close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇక.. జల వనరుల శాఖ

నీటిపారుదల శాఖలో అన్ని విభాగాలు కలిపి ఏర్పాటు
శాఖ పునర్‌వ్యవస్థీకరణ సమీక్షలో సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సాగునీటిరంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా నీటిపారుదల శాఖను పునర్‌వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. మంగళవారం ఆ శాఖపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, తరువాత పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చింది. సాగునీటి వసతులు పెరిగాయి. కొత్తగా అనేక ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, పంపు హౌసులు వాటి కింద ఆయకట్టు పెరిగాయి. పనిభారం కూడా మరింత పెరిగింది. మారిన పరిస్థితులకు అనుగుణంగా శాఖలో సీఈలు బాధ్యులుగా అధిక ప్రాదేశిక ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నాం. గతంలో మాదిరిగా వివిధ విభాగాల కింద కాకుండా జల వనరుల శాఖ అంతా ఒక విభాగంగానే పనిచేస్తుంది’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ముఖ్య ఇంజినీర్ల ప్రాదేశిక ప్రాంతాల సంఖ్య పెంపు
రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ప్రస్తుతం 13 చీఫ్‌ ఇంజినీర్ల ప్రాదేశిక ప్రాంతాలున్నాయి. వాటి సంఖ్యను 19కి పెంచాలని సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆదిలాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, రామగుండం, వరంగల్‌, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, గజ్వేల్‌, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, హైదరాబాద్‌ కేంద్రాలుగా సీఈ ప్రాదేశిక ప్రాంతాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ ప్రాదేశిక ప్రాంతాల పరిధిలోని ప్రాజెక్టులు, చెరువులు, నీటి పారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ) ఎత్తిపోతలు, జలాశయాలు, బ్యారేజీలు, పంపు హౌసులు, కాల్వలు, విద్యుత్తు ఉప కేంద్రాలన్నీ సీఈ పరిధి కిందికే వస్తాయి. గతంలో భారీ, మధ్యతరహా, చిన్న తరహా, ఐడీసీ లాంటి వివిధ విభాగాల కింద ఉన్న నీటి పారుదల శాఖ ఇకపై జల వనరుల శాఖగా మాత్రమే కొనసాగనుంది.


ఘనపూర్‌ ఆనకట్టకు వనదుర్గ ప్రాజెక్టుగా నామకరణం

మెదక్‌ జిల్లాలోని ఘనపూర్‌ ఆనకట్టకు వనదుర్గ ప్రాజెక్టుగా నామకరణం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీంతోపాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పాకాల చెరువు కింద కాల్వలను పునరుద్ధరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన కాల్వలు శిథిలమయ్యాయని, వాటి పునరుద్ధరణతో 30 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి సీఎంకు విన్నవించారు. స్పందించిన ముఖ్యమంత్రి కాకతీయులు నిర్మించిన పాకాల కాల్వలను పునరుద్ధరించడం అంటే వారసత్వాన్ని కాపాడుకోవడమే అన్నారు. వెంటనే అంచనాలు తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సమావేశంలో మంత్రులు ఎస్‌.నిరంజన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌, సీఎంవో కార్యదర్శి స్మిత సభర్వాల్‌, ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే, ఈఎన్‌సీ బి.నాగేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.