close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
9 నుంచి ఎంసెట్‌

ఆగస్టు 31న ఈసెట్‌...సెప్టెంబరు 2న పాలిసెట్‌
17 నుంచి ఇంటర్‌కు..- 20 నుంచి బడి పిల్లలకు..
డిజిటల్‌ పాఠాలు
17 నుంచి రోజూసగంమంది టీచర్లు విధుల్లోకి
20 నుంచి దోస్త్‌ ద్వారా డిగ్రీ ప్రవేశాలు
విద్యాశాఖ కీలక నిర్ణయాలు
మంత్రి సబితారెడ్డితో అధికారుల సమావేశం
ఈనాడు - హైదరాబాద్‌

పాఠశాలల విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు ఎప్పుడు మొదలవుతాయి?...ఆగిపోయిన ఎంసెట్‌, ఇతర ప్రవేశ పరీక్షలు మళ్లీ జరిగేదెన్నడు?...ఇంటర్‌ ప్రవేశాలకు ఎప్పటి నుంచి శ్రీకారం చుడతారు?.. దోస్త్‌ ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ముహూర్తం ఎప్పుడు?...ఇలాంటి ప్రశ్నలకు ప్రభుత్వం సోమవారం స్పష్టత ఇచ్చింది. విద్యాసంస్థలు ఎప్పటి నుంచి తెరుచుకుంటాయన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వకున్నా డిజిటల్‌ తరగతుల మొదలు, ప్రవేశ పరీక్షల తేదీలు, ప్రవేశాలకు ముహూర్తాలు ఖరారు చేసింది. ఇప్పటివరకు స్తబ్ధంగా ఉన్న విద్యార్థి లోకంలో కదలిక తెచ్చింది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ జలీల్‌, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన సోమవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 4 రోజులపాటు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ సెప్టెంబరు 9, 10, 11, 14 తేదీల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు జరుగుతాయి. అగ్రికల్చర్‌ విభాగం పరీక్షలు ఎప్పుడన్నది ఇంకా ఖరారు చేయలేదు. ఆన్‌లైన్‌ పరీక్షలు కావడం, సెప్టెంబరులోనే నీట్‌ ఉండటం, ఏపీ పరీక్షలు కూడా అదే నెలలో జరుపుతామని అక్కడి ప్రభుత్వం ప్రకటించినందున త్వరలో తేదీలను ఖరారు చేయనున్నారు. ఆగస్టు 31న ఈసెట్‌, సెప్టెంబరు 2వ తేదీన పాలిసెట్‌ జరపాలని నిర్ణయించారు. సెప్టెంబరులోపే దాదాపు అన్ని పరీక్షలు జరిపేలా ప్రయత్నిస్తామని, వీలుకాకుంటే పీఈసెట్‌ (వ్యాయామ విద్య)ను మాత్రం అక్టోబరులో నిర్వహించే అవకాశం ఉందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి చెప్పారు.

6-10 తరగతులకు 20 నుంచి డిజిటల్‌ పాఠాలు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 6-10 తరగతుల విద్యార్థులకు ఈనెల 20 నుంచి టీశాట్‌ ఛానెళ్లు, దూరదర్శన్‌ యాదగిరి ఛానెల్‌ ద్వారా రికార్డు చేసిన పాఠాల ప్రసారాన్ని (డిజిటల్‌ పాఠాలు) ప్రారంభిస్తారు. 3-5 తరగతులకు సెప్టెంబరు 1నుంచి డిజిటల్‌ పాఠాలు మొదలవుతాయి. వీరికి రికార్డు చేసిన పాఠాలు కాకుండా ప్రత్యక్ష (లైవ్‌) పాఠాలను బోధిస్తారు. అంటే ఉపాధ్యాయులు టీవీ స్టూడియోలకు వెళ్లి  తరగతి గదిలో మాదిరిగా బోధిస్తుంటే దాన్ని ప్రసారం చేస్తారు. 1, 2 తరగతులకు పాఠాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. చిన్న పిల్లలైనందున వారికి డిజిటల్‌ పాఠాలు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఏ తరగతికి ఎన్ని గంటలపాటు తరగతులు ఉంటాయన్నది రెండు రోజుల్లో ఖరారు చేస్తారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో జరుగుతున్న ఆన్‌లైన్‌ పాఠాలకు సంబంధించి గరిష్ఠ సమయం, ఇతర నిబంధనలను కూడా త్వరలో జారీ చేయనున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ తరగతులపై ఇచ్చిన మార్గదర్శకాలనే అనుసరించనున్నారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా...విద్యా నాణ్యత తగ్గకుండా అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

17 నుంచి విధుల్లోకి ఉపాధ్యాయులు...
డిజిటల్‌ తరగతులు మొదలవుతున్నందున ఈనెల 17 నుంచి ప్రతిరోజూ సగం మంది ఉపాధ్యాయులు పాఠశాలల విధులకు హాజరుకావాలి. ఒక రోజు సగం మంది మరుసటి రోజు సగం మంది వెళ్లాల్సి ఉంటుంది. వారు విద్యార్థులకు వాట్సప్‌ ద్వారా అసైన్‌మెంట్లు పంపడం, టీసీలు, ఇతర రికార్డులను పూర్తి చేయడం తదితర కార్యక్రమాలను పూర్తి చేయాలి. విద్యార్థుల ఇళ్లలో టీవీలు లేకుంటే పక్కింటికి వెళ్లడం లేదా పాఠశాలలకు వెళ్లి హాజరయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకులు శ్రీహరి, రమణకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్‌ విద్యార్థులకూ 17 నుంచి డిజిటల్‌ పాఠాలు
రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 17 నుంచి డిజిటల్‌ తరగతులు ప్రారంభించనున్నారు. టీవీలతోపాటు యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా పాఠాలను ప్రసారం చేస్తారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలను సెప్టెంబరు 1వ తేదీ తర్వాత చేపట్టాలని నిర్ణయించారు. 12న డిగ్రీ కాలపట్టిక విడుదల డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 20 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలుపెట్టాలని నిర్ణయించారు. ఈనెల 12న పూర్తి కాలపట్టికను విడుదల చేస్తారు.  ఇప్పటివరకు 30 శాతం యాజమాన్య కోటా, 10 శాతం ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) కోటాపై ప్రభుత్వం జీఓ జారీ చేయనందున ఈసారి దోస్త్‌లో అవి అమలవుతాయా అన్నది సందిగ్ధంగా ఉంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.