close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సాటిలేని పైలట్‌ సాథే

విమానాలు నడపడంలో 36 ఏళ్ల అనుభవం

ఈనాడు డిజిటల్‌-హైదరాబాద్‌, ముంబయి: ఓసారి ఆయనను అదృష్టం వరించింది. రెండోసారి మాత్రం కలిసిరాలేదు. మృత్యువుదే పైచేయి అయింది. శుక్రవారం కేరళలోని కొజికోడ్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన పైలట్‌ కెప్టెన్‌ దీపక్‌ సాథే గతంలో ఇలాంటి గండం నుంచి బయటపడ్డారు. తీవ్రగాయాలై, ఆరు నెలలు ఆసుపత్రిలోనే ఉన్నా.. విమానాలు నడపడంపై మక్కువ తగ్గలేదు. మొక్కవోని పట్టుదలతో గాయాలను జయించి, తిరిగి విజయవంతంగా విధుల్లో చేరగలిగారు.

దీపక్‌ గతంలో వైమానిక దళంలో వింగ్‌ కమాండర్‌ హోదాలో పనిచేశారు. వాయుసేనలోని ‘ఫ్లైట్‌ టెస్టింగ్‌ కేంద్రం’లోనూ సేవలందించారు. 1990లలో ఆయన నడుపుతున్న ఒక విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఫలితంగా ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. తలకు బాగా దెబ్బలు తగిలాయి. కదలలేని పరిస్థితుల్లో దాదాపు ఆరు నెలల పాటు ఆసుపత్రిలోనే గడపాల్సి వచ్చింది. పైలట్‌గా ఆయన ప్రస్థానం ఇక ముగిసిపోయినట్టే అని అందరూ అనుకున్నారు. కానీ విమానాలు నడపాలన్న బలమైన కోరిక ఆయనను కోలుకునేలా చేసింది. గట్టిగా సాధన చేసి నిలదొక్కుకున్నారు. అన్ని పరీక్షలు పూర్తిచేసుకొని తిరిగి పైలట్‌గా అర్హత సాధించారు.

హైదరాబాద్‌లోనే తొలి అడుగులు
దీపక్‌ తండ్రి వసంత్‌ సాథే మాజీ సైనికాధికారి. ఆయన స్ఫూర్తితో దీపక్‌ వైమానిక దళంలో చేరారు. 1981లో హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ శిక్షణ కేంద్రంలో 127వ బ్యాచ్‌లో పైలట్‌గా ఓనమాలు దిద్దారు. ఈ కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అప్పటి భారత వాయు సేనాధిపతి చేతుల మీదుగా ‘స్వార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌’ అందుకున్నారు. ఈ బ్యాచ్‌లో ఆయనకు ధీశాలిగా పేరుంది. 2003లో వింగ్‌ కమాండర్‌ హోదాలో వాయుసేన నుంచి వీడ్కోలు తీసుకున్నారు. తర్వాత ఎయిర్‌ ఇండియాలో చేరారు. ఎయిర్‌బస్‌ ఎ-310, బోయింగ్‌ 737-800 విమానాలను నడపడంలో ప్రావీణ్యం సాధించారు. మొత్తం మీద పైలట్‌గా ఆయనకు 36 ఏళ్ల అనుభవం ఉంది.

సైనిక కుటుంబం..
దీపక్‌ ముంబయిలోని చాంద్‌వాలీ ప్రాంతంలో ఉంటున్నారు. ఆయన భార్య పేరు సుష్మ. కుమారులు ధనుంజయ్‌, శాంతను బాంబే ఐఐటీలో చదువుకున్నారు. దీపక్‌ సోదరుడు వికాస్‌ కూడా సైనికాధికారిగా పనిచేశారు. జమ్మూ-కశ్మీర్‌లో పనిచేసేటప్పుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.

తల్లి పుట్టినరోజుకు రావాలనుకున్నా..
ముందుగా చెప్పకుండా శనివారం నాడు మాతృమూర్తి 84వ జన్మదినోత్సవానికి ఆకస్మికంగా హాజరై, అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాలని దీపక్‌ అనుకున్నారు. కానీ ఈ లోకాన్నే వీడి.. అôదరినీ విషాదంలో ముంచేశారు. దీపక్‌ తల్లి నీలా సాథే, తండ్రి వసంత్‌ సాథేలు నాగ్‌పుర్‌లో ఉంటున్నారు. చదువులోనూ, అటల్లోనూ తమ కుమారుడు ప్రతిభావంతుడని వారు గుర్తుచేసుకున్నారు. వాయుసేనలోని మొత్తం 8 బహుమతులు పొందిన తొలి మహారాష్ట్రవాసి అని చెప్పారు.

అత్యంత అనుభవజ్ఞుడు: కేంద్ర మంత్రి
దీపక్‌ సాథే అత్యంత అనుభవజ్ఞుడని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరి పేర్కొన్నారు. ఆయనకు 10వేల గంటలకుపైగా విమానాలు నడిపిన అనుభవం ఉందన్నారు. కొజికోడ్‌ విమానాశ్రయంలో 27 సార్లు ల్యాండింగ్‌ నిర్వహించారని చెప్పారు.


నాడు ఘన స్వాగతం.. నేడు పెను శోకం!

మే 8 2020: వందే భారత్‌ మిషన్‌ కింద ‘ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌’ నడిపిన తొలి విమాన సర్వీసు దుబాయ్‌ నుంచి కొజికోడ్‌ వచ్చింది. ఆ విమాన పైలట్లలో 32 ఏళ్ల అఖిలేశ్‌ కుమార్‌ కూడా ఉన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ధైర్యంగా ముందుకొచ్చిన ఆయనకు నాడు ఇక్కడ కరతాళ ధ్వనుల మధ్య ఘన స్వాగతం లభించింది.
ఆగస్టు 7 2020: ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం మళ్లీ కొజికోడ్‌లో దిగింది. ఈ విమానంలోనూ అఖిలేశ్‌ ఉన్నారు. అయితే ఈ లోహ విహంగం ప్రమాదానికి లోనైంది. విగతజీవుడై అఖిలేశ్‌ బయటకు వచ్చారు. మూడు నెలల కిందట ఘన స్వాగతం అందుకున్న చోట ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంటివద్ద.. నిండు గర్భిణి అయిన భార్య మేఘ ఈ దుర్వార్తను విని హతాశురాలయ్యారు. కొజికోడ్‌లో శుక్రవారం ప్రమాదానికి లోనైన విమానానికి అఖిలేశ్‌ కో పైలట్‌గా వ్యవహరించారు. ఆయన స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర. 2017లో ఆయన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ‘ఫస్ట్‌ ఆఫీసర్‌’గా చేరారు.


ఐదుగురిని కాపాడిన వాలంటీర్‌

మలప్పురం: దుబాయ్‌ నుంచి భారతీయులను కేరళకు తీసుకొస్తూ ఎయిర్‌ ఇండియా విమానం ప్రమాదానికి గురైన ఘటనలో... ఓ వాలంటీర్‌ ఐదుగురి ప్రాణాలను కాపాడారు. శుక్రవారం కొజికోడ్‌లో ఈ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. తాలూకా విపత్తు స్పందనా దళం(టీడీఆర్‌ఎఫ్‌) వలంటీరు ఆసిఫ్‌ కొండోటి... ప్రమాదం గురించి తెలుసుకుని పది నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వచ్చీ రావడంతోనే ఐదుగురు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు.


హమ్మయ్య.. మావాళ్లు సురక్షితం!

దుబాయ్‌లో సిలికాన్‌ ఒయాసిస్‌లో లాజిస్టిక్స్‌ మేనేజర్‌గా పనిచేసే 41 ఏళ్ల షమీర్‌ వడక్కన్‌ పథప్పిరియమ్‌ది మరో విచిత్ర పరిస్థితి. శుక్రవారం రాత్రి కోజికోడ్‌లో ప్రమాదానికి గురైన విమానంలో షమీర్‌ కుటుంబం, ఆయన సోదరుడి కుటుంబం మొత్తం ఏడుగురు సభ్యులు బయలుదేరారు. అనంతరం విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలియడంతో ఆయనకు గుండె ఒక్కసారిగా రెట్టింపు స్థాయిలో కొట్టుకోవడం మొదలైంది. టీవీ తెరలపై కనిపించే ప్రతి సహాయ కేంద్రానికి ఫోన్‌ చేసినా సమాచారం దొరకలేదు. అలా కొన్ని ప్రయత్నాల తర్వాత భార్యతో మాట్లాడగా.. అంతా సురక్షితంగా ఉన్నట్లు ఆమె చెప్పడంతో తేలికపడ్డానని షమీర్‌ చెప్పారు.


ప్రాణాలు నిలబెట్టిన ‘జరిమానా’!

దుబాయ్‌: కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నట్లు జరగకపోయినా.. ఆ తర్వాత ఆ సంఘటన కారణంగా మనకు మేలే జరుగుతుంది. దుబాయ్‌లో ఉండే నౌఫల్‌ మొయిన్‌ వెట్టెన్‌, అఫ్సాల్‌ పర్రకోడన్‌లకు ఇదే జరిగింది. కేరళకు చెందిన వీరు శుక్రవారం దుబాయ్‌ నుంచి బయలుదేరి కేరళలోని కొజికోడ్‌ రావాల్సి ఉంది. ఈ మేరకు ఎయిర్‌ ఇండియా  విమానంలో ప్రయాణించేందుకు టికెట్లు సైతం సిద్ధంచేసుకుని విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడే వీరి వీసా రద్దు అయినప్పటికీ కొన్ని రోజులు దుబాయ్‌లో ఉన్నందున వెయ్యి దిర్హమ్‌లు (సుమారు రూ.20,430) చెల్లించాల్సిందిగా ఆ దేశ వలసల విభాగం అధికారులు కోరారు. ఇద్దరి దగ్గరా అంత డబ్బులు లేకపోవడంతో అక్కడే ఆగిపోయారు.


దశాబ్దం క్రితం... ఘోర ప్రమాదం...
మంగళూరు విమానాశ్రయంలో లోయలోపడి దగ్ధమైన లోహ విహంగం

అది 2010 మే 22వ తేదీ... దుబాయి నుంచి వచ్చిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం... కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో రన్‌వేను దాటిపోయి లోయలోకి పడిపోయింది. ఆ వెంటనే మంటల్లో చిక్కుకుని దగ్ధమైపోయింది. ఆరుగురు సిబ్బంది సహా 158 మంది మృతిచెందారు. ఎనిమిది మంది మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. శుక్రవారం కొజికోడ్‌లో జరిగిన ప్రమాదానికి దీనికి చాలా వరకు పోలికలున్నాయి. రెండు ప్రమాదాల్లోనూ విమానాలు టేబుల్‌టాప్‌ రన్‌వే దాటిపోయాయి. రెండు విమానాలూ ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందినవే కావటంతో పాటు దుబాయి నుంచే ప్రయాణికులను తీసుకురావటం గమనార్హం. అయితే, కొజికోడ్‌ ఘటనలో మంటలు వ్యాపించకపోవటంతో చాలా మంది ప్రాణాలతో బయటపడగలిగారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.