close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పర్యావరణ అనుమతులు ఉన్నాయా?

కూల్చడానికి, కట్టడానికి విడివిడిగా అనుమతులేమిటి?
సచివాలయం కూల్చివేత విషయంలో హైకోర్టు ప్రశ్నలు
స్పష్టతనివ్వాలని ప్రభుత్వానికి ఆదేశం
నేడు మళ్లీ విచారణ
ఈనాడు - హైదరాబాద్‌

కొత్త ప్రాజెక్టుగా సచివాలయం పనులు చేపట్టినపుడు.. అందుకోసం భవనాలను కూల్చివేస్తున్నపుడు ముందుగా పర్యావరణ అనుమతులు అవసరమా? లేదా అనే అంశంపై స్పష్టతనివ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బుధవారం హైకోర్టు ఆదేశించింది. ఎలాంటి అనుమతులు లేకుండా, పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా సచివాలయాన్ని కూల్చివేస్తున్నారంటూ ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు, డాక్టర్‌ సీహెచ్‌.సుధాకర్‌లు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సచివాలయం కూల్చివేతపై మంత్రి మండలి తీర్మానాన్ని సీల్డ్‌ కవర్‌లో ప్రభుత్వం అందజేసింది. దాన్ని రహస్య పత్రంగా రిజిస్ట్రార్‌ జనరల్‌ వద్ద భద్రపరచాలని ఆదేశించింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ కేంద్ర పర్యావరణ నిబంధన ప్రకారం సచివాలయ నిర్మాణానికి ముందస్తు అనుమతి అవసరమని, కానీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులకు దరఖాస్తు కూడా చేయలేదని చెప్పారు.

పునాదితో నిర్మాణం ప్రారంభం: ఏజీ
పునాదుల కోసం భూమిని తవ్వకం మొదలుపెట్టినప్పుడే నిర్మాణం ప్రారంభమైనట్లని, అన్ని అనుమతులు తీసుకున్నాకే ఆ పనులు ప్రారంభమవుతాయని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ తెలిపారు. ప్రస్తుతం తాము కూల్చివేతలే చేపట్టామని, అందుకోసం అవసరమైన అనుమతులు తీసుకున్నామని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ భూమిని సిద్ధం చేయడమంటే ఏమిటని ప్రశ్నించింది. చట్టప్రకారం 20,000 నుంచి 1.50 లక్షల చదరపు మీటర్ల నిర్మాణాలకు పర్యావరణ అనుమతులు అవసరమని పేర్కొంది. ఏజీ జోక్యం చేసుకుంటూ.. ఎవరైనా శిథిలావస్థలో ఉన్న ఇంటిని కూల్చివేసి ఖాళీ స్థలాన్ని ఉంచుకోవాలనుకున్నపుడు కూల్చివేతకు మాత్రమే ముందు అనుమతులు తీసుకుంటారని, తరువాత ఎప్పుడైనా నిర్మాణం చేపడుతున్నపుడు దానికి సంబంధించిన అనుమతులు తీసుకుంటారని చెప్పారు. అలాగే తామూ ప్రస్తుతం కూల్చివేతలకు అనుమతులు తీసుకుని పనులు చేపట్టామన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఎవరైనా స్థలాన్ని తీసుకుని చదును చేయడం కోసం పురాతన శిలలను ధ్వంసం చేసి.. తర్వాత నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ నుంచి విడిగా అనుమతులు తీసుకుంటామంటే అంగీకరిస్తారా? అలాంటప్పుడు పర్యావరణ పరిరక్షణ చట్టం స్ఫూర్తి దెబ్బతినదా? అని ప్రశ్నించింది. కనీసం పర్యావరణ ప్రభావం అధ్యయనానికైనా దరఖాస్తు సమర్పించారా? అని అడిగింది. కూల్చివేత పనులు కొత్త నిర్మాణం పరిధిలోకి రావని ఏజీ చెప్పగా వాటికి సంబంధించిన సుప్రీం కోర్టు తీర్పులను సమర్పించాలంటూ విచారణను గురువారానికి వాయిదా వేసింది.


కొత్త మసీదు నిర్మిస్తాం

ఈనాడు, హైదరాబాద్‌: సచివాలయ ప్రాంగణంలో కొత్త మసీదును నిర్మించి ఇస్తామని ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. ఇక్కడ వక్ఫ్‌బోర్డుకు చెందిన మసీదును కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ జాకీర్‌ హుస్సేన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇది బుధవారం విచారణకు రాగా.. కొత్త మసీదు నిర్మిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇదే విషయాన్ని మెమో రూపంలో దాఖలు చేయాలని జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ముగించారు.


నేడు ఎన్జీటీలో విచారణ

ఈనాడు, దిల్లీ: తెలంగాణ సచివాలయం కూల్చివేతపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) చెన్నై బెంచ్‌ గురువారం విచారణ చేపట్టనుంది. కూల్చివేత పర్యావరణ నిబంధనలకు విరుద్ధమంటూ మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.