం. ఇప్పటికే 300 కి.మీ దూరం మొదటి లేయర్‌ పనులు పూర్తయ్యాయి. రాబోయే వేసవి నాటికి పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ పథకం కింద గుత్తేదారే ఐదేళ్లపాటు రోడ్డును నిర్వహించాల్సి ఉంటుంది. గుంతపడినా ఆయనే పూడ్చాలి. వీటితోపాటు తారు రోడ్లు వేస్తున్నప్పటికీ నీళ్లు నిలవడంతో అవి పాడవుతున్నాయి. దీనికి కారణం హైదరాబాద్‌లో అస్తవ్యస్తమైన మురుగునీటి వ్యవస్థ. దీన్ని ఆధునికీకరించాలంటే చాలా డబ్బు కావాలి. గతంలో రోడ్ల కోసం ఎస్‌.ఆర్‌.డి.పి చేపట్టినట్లుగా, ఎన్నికల తర్వాత నాలాల కోసం ఎస్‌.ఎన్‌.డి.పి చేపడతాం. అప్పుడు ఎంత వర్షం పడినా నీరు ఎప్పటికప్పుడు దిగువకు పోతుంది. సమస్యలు ఉన్నప్పటికీ రోడ్ల విషయంలో కొంత పురోగతి ఉన్న మాట వాస్తవం. అయితే నాకు సంతృప్తి ఇచ్చేంతగా లేదు. మరింత నాణ్యమైన రోడ్లను నిర్మించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో భాగంగానే కొత్తగా హైదరాబాద్‌లో 137 లింకురోడ్లు నిర్మిస్తున్నాం. కొన్ని మిస్సింగు రోడ్లూ వేస్తున్నాం. వీటి వల్ల కొన్ని ప్రాంతాలపై ఒత్తిడి తగ్గుతుంది. ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుంది. రోడ్ల విషయంలో మూడు, నాలుగు రకాల వ్యూహాలతో ముందుకెళ్తున్నాం.

 2000వ సంవత్సరం వరదలపై వేసిన కిర్లోస్కర్‌ కమిటీ 28 వేల అక్రమ నిర్మాణాలు ఉన్నాయని తేల్చింది. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉంటే మొన్నటి పరిస్థితి తలెత్తేది కాదు. ఇప్పుడు మీరు అధికారంలోనే ఉన్నారు కదా! అదేదో మీరు చెయ్యొచ్చుకదా! అనేవాళ్లూ ఉన్నారు. అదీ వాస్తవమే. అయితే తెలంగాణ వచ్చాక ప్రభుత్వం సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, రహదారులకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంది. అందుకే వాటిపైనే దృష్టిసారించాం. నాలాలపై దృష్టిపెట్టలేదు. ఇప్పుడు పెడతాం. మరో మూడేళ్లు రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. హైదరాబాద్‌లో మొన్నటి వరద పరిస్థితి మళ్లీ జరగకుండా చూస్తాం. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతినకుండా జాగ్రత్తపడతాం.


 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 26 మంది సిట్టింగ్‌ కార్పొరేటర్లను మార్చారు. వారిపై ఆరోపణలా? లేదా మరేదైనా అంశాలను పరిగణనలోనికి తీసుకున్నారా?
అందరికంటే ముందే 150 డివిజన్లలో తెరాస అభ్యర్థులను ప్రకటించింది. సామాజిక సమతూకం పాటించి, 72 శాతం సీట్లను మహిళలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చాం. మహిళలకు రిజర్వ్‌ అయింది 75 స్థానాలే అయినా 85 కేటాయించాం. జనరల్‌ స్థానాలోనూ ఎస్టీ,ఎస్టీ, బీసీలకు చోటిచ్చాం. అందరినీ పిలిచి ఒకరోజులో బీ ఫారాలు ఇచ్చింది తెరాస మాత్రమే. మిగిలిన పార్టీల్లో కార్యాలయాలు కూలగొట్టడం, తగలబెట్టడం వంటి ఘటనలు జరిగాయి. ధర్నాలూ చేశారు. ఎన్నికల సమయంలో కొన్ని అసంతృప్తులు సహజం. గెలిచే స్థానంలో ఆశావహులు ఎక్కువగా ఉంటారు. వారిని ఒప్పించి, మెప్పించాల్సి ఉంటుంది. కొన్నిచోట్ల గెలుపు ప్రాతిపదికన చాలారకాలుగా సమాచారం తీసుకుంటే, కొందరు అభ్యర్థులను మార్చాలనే అభిప్రాయాలు వచ్చాయి. తొలగించిన వారు, పక్కనపెట్టిన వారు చెడ్డవారనే అభిప్రాయం సరైంది కాదు. స్థానిక పరిస్థితుల వల్లనే వారికి అవకాశం దక్కలేదు. వారు అర్థం చేసుకున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఆ విషయాన్ని ప్రతిపక్షాలు తెలుసుకోవాలి.

అనధికారిక లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఎల్‌ఆర్‌ఎస్‌ తెచ్చారు. దీని వల్ల ప్రజలపై భారం పడుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి? మీరేమంటారు?
ఇది దుష్ప్రచారం. దీనిపై 2015లోనే జీవో తెచ్చాం. అనధికార లేఅవుట్‌లు రిజిస్ట్రేషన్‌ చేయకుండానూ  నిబంధన తెచ్చాం. బిల్డర్‌ బాగానే ఉంటారు. డబ్బు రాబట్టుకుని వెళ్లిపోతారు. అక్కడ రోడ్డు ఉండదు. పైపులైన్‌ వేయడానికీ అవకాశం ఉండదు. అన్నీ సమస్యలే. స్థలమో, ఇళ్లో కొన్న వాళ్లు తర్వాత ఇబ్బంది పడతారు. ఈ పరిస్థితి లేకుండా చూసేందుకే ఎల్‌ఆర్‌ఎస్‌. ఎల్‌ఆర్‌ఎస్‌లో లబ్ధిదారులు చెల్లించిన మొత్తాన్ని ఆయా లేఅవుట్ల అభివృద్ధికే ఖర్చు చేస్తామని జీఓలోనే స్పష్టంగా పేర్కొన్నాం. వసతుల్లేని చోట ఆస్తులు కొనుగోలు చేసి, వాళ్లు బాధపడుతూ..ఆ తర్వాత ప్రభుత్వాన్ని నిందించే పరిస్థితి రాకూడాదనే మా ఉద్దేశం. రుసుం కూడా తగ్గించాం. ఎమ్మెల్యేల విన్నపం మేరకు మొదట ఇచ్చిన దాన్ని సవరిస్తూ మరో జీవో ఇచ్చాం. దాని ప్రకారం. కొన్నప్పటి మార్కెట్‌ విలువ ప్రకారమే క్రమబద్ధీకరణ రుసుం ఉంటుంది.

‘‘కర్ణాటకలో వరదలొస్తే ఆ రాష్ట్ర సీఎం లేఖ రాసిన నాలుగు రోజుల్లోనే రూ.669 కోట్లు ఇచ్చారు. గుజరాత్‌ వరద ప్రాంతాల్లో ప్రధానమంత్రి స్వయంగా పర్యటించి రూ.500 కోట్లు ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి లేఖ రాసి ఎనిమిది వారాలైనా ఉలుకూ, పలుకూ లేదు. ఇంతవరకు ఒక పైసా సాయం ఎందుకు చేయలేదు? పైపెచ్చు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు రూ.650 కోట్ల సాయం చేస్తుంటే మోకాలొడ్డారు. ‘మేము ఇచ్చేవాళ్లం, మీరు తీసుకొనేవారు’ అనే ధోరణిలో భాజపా నాయకులు మాట్లాడుతున్నారు. అందులోనే అహంకారం కన్పిస్తోంది.

‘‘ ప్రస్తుతం ఉన్న డ్రైనేజీ వ్యవస్థ ఎం.సి.హెచ్‌ వరకే పరిమితమైంది. అదీ రెండు సెం.మీ వర్షానికి తట్టుకోగలిగిందే. ఎం.సి.హెచ్‌ అవతల, శివారు ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఈ కారణంగానే రోడ్లపై మురుగు, వర్షపు నీరు నిల్వ చేరి రోడ్లు పాడవుతున్నాయి. సమస్యను ఇప్పటికే గుర్తించాం. పరిష్కారం కోసం వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టబోతున్నాం.

ఇటీవల వరదల తర్వాత నగరంలోని అనేక ప్రాంతాల్లో మీరు పర్యటించారు. హైదరాబాద్‌లో ఇలాంటి పరిస్థితి ఎందుకు ఉంది?
దశాబ్దాలుగా అనేక ప్రభుత్వాల హయాంలో జరిగిన పొరపాట్లకు ప్రతిరూపమే ఈ పరిస్థితి కారణమని కచ్చితంగా చెప్పగలను. మా హయాంలో తప్పులే జరగలేదని చెప్పను. చెరువులు, కుంటలు ఆక్రమించుకోవడం, నాలాలపై నిర్మాణాలను ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం చూసీచూడనట్లు ఉండటం వల్ల ఇలా జరిగింది. వెళ్లే మార్గాలు మూసేస్తే నీళ్లు ఇళ్లలోకి కాక ఇంకెక్కడికి వస్తాయి. ‘నీళ్లు మా దగ్గరకు రాలేదు. మేమే నీళ్ల దగ్గరకు వెళ్లాం’ అని కుత్బుల్లాపూర్‌కు చెందిన ఓ పెద్దాయన అన్నారు. అది వాస్తవం. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాం. ముఖ్యమంత్రి అంగీకరిస్తే జనవరి, లేదా ఫిబ్రవరిలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి, జీహెచ్‌ఎంసీకి కొత్త చట్టం తెస్తాం. దీనిపై న్యాయనిపుణులతోనూ సంప్రదిస్తాం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోనూ చర్చించి చట్టంలో ఒక నిబంధన పొందుపరుస్తాం. ఎక్కడైనా, ఎవరైనా నాలాలు, చెరువులు, కుంటలు ఆక్రమించి కట్టినా, అతిక్రమణలకు పాల్పడినా నోటీసు ఇవ్వకుండా కూల్చేసే అధికారం ప్రభుత్వానికి, జీహెచ్‌ఎంసీకి ఉండాలి. లేదంటే భయం ఉండదు. అధికారులకు వ్యక్తిగతమైన, విచక్షణాధికారాలు తీసేయాలనేది మా భావన. టీఎస్‌ బీపాస్‌, ఆన్‌లైన్‌ మ్యుటేషన్‌ లాగానే జీహెచ్‌ఎంసీలో సంస్కరణలు అమలుచేస్తూనే మంచి చట్టాలు తేవాలి. ప్రజల భాగస్వామ్యం పెరగాలి. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకొనే పరిస్థితి ఉండాలి. అప్పుడు ఈ సమస్యను సమర్థంగా ఎదుర్కోగలం.

నగరం ఎదుర్కొంటున్న సమస్యలేంటి? ఎలా పరిష్కరించాలనుకుంటున్నారు?
నగరాభివృద్ధిలో పౌరుల భాగస్వామ్యం అవసరం. కోటి మంది జనాభా ఉన్న నగరానికి ప్రస్తుతం కేవలం 25 వేల మంది మాత్రమే పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. ఇప్పటికే వార్డు కమిటీలను ఏర్పాటు చేశాం. వాటిని సమర్థంగా వాడుకోవాలి. నేను గతంలో టోక్యో వెళ్లినప్పుడు గమనించా. ఎక్కడ చూసినా పరిశుభ్రంగా కనిపించింది. దీనికి కారణమేమిటని అక్కడి రాయబార కార్యాలయ అధికారిని అడిగా. అపరిశుభ్రం చేయకపోవడమే అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌ 19వ ర్యాంకులో ఉంది. ఇండోర్‌, మైసూర్‌ లాంటివి మనకంటే ముందున్నాయి. దీనిపై మనలో సోయి ఉండాలి. స్ఫూర్తి రావాలి. జీహెచ్‌ఎంసీ చట్టంలో ప్రస్తుతం జరిమానాలు లేవు. చెత్తవేసినా, రోడ్డుపైకి నీళ్లు వదిలినా జరిమానాలు విధిస్తే భయం ఉంటుంది.
 ఒకవైపు కేంద్రం నుంచి నిధులు రావడం లేదంటున్నారు. ఇంకోవైపు వచ్చే ఐదేళ్లలో చాలా అభివృద్ధి పనులు చేస్తామంటున్నారు. వనరులు ఎలా?
ఆరేళ్లలో ఆస్తి పన్ను సహా నీటిపన్ను, లైసెన్సు ఫీజు, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పైసా కూడా పెంచలేదు. సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఆదాయం పెరుగుతుందనేది మా నమ్మకం. ఉదాహరణకు ఆస్తి పన్ను వసూళ్లు రూ.1200 కోట్ల నుంచి రూ.1400 కోట్లకు పెరిగాయి. శాంతిభద్రతలు బాగుంటే పెట్టుబడిదారులు వస్తారు. తద్వారా ఉపాధి పెరుగుతుంది. రాష్ట్ర స్థూల రాబడి పెరుగుతుంది. సంక్షేమం, అభివృద్ధికి ఆ నిధులు ఖర్చు చేసే వీలుంటుంది. అందుకే ప్రభుత్వం సరైన వాతావరణం కల్పిస్తూ..పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్స్‌ వస్తే, ఆ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. భూముల ధరలు పెరుగుతాయి. గృహ నిర్మాణం పెరుగుతుంది. తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. అలా రాబడి పెరగడం వల్లనే పన్నులు పెంచకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. తెలంగాణ ఏర్పాటైన రోజుల్లో ప్రజల తలసరి ఆదాయం రూ.లక్షా 20 వేలు. ఇప్పుడు రూ.2.24 లక్షల పై చిలుకు. ఇది ఆషామాషీగా జరగలేదు.

మజ్లిస్‌ మీ మిత్రపక్షంగా కొనసాగుతోందా?
కొన్ని విధానాలు నచ్చి మజ్లిస్‌ పార్టీ మాకు మద్దతు ఇచ్చి ఉండొచ్చు. జీఎస్టీ, ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో మేమూ కేంద్రానికి మద్దతుగా నిలిచాం కదా! ఎన్నికల్లో ఎవరి ధోరణి వారిదే. గత శాసనసభ ఎన్నికల్లో మజ్లిస్‌ రాజేంద్రనగర్‌లో అభ్యర్థిని నిలబెట్టి, మా ఎమ్మెల్యేని ఓడించాలని చూసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేము పాతనగరంలో అయిదు స్థానాలు గెలిచాం. ఏడు చోట్ల ఐదు వందల కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయాం.  శాసనసభలో మజ్లిస్‌ మద్దతు ఇచ్చినంత మాత్రాన మా మిత్రపక్షమేమీ కాదు.

మీరు ఈ ఎన్నికల్లో భాజపాని లక్ష్యంగా ఎంచుకున్నారు? మీ ప్రధాన ప్రత్యర్థి భాజపానా, కాంగ్రెస్సా?
గత ఎన్నికల్లో మా పార్టీకి సెంచరీ మిస్‌ అయింది. అయిదు ఓట్ల తేడాతో జాంబాగ్‌లో ఓడిపోవడం వల్ల నూరో సీటు కోల్పోయాం. ఈసారి సెంచరీకి పైగా సాధిస్తాం. రెండు, మూడు స్థానాల్లో ఎవరుంటారో ఇతర పార్టీలే తేల్చుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉంది. పేకాట, గుడుంబా, ఆకతాయిలు, పోకిరీల బెడద లేదు. బాంబుపేలుళ్లు, మతకలహాలు, అల్లర్లు లేవు. పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. నగరం కోట్ల మందిని కడుపులో పెట్టుకుని చూసుకుంటోంది. భాజపా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. హిందూ-ముస్లిం, ఇండియా-పాకిస్థాన్‌, ఇండియా-చైనా, బిన్‌ లాడెన్‌ అంటూ మాట్లాడుతున్నారు. అగ్గి మండాలా? చల్లగుండాలా? మంచి వాతావరణం చెడగొడితే ఎవరికి నష్టమో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. దమ్ముంటే హైదరాబాద్‌ అభివృద్ధికి రూ. లక్ష కోట్లు తెస్తాం అని చెప్పి భాజపా ఓటు అడగాలి. అంతే తప్ప ట్రాఫిక్‌ ఉల్లంఘించినా, తాగి బండి నడిపినా ఏమీ కాదని చెప్పడం దారుణం. ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు. ఆ కుటుంబాలను ఎవరు ఆదుకుంటారు? ఒక జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇంతబాధ్యతారహితంగా మాట్లాడవచ్చా?

పురపాలక ఎన్నికల అనంతరం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై దృష్టిపెడతారు. మీరు సీఎం అవుతారనే ప్రచారం సాగుతోంది?
అలాంటిదేమీ లేదు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని