close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సచివాలయం కూల్చివేత.. ఆపండి

  13వ తేదీ వరకూ నిలిపివేయండి
  నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆధారాలు
  జీహెచ్‌ఎంసీ అనుమతి తీసుకున్నారా?
  పత్రాలు సహా వివరాలివ్వండి: హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రప్రభుత్వం నూతన సచివాలయాన్ని నిర్మించనున్న క్రమంలో చేపట్టిన పాత భవనాల కూల్చివేత పనులకు తాత్కాలిక బ్రేక్‌ పడింది. ఈనెల 13వ తేదీ(సోమవారం) వరకు కూల్చివేత పనులను చేపట్టరాదంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పనుల్లో నిబంధనలను పాటించలేదని ప్రాథమిక ఆధారాలను బట్టి వెల్లడవుతోందని పేర్కొంది. కూల్చివేతకు ముందుగా జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించింది. వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన ప్రణాళికను సమర్పించారో లేదో చెప్పాలంది. ఈ వివరాలను సోమవారంలోగా సమర్పించాలని ఆదేశించింది. 7 లక్షల చదరపు అడుగులతో కొత్త సచివాలయాన్ని నిర్మించడంలో భాగంగా 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న 10 బ్లాకులను నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు, డాక్టర్‌ చెరుకు సుధాకర్‌లు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ హుస్సేన్‌సాగర్‌ సమీపంలోని ఈ నిర్మాణం కూల్చివేతను ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా 4 రోజుల క్రితం ప్రారంభించిందని తెలిపారు.కాలుష్య నియంత్రణ మండలి అనుమతులను తీసుకోలేదన్నారు. కరోనా సమయంలో అత్యవసరంగా చేపట్టాల్సిన అవసరంలేదని, ఇది అంటువ్యాధుల నిరోధక చట్టం, విపత్తుల నిర్వహణ చట్టం, కేంద్ర పర్యావరణ చట్టాలకు విరుద్ధమన్నారు. సచివాలయం పరిసరాల్లో ఉన్న ప్రజలు కాలుష్యం బారిన పడుతున్నారన్నారు. అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ కూల్చివేతకు సంబంధించిన సమాచారం అందాల్సి ఉందని, విచారణను శనివారానికి వాయిదా వేయాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రస్తుత వ్యవహారం అస్పష్టంగా ఉందని, ఏదైనా ప్రణాళిక సమర్పించారా, అనుమతులు తీసుకున్నారా అన్న వివరాల్లేవంది. నిర్మాణాలు, కూల్చివేత వ్యర్థ నిర్వహణ నిబంధనలు 2016లోని 4(3)ను ఉల్లంఘించినట్లుగా ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొంది. ఈ పనులకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న అనుమతులపై కోర్టు సంతృప్తి చెందాల్సి ఉందని పేర్కొంది. పత్రికల కథనాల ప్రకారం 7 రోజుల్లో కూల్చివేత పనులు పూర్తవుతాయని, ఇప్పటికే 3 రోజులు పూర్తయ్యాయని, ఎ, బి బ్లాక్‌లు ఇప్పటికే కూలిపోయాయని, అందులోని కొన్ని మతపరమైన నిర్మాణాలను ధ్వంసం చేశారని వ్యాఖ్యానించింది. మరో 4 రోజుల్లో మొత్తం సచివాలయం కూల్చివేత పూర్తవుతుందని, అందువల్ల ఆ పనులను నిలిపివేయాలంటూ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశిస్తూ విచారణను 13వ తేదీకి వాయిదా వేసింది.
సచివాలయం కూల్చివేతలు ఆపండి.. చెరుకు సుధాకర్‌: రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తూ.. తక్షణమే సచివాలయం కూల్చివేత పనులను నిలిపివేయాలని తెలంగాణ ఇంటి పార్టీ (టీఐపీ) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. శుక్రవారం ఆదర్శ్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ మాట్లాడారు. దశాబ్దాల కాలంనాటి సచివాలయ భవనాలను వినియోగించకుండా ప్రజాధనాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ కూల్చివేతలకు పాల్పడుతోందన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.