close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆరోగ్యం.. ఆనందం

ఇంటిపంటపై నగరంలో పెరిగిన ఆసక్తి
బాల్కనీలు, భవనాలపై తాజా కూరగాయలు
కొవిడ్‌ సంక్షోభంలో ప్రజల ఆరోగ్య మార్గం

* ప్రతి అనుభవం ఒక పాఠం చెబుతుంది. ప్రతి సంక్షోభం సరికొత్త పరిష్కారం చూపుతుంది. అవసరం అన్నింటినీ నేర్పిస్తుంది.
* మహమ్మారి కొవిడ్‌ కూడా అనేక మంచి   అలవాట్లను చేస్తోంది. ఆరోగ్య పరిరక్షణకు కొత్తమార్గాలను చూపుతోంది.

ఈనాడు - హైదరాబాద్‌

ప్రస్తుతం హైదరాబాద్‌ నగర జీవులకు కూరగాయలు, పూల మొక్కల పెంపకం కొత్త వ్యాపకంగా మారింది. గత మార్చిలో లాక్‌డౌన్‌ ప్రారంభమైన తరవాత ఈ అలవాటు బాగా విస్తృతమైంది. ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఇంటిలో ఖాళీగా ఉన్న బాల్కనీలు, భవనాలపైన మొక్కల పెంపకానికి ఆసక్తి చూపుతూ ఉద్యానశాఖ అధికారులను సంప్రదిస్తున్నారు. శిక్షణ కార్యక్రమాలకూ పెద్దసంఖ్యలో హాజరవుతున్నారు.  కొన్నిచోట్ల పెద్ద అపార్టుమెంట్ల భవనాలపై అసోసియేషన్ల ఆధ్వర్యంలో సైతం మొక్కలను నాటుతున్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 4430 ఇళ్లపై 15,320 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కూరగాయల మొక్కలు పెంచుతున్నట్లు ఉద్యానశాఖ అధ్యయనంలో తేలింది. కొవిడ్‌ సంక్షోభం మొదలయ్యాక దాదాపు ఆరువేల మంది ఇంటిపంట గురించి తమను సంప్రదించారని అధికారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో మొక్కల పెంపకాన్ని మరింత విస్తృతం చేయడానికి ఉద్యానశాఖ శిక్షణ, అవగాహన శిబిరాలను నిర్వహిస్తోంది. గుజరాత్‌లోని నిర్మా విశ్వవిద్యాలయానికి చెందిన 30 మంది విద్యార్థులు సైతం ప్రత్యేకంగా హైదరాబాద్‌కు వచ్చి రాష్ట్ర ఉద్యాన సంస్థ ఆవరణలో ఇంటి పంట విధానంపై శిక్షణ పొందడం విశేషం. రాజేంద్రనగర్‌లో జాతీయ సంస్థ ‘మేనేజ్‌’ కూడా పలు రాష్ట్రాల్లో ఇంటిపంటలు పరిశీలించి హైదరాబాద్‌లోనే బాగుందని ప్రశంసించింది. ఇళ్లలో తక్కువ స్థలంలోనే కూరగాయలు పండించుకోవడానికి అవసరమైన పరికరాలు, సామగ్రిని అధునాతనంగా అందించేందుకు ‘మేనేజ్‌’ పరిశోధనలు చేస్తోంది. కొత్తగా పండించాలనుకునేవారికి అవసరమైన సాంకేతిక సలహాలతో పాటు శిక్షణ ఇస్తామని ఉద్యాన సంచాలకుడు ఎల్‌.వెంకట్రాంరెడ్డి ‘ఈనాడు’కు చెప్పారు.


తాజా తాజా అంటున్న సమంత

పలువురు సినీ ప్రముఖులు, ఉన్నతోద్యోగులు, విద్యావంతులు ఇళ్లలో కూరగాయలు, పూల మొక్కల పెంపకంపై బాగా ఆసక్తి చూపుతున్నారు. కొవిడ్‌తో ఇళ్లలోనే ఉండటం వల్ల తమకు ఇది మంచి వ్యాపకంగా మారిందని సోషల్‌మీడియాలో పోస్టింగులు సైతం పెడుతున్నారు. ప్రముఖ హీరోయిన్‌ సమంత తన ఇంటిలో వివిధ పద్ధతుల్లో పండిస్తున్న కూరగాయలను, ఆ మొక్కల వద్ద మట్టిలో పనిచేస్తున్న ఫొటోలను, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతుండటం అందరినీ ఆకర్షిస్తోంది. హైడ్రోఫోనిక్స్‌ విధానంలో కేవలం నీటితోనే పండించే కూరగాయలు, ఆకుకూరలను ఆమె ఇటీవల పోస్ట్‌ చేశారు. కొవిడ్‌ సంక్షోభంలో ఇళ్లపైన, బాల్కనీల్లో కూరగాయల పెంపకం బాగా పెరిగిందని ఓ బ్లాగ్‌లో వచ్చిన వ్యాసాన్ని సమంత తాజాగా పోస్ట్‌ చేశారు. 


ఆరోగ్యానికివే మేలు
- మాధవీ చక్రవర్తి, నేతాజీనగర్‌, కాప్రా

మాది 1650 చదరపు అడుగుల ఫ్లాట్‌. బాల్కనీ 100 చదరపు అడుగులుంటుంది. అందులోనే గ్రిల్స్‌ ఆధారంగా అనేక రకాల కూరగాయల మొక్కలు పెంచుతున్నాం. రోజూ కాసేపు పనిచేయడం, వాటి ఎదుగుదలను పరిశీలించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. కొవిడ్‌ సంక్షోభ సమయంలో నాణ్యమైన ఆహారం తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటిలో పండించుకునే తాజా కూరగాయలతో వండిన ఆహారం ఆరోగ్యానికి మంచిదే కాకుండా ఎంతో రుచిగా ఉంటుంది. నా భర్త చక్రవర్తి కూడా కూరగాయల మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. 


ఇంట్లో కూరగాయలు పండించడం చాలా సులభం
-చంద్రశేఖర్‌, రిటైర్డ్‌ సహాయ సంచాలకులు, పట్టుపరిశ్రమ శాఖ

బచ్చలి, కాకరకాయ మొక్కలు ఇంటిలోని చిన్న బాల్కనీలోనే పెట్టాం. ఇవి కాకుండా.. ఇంటిపైన 40 రకాల మొక్కలు పెంచుతున్నాం. ఇద్దరమే ఇంట్లో ఉండటంతో బయట కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో పండిన వాటితో వండిన కూరల రుచి అద్భుతంగా ఉంటుంది. పూర్తిగా సేంద్రియ ఎరువు, వానపాముల ఎరువు వేసి ఇంట్లో మొక్కలు పెంచుతున్నాం.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.