close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కేసులు దాస్తున్నామనేది అసంబద్ధ ఆరోపణ

ప్రతిపక్షాల తీరుని తప్పుబట్టిన మంత్రి కేటీఆర్‌
లాక్‌డౌన్‌ పెట్టే పరిస్థితి  రాష్ట్రంలో లేదని వెల్లడి

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: కరోనా కేసుల విషయంలో వాస్తవాలు చెప్పకుండా దాచిపెడుతున్నామనేది ప్రతిపక్షాలు చేస్తున్న అసంబద్ధ ఆరోపణ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. భవిష్యత్తు తరాలకు మేలు చేసేలా ఆరోగ్య తెలంగాణను సాధించడమే మనందరి లక్ష్యమవ్వాలని పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్టులో నిర్వహించిన హరితహారం, కరీంనగర్‌లోని ప్రతిమ వైద్య కళాశాలలో నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడారు. జీవితంతో పాటు జీవనోపాధి కూడా ముఖ్యమని, అన్ని రంగాలపై కరోనా ప్రభావం పడిందని, ఎవరి శక్తిమేరకు వారు పనిచేస్తున్నారని, లాక్‌డౌన్‌ పెట్టే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. జాగ్రత్తగా ఉండాలని.. ఇటీవల ఓ కార్యక్రమంలో ఉపసభాపతి పద్మారావును మాస్క్‌ పెట్టుకోవాలని తాను సూచించినా ఏమీ కాదన్నారని, ఇప్పుడు ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులకూ కరోనా వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ప్రతిపక్షాల తీరు బాధాకరం
కొన్ని రోజులుగా కేసీఆర్‌ విఫలమయ్యారని, రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని నోటికొచ్చినట్లు ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే బాధేస్తుందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాజకీయాలు చేయడానికి సరైన సమయం కాదని వారి తీరును తప్పుబట్టారు. ప్రభుత్వ వైద్యుల కష్టాల్ని చూపించాలని, ఎక్కడో ఉన్న ఒకటి రెండు లోపాల్ని పదే పదే రాయడం, చూపించడం మీడియాకు సరైంది కాదంటూ ఈ తీరు మారాలని కేటీఆర్‌ ఆకాంక్షించారు. కరోనాకు మందు, వ్యాక్సిన్‌ వచ్చాక రాజకీయాలు చేసుకుందామని, అవసరమైతే కుస్తీ పడదామని ప్రతిపక్షాలకు స్పష్టం చేశారు. అప్పటి వరకు ప్రభుత్వానికి అండగా నిలబడుతూ విజ్ఞతతో వ్యవహరించాలని మంత్రి హితవు పలికారు.

కొత్త ఆవిష్కరణలు రావాలి..
ఇటీవల తాను ఓ చైనీస్‌ న్యూస్‌పేపర్‌ యజమాని పెట్టిన ట్వీట్ చూశానని, భారత్‌ చైనాకు చెందిన యాప్‌లపై నిషేధం విధించిందని, కానీ అదే భారత్‌పై తాము ఇదే తరహాలో నిషేధాన్ని పెట్టాలని చూస్తే వారు తయారు చేసిన ఒక్క యాప్‌ కూడా కనిపించలేదని ఆయన విమర్శించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అందుకే ఇతర దేశాలపై ఆధారపడకుండా ఇక్కడా కొంగొత్త ఆవిష్కరణలు, ఆలోచనలు పుట్టుకురావాలని ఆకాంక్షించారు. కరోనాకు టీకా హైదరాబాద్‌ నుంచే రావాలనే ఆకాంక్షను మంత్రి తెలియజేశారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. ఐసీఎంఆర్‌ సూచిస్తున్న మార్గదర్శకాలను ఏ మాత్రం తప్పకుండా రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. అంతకుముందు ప్రతిమ వైద్యకళాశాల ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించేందుకు ఏర్పాటు చేసిన సంచార ఆరోగ్యరథాన్ని, వర్చువల్‌ ఆరోగ్య కేంద్రాల్ని మంత్రులు ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.