close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎస్‌ఈసీ కేసులో స్టే నిరాకరణ

పిటిషన్‌పై త్వరలో తేల్చేస్తాం
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ

ఈ కేసులో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వం. గవర్నర్‌కు కూడా ఆదేశాలు ఇవ్వాలని అనుకోవడం లేదు. రెండు మూడు వారాల్లో పిటిషన్‌పై విచారణ ముగిస్తాం - సుప్రీంకోర్టు
ఈనాడు, దిల్లీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) పునర్నియామకంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో స్టే ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని మరోమారు తోసిపుచ్చింది. విచారణను త్వరలోనే ముగిస్తామని స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను పునర్నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వంతోపాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం, కాంగ్రెస్‌ నేత మస్తాన్‌ వలి, తెదేపా నేత వర్ల రామయ్య, ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, భాజపా తెలంగాణ నేత అట్లూరి రామకృష్ణ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను కలిపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది రాకేశ్‌ ద్వివేది వాదనలు వినిపిస్తూ.. ‘హైకోర్టు పరస్పర విరుద్ధమైన తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించే అధికారం మంత్రివర్గానికి లేదని తీర్పులో చెప్పింది. కానీ ఇదివరకు కమిషనర్‌ కూడా కేబినెట్‌ ఆమోదంతోనే నియమితులయ్యారు కాబట్టి ఆయన కూడా పదవిలో ఉండకూడదు. హైకోర్టు ఆదేశాల వల్ల ఎన్నికల సంఘం అధికారులు కూడా విధులు నిర్వర్తించలేకపోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కార్యకలాపాలు కష్టమవుతున్నాయి. అందువల్ల వేరొకరిని ఎస్‌ఈసీగా నియమించేలా గవర్నర్‌కు సూచిస్తూ మధ్యంతర ఉత్తర్వువ్వాలి’ అని కోరారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే స్పందిస్తూ ‘అది సమస్య మూలాల్లోకి వెళ్తుంది. ఇప్పుడు మేం ఆ అంశాల జోలికి వెళ్లడం లేదు. ఎన్నికలు ఎప్పుడైనా నిర్వహించాల్సిందే. అది భిన్నమైన అంశం. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే ప్రసక్తి లేదు. గవర్నర్‌కు ఎలాంటి సూచనలు చేయబోం. ఎన్నికల నిర్వహణపైనా మాట్లాడదలచుకోలేదు’ అని పేర్కొన్నారు. ఎస్‌ఈసీ నియామకానికి సంబంధించి కమిటీ వేయాలని మరో సీనియర్‌ న్యాయవాది త్రిపాఠి కోరారు. మధ్యంతర ఆదేశాలు ఇవ్వబోమని చెప్పినా ఇలాంటి ఆదేశాలు ఎందుకు కోరతారని సీజే ప్రశ్నించారు. ఎన్నికల సంఘం దాఖలు చేసిన ప్రతులు ఇంకా అందలేదని, కౌంటరు దాఖలుకు మరికొంత సమయం కావాలని నిమ్మగడ్డ తరఫున న్యాయవాదులు కోర్టును లిఖితపూర్వకంగా కోరారు. దీంతో విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నామని.. అన్ని ప్లీడింగ్స్‌ కాలపరిమితిలోగా పూర్తి చేయాలని కక్షిదారులందరికీ ఆదేశాలిస్తున్నట్లు ధర్మాసనం లిఖితపూర్వక ఉత్తర్వులిచ్చింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.