close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నగరంలో భారీగా అమ్మోనియం నైట్రేట్‌ నిల్వలు

రాజధాని శివార్లలోని పేలుడు పదార్థాల తయారీ కంపెనీల్లో వినియోగం
కీసర కంపెనీకి 200 టన్నుల సరకు దిగుమతి
అధికార యంత్రాంగం అప్రమత్తం

ఈనాడు, హైదరాబాద్‌: లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో అమ్మోనియం నైట్రేట్‌ నిల్వ ఉంచిన గోదాములో పేలుళ్లు సంభవించి పెద్దఎత్తున ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో.. తెలంగాణలోనూ ఆ సరకు నిల్వలు భారీగా ఉన్నాయనే సమాచారం చర్చనీయాంశంగా మారింది. పేలుడు పదార్థాలను ఉత్పత్తి చేసే కర్మాగారాలు రాష్ట్రంలో ఎక్కువగా ఉండటంతో సహజంగానే తరచూ అమ్మోనియం నైట్రేట్‌ను దిగుమతి చేసుకుంటున్నారు. తాజాగా చెన్నై నుంచి 200 టన్నుల సరకును సోమవారం కీసరలోని ఓ కంపెనీకి చేరవేశారు. చెన్నైలో ప్రభుత్వం నిర్వహించిన ఈ-వేలంలో ఆ కంపెనీ అమ్మోనియం నైట్రేట్‌ను కొనుగోలు చేసింది. దాదాపు 697 టన్నుల సరకు రావాల్సి ఉండగా.. తొలివిడతగా మంగళవారం పది కంటెయినర్లలో తరలించారు. కీసర కంపెనీతో పాటు నగర శివార్లలోని 20 వరకు కర్మాగారాలకు చెన్నై, ముంబయి, విశాఖపట్నం రేవుల నుంచి అమ్మోనియం నైట్రేట్‌ను దిగుమతి చేసుకుంటున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌, తెలంగాణలో సింగరేణి బొగ్గుగనులు, సిమెంట్‌ పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో వీటిల్లో వినియోగించే పేలుడు పదార్థాల తయారీకి అమ్మోనియం నైట్రేట్‌ కీలకంగా మారింది. హైదరాబాద్‌ శివారులు, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కంపెనీల్లో పేలుడు పదార్థాలు తయారు చేస్తున్నారు.. ఈ క్రమంలో అమ్మోనియం నైట్రేట్‌ను భారీగా నిల్వ ఉంచే గోదాముల్లో చేపట్టాల్సిన జాగ్రత్తలపై డిప్యూటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ యంత్రాంగం నిఘా ఉంచుతోంది. అమ్మోనియం నైట్రేట్‌ తాజా నిల్వల నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్‌ ఉన్నతాధికారులు కీసర కంపెనీలో తనిఖీలు జరిపారు.


నగరానికి మరో 229 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌!

హైదరాబాద్‌కు చెందిన సాల్వో ఎక్స్‌ప్లోజివ్స్‌ సంస్థ కొనుగోలు చేసిన 697 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను చెన్నై రేవు నుంచి నగరానికి తరలిస్తున్న క్రమంలో దాన్ని ఎక్కడ భద్రపరుస్తారనే విషయంపై ఆ సంస్థ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. తొలిదశలో ఇప్పటికే 200 టన్నుల సరకును హైదరాబాద్‌కు చేరవేయగా.. రెండోదశలో మరో 229 టన్నుల సరకును కంటైనర్లలో చేర్చుతున్నట్లు వారు తెలిపారు. చెన్నైలో నిల్వ ఉన్న అమ్మోనియం నైట్రేట్‌ను ఈ-వేలంలో తమ సంస్థ సొంతం చేసుకుందని, ఈ క్రమంలో దశలవారీగా తరలింపు చేపట్టామని చెప్పారు. పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారని, అధికారులు తనిఖీలు జరిపి అమ్మోనియం నైట్రేట్‌ తరలింపునకు అనుమతులన్నీ ఇచ్చారని వివరించారు. ఈ పేలుడు పదార్థాన్ని సింగరేణితో పాటు ఇతర క్వారీలకు సరఫరా చేస్తామన్నారు. మిగిలిన నిల్వలను పెసో ప్రమాణాలకు అనుగుణంగా భద్రపరుస్తామని స్పష్టం చేశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.