close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
శ్రీరామం.. శ్రీకారం

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శ్రీకారం
* ప్రధాని చేతుల మీదుగా పండుగలా భూమిపూజ

ఈరోజు భారత్‌ మొత్తం భావుకతతో నిండిపోయింది. శతాబ్దాల ఎదురు చూపులు సమాప్తమవుతున్నాయి. మన జీవితం పావనమవుతోంది. రామ్‌లల్లాకు ఇప్పుడు ఒక దివ్యమైన భవ్య మందిరం నిర్మితమవుతోంది. పడుతూ లేస్తూ శతాబ్దాల తరబడి సాగిన క్రమం నుంచి రామ జన్మభూమి ఈరోజు విముక్తమవుతోంది. - ప్రధాని మోదీ

* 29 ఏళ్ల విరామానంతరం మోదీ అయోధ్యలో అడుగుపెట్టారు.
* వేద మంత్రోచ్చారణ నడుమ బుధవారం మధ్యాహ్నం 12.44 గంటలకు ప్రధాని భూమి పూజ చేశారు.
* శంకుస్థాపనకు నక్షత్రాకారంలో ఉన్న ఐదు వెండి ఇటుకలను ఉపయోగించారు.
* సర్వాంగ సుందరమైన ముస్తాబుతో అయోధ్య మొత్తం కళకళలాడింది. లక్షలాది దీపాలను వెలిగించారు.

సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. మహోజ్వల ఘట్టానికి అంకురార్పణ జరిగింది. అయోధ్య రాముడికి మహోన్నతమైన కోవెల నిర్మించేందుకు ఆ పుణ్యమూర్తి జన్మభూమిలో పునాది రాయి పడింది. దేశమంతటా ‘జై శ్రీరామ్‌’ అని జయజయధ్వానాలు పలుకుతుండగా.. ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఉజ్వల ఘట్టాన్ని దేశ విదేశాల్లోని కోట్ల మంది పండుగలా జరుపుకొన్నారు. ఊరూవాడా శ్రీరామ నామ జపంతో తరించింది. ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించడానికి దేశవ్యాప్తంగా అనేక మంది టీవీలకు అతుక్కుపోయారు.


అంతా రామమయం

అయోధ్య:  శతాబ్దాల కల సాకారమైంది... అయోధ్య రాముడి ఆలయానికి బుధవారం అంకురార్పణ జరిగింది... దేశ ప్రధాని నరేంద్రమోదీ స్వహస్తాలతో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఉద్వేగభరితమైన ఈ ఘట్టానికి ప్రత్యక్షంగా హాజరుకాలేకపోయినా, దేశ విదేశాల్లోని భక్తులంతా రామనామ జపంతో... జయజయ ధ్వానాలతో సంబరాలు చేసుకున్నారు. ఊరూవాడా దీప కాంతులతో ధగధగలాడింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానితుల్ని పరిమితం చేసినా ప్రత్యక్ష ప్రసారం ద్వారా, స్థానిక కార్యక్రమాలతో ఎక్కడికక్కడ భక్తకోటి రామ జపంలో తరించింది. కీలకమైన హామీని నెరవేర్చబోతున్న ఘడియ కావడంతో భాజపా శ్రేణులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక శ్రద్ధతో పండగలా నిర్వహించాయి. రామాలయ క్రతువు నిర్విఘ్నంగా పూర్తి కావాలని అనేక ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మోదీ మాట్లాడుతూ... ప్రజలందరి సంతోషాన్నే రాముడు నిరంతరం కాంక్షించేవారన్నారు. జాతిపిత కలలుకన్నదీ రామరాజ్యం గురించేనని చెప్పారు. ఆలయం కోసం శతాబ్దాల ఎదురుచూపులు ముగిశాయన్నారు. అందరినీ కలుపుకొని అభివృద్ధి బాటలో పయనించాలని చెప్పారు.

శాస్త్రోక్తంగా శంకుస్థాపన
29 ఏళ్ల విరామానంతరం అయోధ్యకు వచ్చిన మోదీ.. తొలుత 10వ శతాబ్ద కాలం నాటి హనుమాన్‌ గఢీకి చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం సంప్రదాయబద్ధ స్వాగతాన్ని అందుకుని, ప్రధాన వేదికకు వెళ్లారు. రామ్‌లల్లాలోకి ప్రవేశించేముందు సాష్టాంగ నమస్కారం చేశారు. పారిజాత మొక్కను నాటారు. వేద మంత్రోచ్చారణ నడుమ భూమి పూజను, నక్షత్రాకారంలో ఉన్న ఐదు వెండి ఇటుకలతో శంకుస్థాపనను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మానవాళిపై శ్రీరాముడు చూపిన ప్రభావాన్ని, సత్పురుషుడు సాగించిన ఆదర్శప్రాయ జీవనాన్ని విడమరిచి చెప్పారు. అందరి హృదయాల్లోనూ రాముడు కొలువై ఉన్నాడని, మన సంస్కృతికి ప్రాతిపదిక ఆయనేనని చెప్పారు. మున్ముందు అయోధ్యాపురి ఎలా భాసిల్లబోతోందన్నది కళ్లముందు ఆవిష్కరించారు. బంగారపు రంగు సంప్రదాయ కుర్తా, ధోవతి ధరించి ప్రధాని ఈ వేడుకకు హాజరయ్యారు. సీతారామచంద్రమూర్తిని తలచుకుంటూ ‘జై శ్రీరాం’ అంటూ ఆయన ప్రసంగం మొదలుపెట్టారు. ముగించేటప్పుడు కూడా మరోసారి జై శ్రీరాం అని పలికారు. స్వాతంత్య్ర సంగ్రామంతో రామమందిర ఉద్యమాన్ని మోదీ సరిపోల్చారు. ఆయనతో సహా అందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించారు. రూ.300 కోట్ల వ్యయంతో ఆలయాన్ని నిర్మించబోతున్న తరుణంలో నిర్వహిస్తున్న చరిత్రాత్మక వేడుకను పురస్కరించుకుని సర్వాంగ సుందరమైన ముస్తాబుతో అయోధ్య మొత్తం కళకళలాడింది. ఒక్క అయోధ్యాపురిలోనే 3.51 లక్షల దీపాలను వెలిగించారు. శ్రీరాముడి పాదాల చెంతనే 1.21 లక్షల దీపాలు వెలుగులు విరజిమ్మాయి. ప్రభుత్వ కార్యాలయాలు సహా మొత్తం అన్నింటినీ విద్యుద్దీపాలతో, మట్టి ప్రమిదలతో అలంకరించారు. గంటల గణగణలు, శంఖారావాలతో అడుగడుగునా ఆధ్యాత్మికత పరిఢవిల్లింది. రామాలయ శంకుస్థాపన సందర్భంగా తపాలా శాఖ రూపొందించిన ప్రత్యేక తపాలా బిళ్లను ప్రధాని విడుదల చేశారు. రామజన్మభూమి ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆడ్వాణీ వంటివారు భూమి పూజ కార్యక్రమానికి రాలేకపోయారు. ముందుగానే ప్రకటించిన రీతిలో వేదికపై ప్రధాని సహా ఐదుగురే కనిపించారు. బుధవారం నాటి కార్యక్రమాలతో గత 3 రోజులుగా కొనసాగుతున్న భూమి పూజ కార్యక్రమాలు ముగిశాయి. పశ్చిమబెంగాల్‌, అసోంలలో చెదురుమదు రు సంఘటనలు చోటు చేసుకున్నా దేశంలో అన్నిచోట్లా ఉత్సాహభరిత వాతావరణం కనిపించింది.


టీవీల ముందు హోరెత్తిన జైశ్రీరాం

కరోనా ఆంక్షల కారణంగా భక్తులను వేడుకకు అనుమతించకపోవడంతో ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించడానికి అనేకమంది టీవీలకు అతుక్కుపోయారు. అయోధ్యలో అనేక దుకాణాల ముందు టీవీల ఎదుట ప్రజలు బారులుతీరారు. ప్రధానితో పాటు వారంతా జై శ్రీరాం అని నినాదం చేశారు. భవనాలపై పెద్దఎత్తున కాషాయ జెండాల రెపరెపలు కనిపించాయి. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ఆహ్వానితులు మినహా మరెవరూ ప్రధాన వేదిక వద్దకు వెళ్లకుండా పోలీసులు నియంత్రించారు.


భూమి పూజను టీవీలో వీక్షించిన ప్రధాని మోదీ మాతృమూర్తి

అహ్మదాబాద్‌: అయోధ్యలో అత్యంత వేడుకగా జరిగిన రామాలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి మోదీ మాతృమూర్తి హీరాబెన్‌ గాంధీనగర్‌లోని ఇంటి వద్ద నుంచి వీక్షించారు. మోదీ పూజా క్రతువులు నిర్వహిస్తున్న దృశ్యాలు టీవీలో ప్రత్యక్ష ప్రసారమవుతుండగా ఆమె కుర్చీలో కూర్చొని భక్తిపూర్వకంగా ముకుళిత హస్తాలతో శ్రద్ధగా తిలకించారు. ఆ సమయంలో తీసిన ఫొటోను గుజరాత్‌ రాష్ట్ర సమాచార శాఖ విడుదల చేసింది. వయోధికురాలైన హీరాబెన్‌ గాంధీనగర్‌ శివారులో నివసిస్తున్న తన చిన్న కుమారుడు పంకజ్‌ మోదీ వద్ద ఉంటున్నారు.


సామరస్య స్ఫూర్తికి నిదర్శనం
- రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
చట్ట పరిమితులకు అనుగుణంగా అయోధ్యలో రామాలయ నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన దేశ సామాజిక సామరస్య స్ఫూర్తికి, ప్రజల అనురక్తికి నిదర్శనం. అందరికీ అభినందనలు. రామరాజ్య ఆదర్శాలకు ఇది నిలువెత్తు సాక్ష్యం...ఆధునిక భారతావనికి ప్రతీక.స్వయంసమృద్ధ భారత్‌పై విశ్వాసం
-ఆరెస్సెస్‌ అధిపతి మోహన్‌ భాగవత్‌
అయోధ్యలో మహోన్నతమైన ఆలయ నిర్మాణం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌, భావసారూప్యం ఉన్న ఇతర సంస్థలు 30 ఏళ్ల పాటు కొనసాగించిన కృషి సాకారమైంది. మనదేశం స్వయంసమృద్ధ భారత్‌గా అవతరిస్తుందన్న దృఢమైన విశ్వాసం కలిగించింది.


ప్రధాని దార్శనికత వల్లే..
-యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌
ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత, విజ్ఞత వల్లే 500 ఏళ్ల క్రితం ప్రారంభమైన రామాలయ వివాదానికి సామరస్యపూర్వకమైన పరిష్కారం లభించింది. మోదీ నేతృత్వంలో న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు ప్రపంచానికి తమ సత్తాను చాటాయి. ఎంతటి క్లిష్టమైన అంశాన్నైనా ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా పరిష్కరించుకోవచ్చని నిరూపించాయి.


మానవీయ విలువల పవిత్రరూపం
-కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ
పురుషోత్తముడైన శ్రీరాముడు అత్యున్నత మానవీయ విలువలకు పవిత్ర రూపం. మన హృదయాల్లో నిక్షిప్తమైన మానవత్వానికి ఆయనే ఆధారం. రాముడంటే ప్రేమ...దయ...ధర్మం. ఆయన ఎవరికీ అన్యాయం చేయడు. ఎవరిపట్లా నిర్దయగా వ్యవహరించడు.


భిన్నత్వంలో ఏకత్వాన్ని రక్షించుకుందాం
-పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
ప్రాచీన కాలం నుంచీ మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి సుప్రసిద్ధం. దానిని రాబోయే తరాలూ కొనసాగించేలా పరిరక్షించుకుందాం.


నిరంతరంగా రాముడి దీవెనలు
-దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌
శ్రీరాముడి దీవెనలు మనకు ఎల్లవేళలా ఉంటాయి. ఆయన ఆశీస్సులతో పేదరికం కనుమరుగై శక్తిమంతమైన దేశంగా భారత్‌ అవతరించాలి. ప్రపంచమంతటికీ మన దేశం మార్గనిర్దేశం చేయాలి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.