close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
హైదరాబాద్‌లో అమెరికన్‌ సంస్థ మెడ్‌ట్రానిక్‌ 1200 కోట్లపెట్టుబడులు

వైద్య పరికరాల ఇంజినీరింగు, ఆవిష్కరణల కేంద్రం ఏర్పాటు
ఆరంభంలో వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు
మంత్రి కేటీఆర్‌ హర్షం

ఈనాడు, హైదరాబాద్‌: వైద్య పరికరాల తయారీలో ప్రసిద్ధి చెందిన అమెరికన్‌ సంస్థ మెడ్‌ట్రానిక్‌ తెలంగాణలో రూ.1200 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్థిక జిల్లాలో ఉన్న పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని విస్తరించి భారీ ఇంజినీరింగు, ఆవిష్కరణల కేంద్రంగా రూపొందించనుంది. దీని ద్వారా ప్రారంభంలో వెయ్యి మందికి ఉపాధి లభిస్తుంది. క్రమేపీ అది అయిదువేల వరకు చేరుకుంటుంది. అమెరికా తర్వాత ప్రపంచంలో ఏర్పాటు చేస్తున్న రెండో కేంద్రం ఇదే. సంస్థ ఛైర్మన్‌ ఒమర్‌ ఇస్రాక్‌ మంగళవారం తెలంగాణ పరిశ్రమల మంత్రి కేటీఆర్‌తో జరిగిన దృశ్య మాధ్యమ సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. ఈ నిర్ణయంపై కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో దేశంలో అతిపెద్ద పెట్టుబడి ఇదేనని పేర్కొన్నారు. దీంతో హైదరాబాద్‌ భారత్‌లో వైద్యపరికరాల కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు. పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించేలా మరిన్ని నూతన పెట్టుబడులు హైదరాబాద్‌కు వస్తాయన్న విశ్వాసాన్ని మంత్రి కేటీఆర్‌ వ్యక్తం చేశారు.

140 దేశాల్లో కార్యకలాపాలు
అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా మెడ్‌ట్రానిక్‌ 140 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైగా ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. 2019-20లో అది 30 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2016లో అమెరికాలో పర్యటించిన సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మెడ్‌ట్రానిక్‌ కార్యనిర్వాహక ఛైర్మన్‌ ఒమర్‌ ఇస్రాక్‌తో సమావేశమై పెట్టుబడుల గురించి చర్చించారు. అప్పటి నుంచి దీనిపై సంప్రదింపులు జరుగుతున్నాయి. చివరికి సంస్థ నిర్ణయం తీసుకోవడంతో దాని ప్రతినిధులు మంగళవారం జరిగిన సమావేశంలో తమ సంసిద్ధతను ప్రకటించారు.

తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు...
ఈ సందర్భంగా ఇస్రాక్‌ మాట్లాడుతూ, పరిశోధన, అభివృద్ధి ఆవిష్కరణకు హైదరాబాద్‌ కేంద్రం కృషి చేస్తుందని అన్నారు. ‘మా తాజా పెట్టుబడి భారత్‌ పట్ల నిబద్ధతకు, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు మేం తీసుకున్న నిర్ణయాన్ని సూచిస్తుంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే కేంద్రం ద్వారా రోగుల బాధను దూరం చేసి వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలన్న మా  సంస్థ లక్ష్యాలు నెరవేరతాయి. అరోగ్య రంగాన్ని మరింతగా విస్తరించాలన్న ప్రభుత్వ లక్ష్యాల మేరకు ఈ భాగస్వామ్యం ఉంటుంది’ అని  అన్నారు. సంస్థ భారత ఉపఖండ ఉపాధ్యక్షుడు మదన్‌ కృష్ణ మాట్లాడుతూ ‘మా సంస్థ తాజా పెట్టుబడి ద్వారా భారతదేశ వైద్యపరికరాల ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ బలోపేతమవుతుంది. తెలంగాణలో పెట్టుబడి ద్వారా ఆరోగ్య సంరక్షణ రంగంలో అనేక ఉపాధి అవకాశాలు వస్తాయి. ప్రస్తుతం సంస్థ కార్యకలాపాల విస్తరణ ద్వారా ఇక్కడి ఇంజనీరింగ్‌ విద్యార్థులు మెడ్‌ట్రానిక్స్‌ కంపెనీతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది’ అని తెలిపారు.


కేటీఆర్‌ అభినందనలు

ఈ సందర్భంగా కేటీఆర్‌ సంస్థ ఛైర్మన్‌ ఒమర్‌కు, సీసీవో జెఫ్రీ ఎస్‌.మార్తకు అభినందనలు తెలిపారు. ‘మెడ్‌ట్రానిక్‌ అమెరికా తర్వాత అతి పెద్ద ఇంజినీరింగు, ఆవిష్కరణల కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకోవడం అభినందనీయం. వైద్య పరికరాల తయారీ, సాంకేతికత, ఆవిష్కరణలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వైద్య పరికరాల తయారీ సంస్థలతో కలిసి పనిచేస్తూ ప్రపంచ ఆరోగ్య రంగంలో సానుకూల మార్పు దిశగా పని చేస్తాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార ధోరణులను పరిశీలించినప్పుడు భారతదేశానికి ఈ రంగంలో అద్భుతమైన అవకాశాలు న్నాయి’ అని మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా అన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.