close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సహకార బ్యాంకులకు రూ.800 కోట్లు

కొవిడ్‌ సంక్షోభంలో ప్రత్యేకంగా సమకూర్చాం
కొత్త డీసీసీబీల ఏర్పాటుకు ప్రతిపాదనలు లేవు
కౌలురైతుల సంఘాలకు రుణాలివ్వడానికి నిధులిస్తాం
‘ఈనాడు’ ఇంటర్య్వూలో నాబార్డు రాష్ట్ర సీజీఎం
యడ్ల కృష్ణారావు

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘కొవిడ్‌ సంక్షోభంలో రైతులకు సాయపడటానికి సహకార బ్యాంకులకు ప్రత్యేకంగా రూ.800 కోట్ల నగదును గత 3 నెలల్లో విడుదల చేశాం. సహకార బ్యాంకుల నుంచి పంటరుణాల పంపిణీ పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం’’ అని నాబార్డు రాష్ట్ర ప్రధాన జనరల్‌ మేనేజర్‌(సీజీఎం) యడ్ల కృష్ణారావు చెప్పారు. జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డు) తెలంగాణ రాష్ట్ర అధిపతి హోదాలో ఈ నెల ఒకటిన ఆయన బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో వ్యవసాయ, గ్రామీణరంగాల అభివృద్ధికి నాబార్డు ఇచ్చే నిధులు, రుణాలు అత్యంత కీలకం. తెలుగు వ్యక్తి రాష్ట్ర సీజీఎంగా చేరడం వల్ల తెలంగాణకు నాబార్డు నుంచి మరింత సహకారం అందుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ నెల 12న నాబార్డు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో చేపడుతున్న పథకాలు, ఇస్తున్న రుణాలపై ఆయన ‘ఈనాడు’ ఇంటర్య్వూలో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు..
సహకార బ్యాంకుల నుంచి రైతులకు పంటరుణాల పంపిణీ ఎందుకు  పెరగడం లేదు
రుణాల పంపిణీ పెరగడం లేదన్నది కొంతవరకూ నిజమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న ‘పీఎం-కిసాన్‌’, ‘రైతుబంధు’ పథకాల వల్ల ఈ రుణాల పంపిణీ కొంత తగ్గింది. కానీ సహకార రుణాలను పెంచడానికి చాలా అవకాశముంది. కొవిడ్‌ సంక్షోభంలో రైతులకు సాయం చేయడానికి రాష్ట్ర సహకార బ్యాంకులకు రూ.800 కోట్లను నాబార్డు సమకూర్చింది. గత రెండేళ్లలో కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లకు రూ.750 కోట్లు నేరుగా ఇచ్చాం. అవన్నీ రైతులకు రుణాలుగా ఇచ్చినవే.
అర్బన్‌ సహకార బ్యాంకులను రిజర్వుబ్యాంకు పరిధిలోకి మార్చడం వల్ల ప్రయోజనమేంటి
రిజర్వుబ్యాంకు పర్యవేక్షణతో అర్బన్‌ బ్యాంకుల పాలన, అంతర్గత తనిఖీలు, నియంత్రణ మెరుగవుతుంది. వినియోగదారులకు రుణాల పంపిణీ పారదర్శకంగా జరిగి స్థానిక ఆర్థికవ్యవస్థ బలోపేతానికి ఉపయోగపడుతుంది. వినియోగదారుల్లో వాటిపై నమ్మకం పెరుగుతుంది.
ఎఫ్‌పీఓల సంఖ్య, సామర్థ్యం పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు
రైతుల అవసరాల ఆసరాగా వారిని ఎఫ్‌పీఓగా కలిపి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నాం. నాబార్డు తరఫున తెలంగాణలో 45 ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. వీటికి రుణాలిప్పించేందుకు బ్యాంకులతో తరచూ సమీక్షిస్తున్నాం.
పాడి పరిశ్రమ అభివృద్ధికి రైతులకేం చేస్తున్నారు
పాడి రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు(కేసీసీ)లు ఇవ్వాలని అన్ని బ్యాంకులకు నాబార్డు సూచించింది. వాటి ఆధారంగా    ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నాం. గత సంవత్సరం (2019-20)లో పాడి పరిశ్రమ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి నుంచి మూడు డెయిరీలకు 156 కోట్ల రూపాయలు ఇచ్చాం.
తెలంగాణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయా
రాష్ట్రంలో పామాయిల్‌ ఉత్పత్తి పెంచడానికి ఆయిల్‌పాం తోటల సాగును ప్రోత్సహిస్తున్నాం. ఇప్పటికే 6.74 లక్షల హెక్టార్ల భూమిని సాగుకు అనుకూలమని గుర్తించాం. ఇందులో 50 వేల హెక్టార్లలో ఈ పంట సాగు మొదలైంది.  బిందు, తుంపర సేద్యం కోసం ప్రత్యేకంగా రాష్ట్రానికి రూ.874 కోట్ల రుణం ఇవ్వడం వల్ల 1.56 లక్షల మంది రైతులకు రాయితీలందాయి.
ప్యాక్స్‌కు నాబార్డు ప్రత్యేక సాయం చేస్తుందా
రైతులకు పంటరుణాలివ్వడానికి తక్కువ వడ్డీలకు ప్యాక్స్‌కు నిధులిస్తున్నాం. గతేడాది(2019-20) స్వల్పకాలిక రుణాల కోసం రూ.3088 కోట్లు, దీర్ఘకాలిక రుణాల కోసం రూ.569.30 కోట్లు సహకార బ్యాంకులకు విడుదల చేశాం. ఇతర వ్యాపార కార్యకలాపాలకు 13 సంచార వాహనాలు, 1147 సూక్ష్మ ఏటీఎంలు ఏర్పాటు చేశాం. ప్యాక్స్‌లో మౌలిక సదుపాయాల వృద్ధికి రూ.132 లక్షలిచ్చాం.
డీసీసీబీల్లో అవినీతి నిరోధానికి నాబార్డు ఏం చేస్తోంది
తరచూ వ్యవసాయ సహకార సంఘాల(ప్యాక్స్‌)ను తనిఖీలు చేస్తూ అవినీతి నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం.   బ్యాంకుల సిబ్బందికి అవినీతి నివారణపై అవగాహన కల్పిస్తున్నాం.

నాబార్డులో రాష్ట్ర రైతులకు ఉపయోగపడే పథకాలేమున్నాయి
రైతు ఉత్పత్తిదారుల సంఘాల(ఎఫ్‌పీఓ) ఏర్పాటు. సహజ వనరుల సంరక్షణకు వాటర్‌షెడ్ల నిర్మాణం. గిరిజన జీవనోపాధికి సహాయనిధి. వ్యవసాయ పరిశోధనా సంస్థల నుంచి రైతులకు ఆధునాతన పరిజ్ఞానం అందించడం. రైతుల ఆదాయం, పంటల ఉత్పాదకత పెంపునకు సహాయం చేయడం తదితర పథకాలను నాబార్డు అమలు చేస్తోంది.

కౌలురైతులతో ‘సంయుక్త భాగస్వామ్య సంఘాలు’(జేఎల్‌జీ) ఏర్పాటు చేయిస్తున్నాం. ఇప్పటికే ఎస్‌బీఐ సహా పలు ఇతర బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని 3 వేల జేఎల్‌జీలు స్థాపించాం. వాటికిచ్చే రుణాలకు నిధులిస్తున్నాం.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.