close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఏందీ రాద్ధాంతం!

స్నేహ హస్తం అందిస్తే కయ్యం పెట్టుకుంటున్నారు
ఏపీ సర్కారు తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహం..
కేంద్రంపైనా విమర్శలు

నా అంతట నేనే ఏపీ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడా

- బేసిన్లు, భేషజాలు లేవని చెప్పినా అర్థంలేని ఫిర్యాదులు చేస్తున్నారు

  ప్రాజెక్టుల గురించి మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితి కల్పిస్తాం

సీఎం కేసీఆర్‌ స్పష్టీకరణ

జరగబోయే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంపై అధికారులతో చర్చించిన సీఎం

సాగునీటి రంగంలో తెలంగాణకు మొదటి నుంచీ అన్యాయమే జరుగుతోంది. ఏలేశ్వరం వద్ద నిర్మించాల్సిన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును 17 కిలోమీటర్ల దిగువన కట్టడంతో అన్యాయం జరిగింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన కారణంగా ఎగువ కృష్ణ, తుంగభద్ర, బీమా ప్రాజెక్టులు పోయాయి.
ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అర్థంపర్థం లేని.. నిరాధారమైన అనవసర రాద్ధాంతం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంబిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో పూర్తి వాస్తవాలు, సంపూర్ణ సమాచారంతో సమర్థ వాదనలు వినిపించాలని నిర్ణయించారు. ఇటు ఏపీ ప్రభుత్వానికి, అటు కేంద్రానికి గట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి ఏపీ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో అనుసరించాల్సిన విధానాన్ని ఖరారు చేసేందుకు సోమవారం సీఎం ప్రగతి భవన్‌లో నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశీలించి మాట్లాడారు.

ఏపీ నోరు మూయించేలా సమాధానం చెబుతాం
‘‘నా అంతట నేనే ఏపీ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహ హస్తం అందించా. బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని మన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పా. సహజ సరిహద్దు రాష్ట్రాలు కాబట్టి స్నేహ పూర్వకంగా మెదిలి అంతిమంగా రైతులకు సాగునీరు అందించే లక్ష్యం సాధించాలని ప్రతిపాదించా. వృథాగా సముద్రం పాలవుతున్న నీటిని రైతుల పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలు చేద్దామని చెప్పా. అయినా సరే ఏపీ ప్రభుత్వం కయ్యం పెట్టుకుంటోంది. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అర్థం లేని వాదనలతో, నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తోంది. అపెక్స్‌ కమిటీ సమావేశంలో ఏపీ ప్రభుత్వం నోరు మూయించేలా సమాధానం చెబు తాం. తెలంగాణ ప్రాజెక్టుల గురించి మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఏపీ ప్రభుత్వానికి కల్పిస్తాం.

‘శ్రీశైలం’ జల విద్యుత్తు ప్రాజెక్టు
తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిలో కూడా చాలా తప్పుంది. రాష్ట్రానికి ఉన్న నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. తెలంగాణ ఏర్పడే నాటికే నీటి కేటాయింపులు జరిగి, అనుమతులు పొంది, ఖర్చు కూడా జరిగిన ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏ మాత్రం సరికాదు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే విషయంలో కూడా కేంద్రం అనవసరంగా అభ్యంతరం చెబుతోంది. వాస్తవానికి నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నింపిన తరువాతే మిగిలిన ప్రాజెక్టులు నింపాలి. అసలు శ్రీశైలం ప్రాజెక్టు నీటి పారుదల ప్రాజెక్టు కాదు. అది జల విద్యుత్తు ప్రాజెక్టు. ఇన్ని వాస్తవాలు పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడం సమంజసం కాదు. ఒక రాష్ట్రంగా తెలంగాణకు కూడా హక్కులుంటాయి. ఆ ప్రకారం ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఈ విషయంలో రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరించడం తగదు. కేంద్ర వైఖరిని కూడా యావత్‌ దేశానికి తెలియజేస్తాం.

రాష్ట్రం ఏర్పడే నాటికే రూ.23 వేల కోట్ల ఖర్చు
గోదావరి, కృష్ణా పరీవాహకాల్లో రాష్ట్రానికి ఉన్న హక్కుల ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. తెలంగాణ ఏర్పడే నాటికే ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్టులు మంజూరై ఉన్నాయి. వాటికి నీటి కేటాయింపులు చేశారు. కేంద్ర జల సంఘం సహా ఇతర సంస్థల నుంచి అనుమతులు వచ్చాయి. దాదాపు రూ.23 వేల కోట్ల వరకు నిధులు ఖర్చు చేశారు. 31,500 ఎకరాల భూసేకరణ చేశారు. ఇంత జరిగిన తరువాత ఇప్పుడు వీటిని కొత్త ప్రాజెక్టులు అనడంలో అర్థంలేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో మంజూరైనప్పటికీ వాటిని పూర్తి చేయలేదు. పైగా తక్కువ నీటితో ఎక్కువ ఆయకట్టును ప్రతిపాదించారు. దీనివల్ల సాగునీటి అవసరాలు సంపూర్ణంగా తీరవు. చాలా ప్రాజెక్టుల డిజైన్లను తెలంగాణ రాష్ట్ర అవసరాలకు తగినట్లు చేయలేదు. కాబట్టి తెలంగాణ వచ్చిన తరువాత ఈ రాష్ట్రానికి ఉన్న హక్కులు, అవసరాలు, నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు పునరాకృతి చేసి నిర్మిస్తున్నాం. దీన్ని తప్పు పట్టడంలో అర్థం లేదు. గతంలో జరిగిన మొదటి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రలో చేపట్టిన ముచ్చుమర్రిని ప్రస్తావించింది. దీంతో ఈ రెండింటిని కొనసాగించాలనే నిర్ణయం జరిగింది. మళ్లీ ఆ అంశాన్ని లేవనెత్తడం సరికాదు. పాలమూరు-రంగారెడ్డి విషయంలో కూడా వాస్తవాలను మరోసారి వివరిస్తాం. మంచినీటి అవసరాల కోసం వినియోగించే నీటిలో 20 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ట్రైబ్యునల్‌ చెప్పింది. దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రం మంచినీటి కోసం వినియోగించే 110 టీఎంసీలలో 22 టీఎంసీలను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

ఇంకా తెలంగాణకు నీటి అవసరం ఉంది
రాష్ట్రం వచ్చిన తరువాత తెలంగాణకు దక్కిన నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని కేసీఆర్‌ తెలిపారు. ‘‘వాస్తవానికి ఇంకా తెలంగాణకు నీటి అవసరం ఉంది. గోదావరికి తెలంగాణలోనే క్యాచ్‌మెంట్‌ ప్రాంతం ఎక్కువ. నది ప్రవహించేది కూడా ఎక్కువ. సముద్రంలో కలిసే రెండు వేల టీఎంసీలలో కనీసం వెయ్యి టీఎంసీలు కేటాయించాలి’’ అని ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యే సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

అపెక్స్‌ కౌన్సిల్‌లో అన్నీ చెపుతాం
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరంగా; కంతనపల్లి ప్రాజెక్టును సమ్మక్క సాగర్‌గా; రాజీవ్‌సాగర్‌-ఇందిరా సాగర్‌ ప్రాజెక్టులను సీతారామ ప్రాజెక్టుగా; దుమ్ముగూడెం ప్రాజెక్టును సీతమ్మ సాగర్‌గా పునరాకృతి చేసి నిర్మిస్తున్నాం. పెన్‌గంగ ప్రాజెక్టులకు 1975లోనే ఒప్పందం కుదిరి ట్రైబ్యునల్‌ అవార్డు కూడా పూర్తయింది. ఆ ప్రాజెక్టులు ఎప్పుడు మంజూరయ్యాయి? ఏయే అనుమతులు సాధించారు? తెలంగాణ వచ్చే నాటికి ఎంత ఖర్చు చేశారు? ఎంత భూమి సేకరించారు? విడుదల చేసిన జీవోలు.. తదితర వాస్తవాలను అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ముందు ఉంచాలి. పూర్తి వివరాలను బహిరంగపరిచి ఫిర్యాదులు చేసిన వారికి, సందేహాలు వెలిబుచ్చిన వారికి తిరుగులేని సమాధానం చెప్పాలి.


ఆర్డీఎస్‌ తూములను ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు బాంబులు పెట్టి పేల్చడంతో గ్రావిటీ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా తెలంగాణకు రావాల్సిన నీళ్లు రావడంలేదు. ఆర్డీఎస్‌ ఆయకట్టు స్థిరీకరించడానికి ఎంతో వ్యయం చేసి తుమ్మిళ్ల ఎత్తిపోతలను నిర్మించుకోవాల్సి వచ్చింది.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తన నీటి వాటాను అడిగే సందర్భంలో తెలంగాణను పరిగణనలోకి తీసుకోలేదని స్వయంగా ట్రైబ్యునల్‌ గ్రహించి తెలంగాణకు ప్రత్యేకంగా నీటిని కేటాయించింది. నీటి వాటాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని సాక్షాత్తూ బచావత్‌ ట్రైబ్యునల్‌ పేర్కొంది. సమైక్య రాష్ట్రంలో చేపట్టిన జూరాల, నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్‌ లాంటి ప్రాజెక్టులను తెలంగాణ ఏర్పడ్డాక పూర్తి చేసుకోగలిగాం.

 - కేసీఆర్‌



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.