close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నీళ్ల సీసా కంటే తక్కువ ధరకే టీకా

 జినోమ్‌వ్యాలీ చర్చాగోష్ఠిలో భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లా వెల్లడి
 ప్రపంచం మొత్తానికి ఒకే నాణ్యతతో అందిస్తామని స్పష్టీకరణ
ఈనాడు - హైదరాబాద్‌

నీళ్ల సీసా కంటే తక్కువ ధరలోనే కరోనా టీకా తీసుకొస్తామని భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లా వెల్లడించారు. ప్రపంచం మొత్తానికి ఒకే నాణ్యతతో కూడిన టీకాను అందిస్తామని, భారత్‌లో పంపిణీ చేసేవి, విదేశాలకు ఎగుమతి చేసేవి ఒకే నాణ్యతతో ఉంటాయని స్పష్టం చేశారు. ‘‘టీకా అభివృద్ధిలో ఎంతో నైపుణ్యం సాధించాం. కొవిడ్‌ వైరస్‌ కొత్తది కావడం వల్ల అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. అమెరికా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంతో సహకారం అందిస్తున్నాయి. మేమంతా మార్కెట్‌లో పోటీదారులమే కావొచ్చు. మా అందరి పోరాటం కరోనాను జయించడంపైనే’’ అని తెలిపారు. కరోనా టీకా అభివృద్ధి క్రతువును పరిశీలించేందుకుగానూ మంగళవారం మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌లోని జినోమ్‌వ్యాలీని సందర్శించారు. అక్కడ ‘వ్యాక్సిన్‌ కోసం పోటీలో సైన్స్‌, అత్యవసరం-సమతుల్యత’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో పాల్గొన్నారు. ఇందులో భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణ ఎల్లా, బయోలాజికల్‌-ఇ లిమిటెడ్‌ ఎండీ మహిమ దాట్ల, ఇండియన్‌ ఇమ్యూనోలాజికల్‌ ఎండీ ఆనంద్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌, తెలంగాణ జీవశాస్త్రాల సంస్థ సంచాలకుడు శక్తి నాగప్పన్‌ పాల్గొనగా, కేటీఆర్‌ స్వయంగా ప్రయోక్తగా వ్యవహరించారు.ఈ సందర్భంగా టీకా కోసం జరిగే ప్రయోగాలపై ఎవరెవరు ఏమన్నారంటే..


దేశ ఆవిష్కరణల్లో తెలంగాణ నాయకత్వ స్థానంలో ఉంది

దేశంలో టీకాల ఉత్పత్తిలో 70 శాతం వాటా, మూడు హైదరాబాద్‌ కంపెనీలదే. భారతదేశ ఆవిష్కరణల్లో తెలంగాణ నాయకత్వ స్థానంలో ఉంది. ప్రపంచంలోని ఏ టీకా తయారీ కంపెనీ కంటే హైదరాబాద్‌ కంపెనీలు తక్కువేం కాదు. ప్రభుత్వం కొవిడ్‌ను ఆరోగ్యపరమైన సంక్షోభంగానే చూస్తోంది. ఇది భారీ ఆర్థిక సంక్షోభాన్ని కూడా తీసుకొచ్చింది. వ్యాక్సిన్‌ అభివృద్ధి కంపెనీలతో కేంద్రం సంప్రదింపులు జరపాలి. వేగంగా వ్యాక్సిన్‌ తెచ్చే క్రమంలో ఎవరి అవసరాలు ఏమిటో  తెలుసుకోవాలి. అవసరమైన అనుమతులు ప్రాంతీయ కేంద్రం నుంచే ఇవ్వాలి.

- కృష్ణ ఎల్లా, భారత్‌ బయోటెక్‌ సీఎండీ


క్లినికల్‌ ట్రయల్స్‌ సౌకర్యాలు మెరుగుపరచాలి

వ్యాక్సిన్ల అభివృద్ధిలో నిధుల లభ్యత చాలా కీలకం. ఎఫ్‌డీఏ, ప్రపంచ ఆరోగ్య సంస్థలు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చాయి. భారత్‌లోనూ ఆ తరహా మార్గదర్శకాలపై స్పష్టత ఇవ్వాలి. దేశంలో క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రక్రియలో సౌకర్యాలు మెరుగుపరచాలి. టీకా అందుబాటులోకి వచ్చిన నెల వ్యవధిలోనే వందల కోట్ల డోసులు అందుబాటులోకి తీసుకురాగలం. టీకాల అభివృద్ధి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రస్తుతం సంస్థలే సొంత ఖర్చులతో అభివృద్ధి చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన విధానం రావాలి.

- మహిమ దాట్ల, బయోలాజికల్‌-ఇ లిమిటెడ్‌ ఎండీ


కంపెనీల మధ్య ఎలాంటి పోటీ లేదు

టీకాల అభివృద్ధిలో కంపెనీల మధ్య ఎలాంటి పోటీ లేదు. వైరస్‌ను ఎలా జయించాలి? అనే ఆలోచనలే అవి చేస్తున్నాయి. టీకా అధిక ధరలో ఉంటే చాలామందికి అందుబాటులో లేకుండా పోతుంది. ఒక్క డోసు ధర రూ.వెయ్యి అయినా భారత్‌ లాంటి దేశాలకు భారమే. ఒక డోసు టీకా ధర సాధ్యమైనంత తక్కువకే ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. దేశంలో ఏడు సంస్థలు కరోనా టీకా అభివృద్ధిలో కీలకంగా ఉన్నాయి. ఈ ఏడు సంస్థలతో ఒక్కసారి కూడా సమావేశం ఏర్పాటు చేయకపోవడం లోపమే. డీబీటీ, సీఎస్‌ఐఆర్‌ మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలి. దేశంలోని వివిధ పరిశోధన సంస్థల మధ్య వారధిలా వ్యవహరించాలి.

- ఆనంద్‌, ఇండియన్‌ ఇమ్యునోలాజికల్‌ ఎండీ


వచ్చే సంవత్సరం అర్ధ భాగంలో

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 27 టీకాలకు క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. 2021 తొలి అర్ధభాగం ముగిసేనాటికి మిలియన్ల సంఖ్యలో డోస్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. టీకాల విషయంలో భద్రత చాలా ముఖ్యం. భారీ సంఖ్యలో వాక్సినేషన్‌ జరిగినప్పుడు, దానికి అనుగుణంగా భద్రత చర్యలూ తీసుకోవాలి. టీకా ఎంత శాతం ప్రభావాన్ని చూపుతుందో గమనించాలి. గరిష్ఠంగా 70 శాతం, కనిష్ఠంగా 50 శాతం ప్రభావం ఉండాలి. అంటే 50 శాతం కన్నా తక్కువ సామర్థ్యం ఉంటే ఆ టీకా వాడడం అంత మంచికాదని అర్థం.

- సౌమ్య స్వామినాథన్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త


హైదరాబాద్‌ నుంచే తొలిటీకా
  భారత్‌ బయోటెక్‌ నుంచే వచ్చే అవకాశం
  టీకా తయారీ సంస్థలకు ప్రోత్సాహం అందిస్తాం
 పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌

తెలంగాణ నుంచే తొలి కరోనా టీకా వస్తుందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు ఆశాభావం వ్యక్తంచేశారు. టీకా కోసం ఇప్పుడు దేశమంతా హైదరాబాద్‌ వైపే చూస్తోందన్నారు. టీకా తయారీలో భారత్‌ బయోటెక్‌ ముందంజలో ఉండడం గర్వంగా ఉందని, మొదటి టీకా హైదరాబాద్‌ నుంచి రానుండటం ఆనందంగా ఉందని అభిప్రాయపడ్డారు. చర్చాగోష్ఠిలో మంత్రి మాట్లాడుతూ టీకాల అభివృద్ధి, తయారీలో భారత్‌ భాగస్వామ్యం కీలకమైందన్నారు. ప్రపంచవ్యాప్తంగా టీకాల అభివృద్ధి, ఉత్పత్తి, పంపిణీలో భారత్‌ ప్రముఖ పాత్ర పోషిస్తోందన్నారు. ప్రపంచంలోని టీకాల్లో హైదరాబాద్‌ నగరం 1/3వ వంతు కంటే ఎక్కువ ఉత్పత్తి చేయడం మనకు గర్వకారణమన్నారు. టీకా అభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థలకు చేయూతనివ్వడం తెలంగాణ ప్రభుత్వ బాధ్యత అని, అవి చేస్తున్న ప్రయత్నాలకు పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతి చిన్న అనుమతి కోసం దిల్లీ వెళ్లాల్సి రావడం బాధాకరమన్నారు.
భారత్‌ బయోటెక్‌ను సందర్శించిన కేటీఆర్‌
అంతకు ముందు మంత్రి కేటీఆర్‌ జినోమ్‌వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌ టీకా ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. సంస్థ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్లా, జేఎండీ సుచిత్రా ఎల్లా దంపతులు మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిద్దరితో టీకా తయారీ, క్లినికల్‌ ట్రయల్స్‌ గురించి చర్చించారు. తొలి టీకా భారత్‌ బయోటెక్‌ నుంచే రావాలని ఆకాంక్షించారు. కృష్ణ ఎల్లా మాట్లాడుతూ, టీకాలు అందుబాటులోకి వచ్చినప్పుడు వాటి పంపిణీ వ్యూహాలను ప్రకటించాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం సంస్థ ఉద్యోగులతోనూ మంత్రి మాట్లాడారు. ఆ తర్వాత బయోలాజికల్‌-ఇ లిమిటెడ్‌ను కేటీఆర్‌ సందర్శించారు. సంస్థ ఎండీ మహిమ దాట్ల టీకా తయారీ పురోగతిని వివరించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.