close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పరీక్షలు పెంచండి.. మరణాలు తగ్గించండి

ముఖ్యమంత్రులతో భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ

ఈనాడు, దిల్లీ: కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరులో మన దేశం విజయంసాధిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో 80 శాతం, మరణాల్లో 82 శాతం పది రాష్ట్రాల్లోనే ఉంటున్నాయని, అక్కడ అడ్డుకట్టవేస్తే కొవిడ్‌పై యుద్ధంలో మనం గెలిచినట్లేనని తెలిపారు. దేశంలో కరోనా సంక్రమణం, దాని నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ప్రధాని మోదీ మంగళవారం ఉదయం వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంభాషించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, బిహార్‌, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రులు, కర్ణాటక ఉపముఖ్యమంత్రితో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. టీం ఇండియాగా ప్రతి ఒక్కరూ అద్భుతమైన సహకారం అందిస్తూ, బృంద కార్యస్ఫూర్తిని ప్రదర్శించారని అభినందించారు.

72 గంటల్లో గుర్తించాలి
కరోనా నిర్ధరణ పరీక్షల పెంపు, మరణాల తగ్గింపు లక్ష్యంగా ప్రధాని మాట్లాడారు. కరోనా సోకిన వ్యక్తిని, ఆ వ్యక్తికి దగ్గరగా వచ్చిన వ్యక్తులను 72 గంటల్లోగా గుర్తించగలిగితే వైరస్‌ వ్యాప్తిని మరింత సమర్థంగా అడ్డుకోవచ్చని తెలిపారు. ‘‘ప్రస్తుతం రోజువారీ పరీక్షల సంఖ్య 7 లక్షలకు చేరింది. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. మన దేశంలో సగటు మరణాల రేటు ప్రపంచ సగటు కంటే అతి తక్కువ ఉంది. దీనిని సాధ్యమైనంత త్వరగా 1% కన్నా దిగువకు తీసుకురావాలి. ప్రస్తుత సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను బట్టి బిహార్‌, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, తెలంగాణల్లో యుద్ధప్రాతిపదికన పరీక్షల సంఖ్యపెంచాలి. కంటెయిన్‌మెంట్‌, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, నిఘాలే ఈ యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన ఆయుధాలు’’ అని ప్రధాని పేర్కొన్నారు. తక్కువ పరీక్షలు, ఎక్కువ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో పరీక్షల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు.

దిల్లీ అనుభవాలను చూడండి
దిల్లీ, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లో కొవిడ్‌ నివారణ కోసం హోంమంత్రి అమిత్‌షా చేపట్టిన మార్గసూచి(రోడ్‌మ్యాప్‌) గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘కంటెయిన్‌మెంట్‌ జోన్లను వేరుచేసి, ఎక్కువ ముప్పు పొంచి ఉన్న రోగులపై దృష్టి సారించి స్క్రీనింగ్‌ చేయడమే దిల్లీ వ్యూహంలో కీలకాంశం. ఆసుపత్రుల్లో పడకల నిర్వహణను మెరుగుపరిచి, ఐసీయూ పడకలు పెంచడం కూడా చాలా మేలు చేసింది’’ మోదీ తెలిపారు.

ముఖ్యమంత్రులు ఏమన్నారు?
తమ రాష్ట్రాల్లోని క్షేత్రస్థాయి పరిస్థితులను, తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రులు ప్రధానికి వివరించారు. మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొనేందుకు ప్రధాని అందిస్తున్న నాయకత్వాన్ని అభినందించారు. సిరో సర్వే నిర్వహణకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి మార్గదర్శనం కోరారు. దేశంలో సమీకృత వైద్య మౌలికవసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. దేశంలో కరోనా పరిస్థితి గురించి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన కేంద్ర వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ మాట్లాడుతూ మరణాలకు సంబంధించి కచ్చితమైన లెక్కలను రాష్ట్రాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలాసీతారామన్‌, హర్షవర్ధన్‌తో పాటు హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.