close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పుట్టిన ఊరొచ్చినా పుట్టెడు కష్టాలే

చెట్టు నీడే ఇల్లు.. ఆకలిదప్పులే దోస్తులు
పనుల్లేక వలస కూలీల ఇక్కట్లు
ఈనాడు, యంత్రాంగం


ఫొటోలో కనిపిస్తున్నది రవినాయక్‌, ఆయన తల్లి. వీరిది మహబూబ్‌నగర్‌ జిల్లా ధన్వాడ మండలం మణిపూర్‌తండా. బతుకుదెరువు కోసం ముంబయికి వెళ్లారు. బేలాపూర్‌ సీబీడీ ప్రాంతంలో ఉంటూ కూలి చేసుకునేవారు. లాక్‌డౌన్‌తో పనులు దొరక్క సొంతూరుకు చేతిలో రూ.20 వేలతో బయలుదేరారు. రవాణాకు రూ.16 వేలు ఖర్చయ్యాయి. తీరా ఊరికి వస్తే... క్వారంటైన్‌ నిబంధనల కారణంగా వారిని అధికారులు శివారులోనే ఉండమన్నారు. దీంతో వారు మామిడితోటలో ప్లాస్టిక్‌ కవర్‌తో వేసుకున్న గుడిసెలో ఉంటున్నారు. మిగిలిన రూ.4 వేలు ఇక్కడే ఖర్చయ్యాయి. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.


పుట్టి పెరిగిన ఊరిలో పుట్టెడు కష్టాలు అనుభవించారు. తమ జీవితాలకు నగరాలు ఓ దారి చూపుతాయనే గంపెడాశతో వలసబాట పట్టారు. అక్కడ కూలీనాలీ చేసుకుంటూ... అతికష్టంగా కాలం వెళ్లదీస్తున్న సమయంలో ఆ అభాగ్యుల నెత్తిన కరోనా పిడుగులా పడింది. వారి జీవితాలను లాక్‌డౌన్‌ అతలాకుతలం చేసింది. పనులు దొరక్క, పస్తులకు తాళలేక... పుట్టెడు దుఃఖంతో, కాళ్లీడ్చుకుంటూ ఊరికొస్తే ఇక్కడా కన్నీళ్లు తప్పడం లేదు. క్వారంటైన్‌లో భాగంగా కొందరు ఊరి బయట, చెట్ల నీడన ఉంటున్నారు. ఊహ తెలిసినప్పటి నుంచీ తమను వదలని ఆకలితోనే సహవాసం చేస్తున్నారు. ఇక నిర్బంధం ముగిసినా... పలువురు ఇంటి నుంచి బయటకే రావడం లేదు. ఊర్లో చేసేందుకు పనుల్లేక అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఇలాంటి బాధితుల్లో కొందర్ని ‘ఈనాడు’ పలకరించగా... కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం ఊతమిస్తేనే తమకు ఉపాధి దొరుకుతుందని, ఆకలి దప్పులు తీరుతాయని వేడుకుంటున్నారు.

మొదట్లో సాయం... తర్వాత దూరం
క్వారంటైన్‌ సమయంలో కొందరు వలస కూలీలు... స్థానిక బాధ్యుల నుంచి సరిగ్గా సాయమందడం లేదు. కొన్నిచోట్ల బాధితులు ఊరికి దూరంగా తలదాచుకుంటున్నారు.
వలస వెళ్లినచోట సంపాదించిన కాస్త డబ్బులూ తిరిగి వచ్చేందుకు ఖర్చయ్యాయి. అసలే ఉత్తచేతులతో సొంతూరుకు వచ్చిన వారు ఆకలి తీర్చుకోవడానికి అప్పులు చేయాల్సి వస్తోంది. కొన్ని గ్రామాల్లో సర్పంచులు సరకులు ఇచ్చినప్పటికీ... అవి 14 రోజుల క్వారంటైన్‌కు సరిపోవడం లేదు. మరోవైపు క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి కష్టాలు పెరిగాయి. ఊర్లో ఎలాంటి కార్యకలాపాలు సాగడంలేదు. ‘‘ముంబయిలో భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నాం. కరోనాతో నిజామాబాద్‌ వచ్చేందుకు ఒక్కొక్కరికి రూ.7వేలు అయ్యాయి. ఊర్లోకి వెళ్లిన వెంటనే అధికారులు 14 రోజుల క్వారంటైన్‌ అన్నారు. ఆ గడువు ముగిశాక గ్రామంలో చేసేందుకు పనుల్లేవు. సొంతూర్లకు తిరిగి వచ్చిన వలస కూలీలను ప్రభుత్వమే ఆదుకోవాలి.’’ అని నిజామాబాద్‌ జిల్లా సిరికొండకు చెందిన కూలీలు విన్నవిస్తున్నారు.

సర్పంచి అనుమతిస్తే పనుల్లోకి
మహబూబ్‌నగర్‌ జిల్లా ధన్వాడ మండలానికి చెందిన పిక్యానాయక్‌ పనుల కోసం ముంబయి వెళ్లారు. అక్కడ నిర్మాణ పనులు చేసుకుంటూ ఆరుగురు కుటుంబ సభ్యులను పోషించుకున్నారు. లాక్‌డౌన్‌తో పనుల్లేక వారం రోజుల క్రితం ధన్వాడకు వచ్చారు. ఇక్కడికి రాగానే క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. దీంతో పిక్యానాయక్‌ కుటుంబంతో సహా కొన్నాళ్లు ఊరిబయట మామిడి తోటలో ఉండాల్సి వచ్చింది. ‘సర్పంచి అనుమతిస్తే పొలం పనులు చేసుకుంటాం. పరిస్థితులు చక్కబడితే మళ్లీ ముంబయి వెళ్తాం’ అని చెప్పారు నాయక్‌.


ఇక్కడే కూలి చేసుకుంటాం

వీరు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని చాంద్‌ఖాన్‌పల్లికిచెందిన ఎరుకల చంద్రయ్య(39), యాదమ్మ(37) దంపతులు. ఇద్దరు పిల్లలను తల్లి వద్ద వదిలిపెట్టి 18 ఏళ్ల కిందట ముంబయి వెళ్లారు. అక్కడే అద్దె ఇంట్లో ఉంటూ మేస్త్రీ చేతికింద కూలీలుగా పనిచేసేవారు. నెలకు రూ.20 వేల వరకు సంపాదించేవారు. గది అద్దె రూ.4 వేలు. ఇతర ఖర్చులు రూ.6 వేలుపోగా... మిగిలే రూ.10 వేలను ప్రతినెలా ఇంటికి పంపేవారు. కొడుకు ఇంటర్‌, కూతురు 6వ తరగతి చదువుతున్నారు. మార్చి నుంచి ముంబయిలో కరోనా విజృంభించడంతో ఇంటికే పరిమితమయ్యారు. వలస కార్మికులకు సొంత ప్రాంతాలకు వెళ్లే అవకాశం కల్పించగా బస్సులో ఈనెల 18న సొంతూరు వచ్చారు. గ్రామంలోకి రాగానే అధికారులు పాఠశాల భవనంలో క్వారంటైన్‌ చేశారు. జూన్‌ 14 వరకు అక్కడే ఉండాలనిసూచించారు. పిల్లలను దూరం నుంచే చూసుకుంటున్నారు. వీరికి బాధిత కుటుంబ సభ్యులే భోజనం, నీళ్లు, ఇతర వస్తు, సామగ్రిని దూరం నుంచి అందిస్తున్నారు.‘‘ఇగ ముంబయి పోయే ఆలోచనలేదు. ఈడనే ఏమైనా కూలీ చేసుకుని బతుకుతం. కరోనా తగ్గి పరిస్థితులు బాగైనా... మా ఊర్ల పనులు దొరక్కుంటే అప్పుడు మళ్లా ఆలోచిస్తాం’’అని తెలిపారు.


ముంబయి నుంచి నడుచుకుంటూ వచ్చాం

యన జనగాం వాసి గూడిగల్ల గాలయ్య. బతుకుదెరువు కోసం ముంబయి వెళ్లారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడ్డారు. నెల రోజులపాటు పనులు దొరకలేదు. చేతిలో డబ్బులేదు. తినడానికి తిండి లేక పస్తులున్నారు. ‘‘ఏప్రిల్‌ 21న ముంబయి నుంచి నడక మొదలుపెట్టాం. దారిలో అక్కడక్కడ వాహనదారులను లిఫ్టు అడుగుతూ 3రోజుల తర్వాత జనగాం చేరుకున్నాం. రాగానే వారం రోజులు క్వారంటైన్‌ చేశారు. ఆ తర్వాత ఇంటికి వచ్చాం. ఇప్పటివరకు దాతలిచ్చిన సరకులతోనే పూట గడిచింది. ఇప్పుడు చేసేందుకు పనుల్లేవు. పస్తులుండాల్సి వస్తోంది. నాతోపాటు చాలామంది వలస కూలీల పరిస్థితి ఇలాగే ఉంది. ప్రభుత్వం ఆదుకుని పనులు కల్పిస్తే పొట్ట నింపుకుంటాం’’ అని కోరుతున్నారు.


పనిలేదు... అప్పు పుట్టడం లేదు!

తని పేరు మామిడాల రాజు. యాదాద్రి జిల్లా కొలనుపాక సొంతూరు. ఉపాధి కోసం భార్యతో కలిసి ముంబయిలోని బోరివిలీకి వెళ్లారు. వీరికి ఇద్దరు పిల్లలు. భార్యాభర్తలిద్దరూ ఇళ్లలో బట్టలు ఉతుకుతూ జీవనం సాగిస్తున్నారు. నెలంతా కష్టపడినా రూ.28 వేలకు మించిరావు. అవి పిల్లల చదువులకు, కుటుంబ పోషణకు సరిపోతున్నాయి. సొంతూర్లో అప్పులున్నాయ్‌. లాక్‌డౌన్‌తో ఉపాధి దూరం దూరమైంది. దీంతో సొంతూరు కొలనుపాకకు చేరారు. ‘‘ఊరికి వచ్చిన వెంటనే అధికారులు 14రోజులు హోమ్‌ క్వారంటైన్‌ చేశారు. ఆ గడువు ముగిసింది. అయినా ఉపాధి దొరకడంలేదు. కూలీ పనులూ లేవు. అర్థాకలితో ఉండాల్సి వస్తోంది. క్వారంటైన్‌ చేయడంతో ఇరుగుపొరుగు, బంధువులు అదోలా చూస్తున్నారు. చేబదులు కోసం ఎవరింటికీ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. సాఫీగా సాగుతున్న జీవనం లాక్‌డౌన్‌ దెబ్బతో ఒక్కసారిగా తలకిందులైంది’’ అని రాజు వాపోయారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.