close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ముంగిట్లో మూడు గొప్ప మార్పులు

ఇప్పటికే జలసిరి చూస్తున్నాం త్వరలో నీలి, గులాబీ, శ్వేత విప్లవాలు
తెలంగాణలో ఆహారశుద్ధికి ఉజ్వల భవిష్యత్తు ఉంది
మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఆహారశుద్ధికి ఉజ్వల భవిష్యత్తు ఉందని, ఈ పరిశ్రమల ద్వారా రైతులకు ఆర్థిక స్వావలంబన, తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఆహారశుద్ధి పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి దేశంలోనే అత్యుత్తమ విధానం రూపొందిస్తామని, భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. ఆహారశుద్ధి, లాజిస్టిక్స్‌ కొత్త విధానాల రూపకల్పన, వాటికి సంబంధించిన మార్గదర్శకాలపై బుధవారం ప్రగతిభవన్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందులో కేటీఆర్‌ మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి కృషి వల్ల తెలంగాణలో జల విప్లవం వస్తోంది. లక్షలాది ఎకరాల బీడు భూములు కృష్ణా, గోదావరి నదుల నీటితో సస్యశ్యామలం అవడం చూస్తున్నాం. ఈ జల విప్లవం తోడ్పాటుతో మత్స్య పరిశ్రమల ద్వారా నీలి విప్లవం; మాంస ఉత్పత్తి పరిశ్రమలతో గులాబీ విప్లవం; పాడి పరిశ్రమతో శ్వేత విప్లవం కూడా తెలంగాణలో రానున్నాయి.
స్వయం సహాయక సంఘాలు, సహకార సంఘాలు, దళిత, గిరిజన, మైనారిటీ యువత, మహిళలకు ప్రత్యేక రాయితీలుంటాయి. ఆహారశుద్ధి కొత్త విధానం ద్వారా చిన్న యూనిట్ల నుంచి భారీ పరిశ్రమల వరకు పెద్ద సంఖ్యలో ఏర్పాటవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో యువత ఉద్యోగాలతో పాటు, స్వయం ఉపాధి పొందుతారు. ప్రజలకు కూడా కల్తీ లేని, నాణ్యత గల ఆహార ఉత్పత్తులు లభిస్తాయి. కొత్త విధానంలో, మార్గదర్శకాల కూర్పులో మంత్రులు సహా అందరి సూచనలను వినియోగించుకుంటాం.

గొర్రెల సంఖ్య గణనీయంగా పెరిగింది
రాష్ట్రం ఏర్పడ్డాక వరి, పత్తి, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాల సాగు బాగా పెరిగింది. నీటిపారుదల ప్రాజెక్టులన్నీ పూర్తయితే వ్యవసాయ ఉత్పత్తులు ఇంకా పెరుగుతాయి. గొర్రెల పంపిణీ, చేప పిల్లల పెంపకం పథకాల వల్ల రాష్ట్రంలో వాటి సంఖ్య గణనీయంగా పెరిగింది. సీఎం కేసీఆర్‌ సూచన మేరకు తెలంగాణలో ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ జిల్లాలో ఏ పంటలు పండుతున్నాయి అనేది పూర్తిగా మ్యాపింగ్‌ జరిగింది. రాష్ట్రంలో ఇప్పుడు ఉత్పత్తి అవుతున్న పంటలను పూర్తిగా శుద్ధి చేసే సామర్థ్యం మనకు లేదు. వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది’ అని కేటీఆర్‌ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆహారశుద్ధి పరిశ్రమలకు అవకాశాలు ఇతర అంశాలపై ఆయన పవర్‌ పాయింట్‌ ద్వారా వివరించారు. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, మహమూద్‌ అలీ, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, సబితారెడ్డి, సత్యవతి రాథోడ్‌, కొప్పుల ఈశ్వర్‌, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్‌శర్మ, ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులు పాల్గొన్నారు.
తెలంగాణ బ్రాండ్‌ ప్రపంచవ్యాప్తం కావాలి: మంత్రులు
* ఆహారశుద్ధి పరిశ్రమల ద్వారా తెలంగాణ బ్రాండ్‌పై ప్రపంచమంతటికీ నాణ్యమైన ఉత్పత్తులను ఎగుమతి చేయాలి.
* మారుతున్న పంటల సరళిని దృష్టిలో ఉంచుకుని ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించాలి.
* పండ్లు, కూరగాయల శుద్ధి పరిశ్రమల వల్ల వృథా తగ్గి రైతుకు లబ్ధి చేకూరుతుంది.
* కోళ్లు, మాంసం ఉత్పత్తి, చేపల శుద్ధి రంగాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచాలి.
* కొన్ని పనులకు కార్మికులు, కూలీల కొరత ఉన్నందున యాంత్రీకరణను ప్రోత్సహించాలి.
* గిరిజన ప్రాంతాల్లో చిన్న చిన్న ఆహార శుద్ధి పరిశ్రమలకు తోడ్పాటు అందించాలి. దళిత, మహిళా పారిశ్రామిక వేత్తలకు చేయూతనివ్వాలి.
* పాడి ఉత్పత్తులకు విస్తృతమైన అవకాశాలున్నాయి. నూనె గింజల ఉత్పత్తిని పెంచి, ఆధునిక నూనె మిల్లులను ఏర్పాటు చేయించాలి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.