close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తెలంగాణ చరిత్రలో ఇది చీకటి రోజు

సచివాలయం కూల్చివేతపై  పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
న్యూస్‌టుడే యంత్రాంగం

పాత సచివాలయం కూల్చివేత ఘటన తెలంగాణ చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుందని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూఢ నమ్మకానికి నాలుగు కోట్ల ప్రజలను పణంగా పెట్టారని విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి నిధులు లేవు కానీ..రూ.500 కోట్లతో కొత్త సచివాలయ నిర్మాణం అవసరమా? అని నిలదీశారు. కాంగ్రెస్‌ నేతలు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, షబ్బీర్‌అలీ, సంపత్‌కుమార్‌, బలరాంనాయక్‌ తదితరులతో కలిసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టులో విచారణ లోపే కూల్చివేయాలని భావించే ఆగమేఘాల మీద పాత సచివాలయాన్ని కూల్చివేస్తున్నారని ఆరోపించారు.
కూల్చివేత దుర్మార్గం: రేవంత్‌
ప్రస్తుత పరిస్థితుల్లో పాత సచివాలయం కూల్చివేత దుర్మార్గం అని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్థలంలో కొత్త సచివాలయం కట్టడానికి ఎన్జీటీ చట్టం అనుమతించదన్నారు.
తుగ్లక్‌ చర్య: కోమటిరెడ్డి, పొన్నాల
సచివాలయం కూల్చడం తుగ్లక్‌ చర్య అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యలు వేర్వేరు ప్రకటనల్లో విమర్శించారు. కరోనాతో ప్రజలు చనిపోతుంటే కేసీఆర్‌ చేతులెత్తేశారని, పరిస్థితిని చక్కదిద్దకుండా వ్యవసాయ క్షేత్రానికి పరిమితమయ్యారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్‌ చేశారు. రోడ్లను దిగ్బంధించి పాత సచివాలయం కూల్చడం, నాయకులను గృహ నిర్బంధంలో పెట్టడం కేసీఆర్‌ నిరంకుశ పాలనకు నిదర్శనమని అన్నారు.
బాధ్యతారాహిత్యం: రమణ
సచివాలయం భవనాలు కూల్చి కొత్తవి నిర్మించడం అత్యంత బాధ్యతారాహిత్యమని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాకు వీడియో సందేశం పంపారు. ‘‘ప్రస్తుత కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో పాత సచివాలయ భవనాలను ఆసుపత్రులుగా వాడుకునేందుకు అవకాశం ఉండేది. కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చాక కొత్త సచివాలయం నిర్మిస్తే బాగుండేది.  గత జీహెచ్‌ఎంసీ ఎన్నికలప్పుడు హైదరాబాద్‌కు నలువైపులా 4 వెయ్యి పడకల ఆసుపత్రులను  నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. వాటిని నిర్మించకుండా సచివాలయం కూల్చడం తగదు’’ అని రమణ అన్నారు.
కీర్తి ప్రతిష్ఠల కోసమే: కోదండరాం
పాత సచివాలయం కూల్చివేతను తీవ్రంగా ఖండిస్తున్నామని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలంతా కరోనాతో ఆందోళనతో ఉంటే వారికి సరైన వైద్యం అందించాల్సిన సమయంలో కొత్త సచివాలయం నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం దుర్మార్గమని అన్నారు. కీర్తి ప్రతిష్ఠల కోసమే ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి కేసీఆర్‌ సిద్ధమయ్యారని కోదండరాం విమర్శించారు.
మూఢనమ్మకాలతోనే..: తమ్మినేని
ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి మూఢ నమ్మకాలతో పాత సచివాలయాన్ని కూల్చివేయడాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో తెలిపారు. పాత సచివాలయం భవనాన్ని కరోనా సహాయక చర్యలకు వినియోగించాలని సూచించారు.
మూర్ఖపు చర్య: చాడ వెంకట్‌రెడ్డి
మరో వందేళ్లపాటు సేవలందించే సామర్థ్యం కలిగిన తెలంగాణ సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూర్ఖంగా కూల్చివేయిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి దుయ్యబట్టారు. సచివాలయ ప్రాంగణంలో 10, 15 ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలూ ఉన్నాయన్నారు. కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే, వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం సచివాలయం కూల్చివేతలో తలమునకలు కావడం శోచనీయమన్నారు.  కరోనాను ఆరోగ్యశ్రీ కింద చేర్చాలన్నారు.
ప్రజాభిప్రాయానికి విరుద్ధం: చెరుకు
ప్రజాభిప్రాయానికి భిన్నంగా పాత సచివాలయాన్ని కూల్చివేయడం ముఖ్యమంత్రి కేసీఆర్‌  అహంకారానికి నిదర్శనమని తెలంగాణ ఇంటి పార్టీ తీవ్రంగా విమర్శించింది. రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని గంగలో కలిపిన జులై 7ను చీకటి రోజుగా భావిస్తున్నామని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ అన్నారు.


ఇబ్బందుల్లో కూల్చివేతలా?: బట్టి

ప్రజలు మహమ్మారితో ఇబ్బందుల్లో ఉంటే సందట్లో సడేమియా అన్నట్లు ఆగమేఘాల మీద సచివాలయాన్ని కూల్చి నూతన సచివాలయం ఏర్పాటుకు సన్నాహాలు చేయటం దుర్మార్గమైన చర్య అని  సీఎల్పీ నేత బట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్ర సంపదను ధ్వంసం చేస్తే కేసీఆర్‌ను ప్రజలు క్షమించరని అన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు రాజ్‌భవన్‌లో సహాయకేంద్రం(హెల్ప్‌లైన్‌) ఏర్పాటు చేయాలని టీపీసీసీ కొవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి ఒక ప్రకటనలో గవర్నర్‌ తమిళిసైని కోరారు.


దారుస్సలాంలో రూపొందించినట్లుంది: ఎమ్మెల్యే రాజాసింగ్‌

గోషామహల్‌, న్యూస్‌టుడే: కొత్తగా నిర్మించనున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవన నమూనాను దారుస్సలాంలోని ఎంఐఎం కార్యాలయంలో రూపొందించినట్లు అనుమానం కలుగుతోందని భాజపా పక్ష నేత, ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం విడుదల చేసిన సచివాలయ నమూనా  హజ్‌భవన్‌లా కనిపిస్తోందని విమర్శించారు. ఈమేరకు సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తూ.. ఓ వీడియోను మంగళవారం ఆయన విడుదల చేశారు. అందరి ఆమోదంతో సరికొత్త నమూనా తయారు చేయాలని డిమాండ్‌ చేశారు.


ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.