close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పాత సచివాలయం కూల్చివేత మొదలు

15 రోజులు పడుతుందని అంచనా
ట్రాఫిక్‌కు భారీగా అంతరాయం

ఈనాడు, హైదరాబాద్‌: సుదీర్ఘ చరిత్ర కలిగిన సచివాలయం కూల్చివేత పనులు మొదలయ్యాయి. కట్టుదిట్టమైన భద్రత నడుమ మంగళవారం తెల్లవారుజామున పొక్లెయిన్లతో ఈ పనులు చేపట్టారు. కొత్త నిర్మాణాలకు వీలుగా 25.5 ఎకరాల ప్రాంగణాన్ని సిద్ధం చేసేందుకు సుమారు 12 నుంచి 15 రోజుల వరకు పడుతుందని అధికారుల ప్రాథమిక అంచనా. వాస్తు దోషాలను చక్కదిద్దేందుకు ఆ ప్రాంగణాన్ని చతురస్రాకారంగా తయారు చేసేందుకు వీలుగా మింట్‌ కాంపౌండ్‌ వైపు కొంత స్థలాన్ని, సచివాలయం ప్రధాన గేటు వైపు ఉన్న విద్యుత్తుశాఖ రాతి భవనాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం సచివాలయంలోని భవనాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పరిపాలనా వ్యవహారాలు క్రమంగా అమరావతికి తరలిపోయినా ఆ భవనాలు మాత్రం కొన్నాళ్లు ఏపీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డితో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చర్చల సందర్భంలో ఆ భవనాల విషయం ప్రస్తావనకు రాగా, వాటిని తెలంగాణను అప్పగించేందుకు అవగాహన కుదిరింది. అసెంబ్లీకి, సచివాలయానికి కొత్త భవనాలు నిర్మించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పం. భవనాల అప్పగింత పూర్తవడంతో మార్గం సుగమమైంది. గత ఏడాది జూన్‌లో కొత్త భవనాలకు శంకుస్థాపన కూడా పూర్తయింది. అయితే ఈ కూల్చివేతలపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. శాసనసభ నిర్మాణంపై న్యాయస్థానం స్టే ఇచ్చినప్పటికీ సచివాలయం విషయంలో కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. భవనాల కూల్చివేతకు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టటానికేమీ లేదని తాజాగా హైకోర్టు వ్యాఖ్యానించటంతో కూల్చివేతలకు పచ్చజెండా ఊపినట్లు అయింది.

సీఎంతో భేటీ తర్వాత నిర్ణయం
ఫామ్‌హౌస్‌లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమావేశం తరవాత కూల్చివేతకు నిర్ణయించారు. అక్కడి నుంచి వచ్చిన అధికారులు నగర పోలీసు అధికారులతో సమావేశమై సచివాలయానికి వెళ్లే అన్ని మార్గాలను మూసివేయాలని నిర్ణయించి అర్ధరాత్రి తర్వాత అమలు చేశారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో కూల్చివేత యంత్రాలు సచివాలయంలోకి ప్రవేశించాయి. కూల్చివేత నేపథ్యంలో ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌, లకడీ-కా-పూల్‌ నుంచి సచివాలయానికి వెళ్లే మార్గం, రవీంద్రభారతి నుంచి ఆర్బీఐ వైపు, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, ట్యాంక్‌బండ్‌, హిమాయత్‌నగర్‌ నుంచి సచివాలయం వైపు వచ్చే అన్ని మార్గాలను పోలీసులు దిగ్బంధించారు. భారీగా పోలీసులను మోహరించారు. ముందుగా సమాచారం లేకపోవటంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కొంతమంది ఉద్యోగులు కార్యాలయాలకు చేరుకోలేకపోయారు. హోం సైన్స్‌ కళాశాలకు సెలవు ప్రకటించారు. ఆంక్షలు మరో రెండు రోజులపాటు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


కూల్చివేతకు నాలుగైదు రోజులు

సచివాలయంలో ఉన్న పది బ్లాకుల కూల్చివేతకు నాలుగైదు రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత నిర్మాణ వ్యర్థాలు ఎంత మేరకు వస్తాయి? ఎక్కడ వేయాలి? అనేదానిపై దృష్టి పెడతారు. ఎంత మొత్తంలో వ్యర్థాలు వస్తాయన్నది ఇంకా అంచనా వేయలేదని రహదారులు-భవనాల శాఖ ఇంజినీర్‌-ఇన్‌-చీఫ్‌ ఐ.గణపతిరెడ్డి ‘ఈనాడు’తో చెప్పారు. వాటిని తొలగించేందుకు ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేమని వివరించారు.


 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.