close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
25 వేలు దాటిన కొవిడ్‌ కేసులు

 కొత్తగా 1831 నమోదు
 జీహెచ్‌ఎంసీలోనే 1419
 మరో 11 మరణాలు
 306కి చేరిన మహమ్మారి మృతులు

ఈనాడు- హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. సోమవారం కొత్తగా 1831 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కొవిడ్‌ బాధితుల సంఖ్య 25,733కు పెరిగింది. తాజా ఫలితాల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్‌) పరిధిలోనే 1419 కేసులు నిర్ధారించారు. తర్వాత అధికంగా రంగారెడ్డిలో 160, మేడ్చల్‌ 117, మెదక్‌ 20, మంచిర్యాల 20, ఖమ్మంలో 21 కేసులు గుర్తించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో, ఐసోలేషన్‌లో 10,646 మంది చికిత్స పొందుతుండగా, తాజాగా మరో 2078 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తంగా రాష్ట్రంలో ఆరోగ్యవంతులైన వారి సంఖ్య 14,781కు చేరింది. మహమ్మారి బారినపడి సోమవారం మరో 11 మంది మృత్యువాత పడగా, మొత్తంగా రాష్ట్రంలో మరణాల సంఖ్య 306కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 6383 నమూనాలను పరీక్షించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ చేపట్టిన పరీక్షల సంఖ్య 1,22,218కు చేరింది. వీరిలో 96,485 మందికి కరోనా లేనట్లు తేలింది.

కొవిడ్‌ పడకలు 1340 ఖాళీ
రాష్ట్రంలో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల్లో సోమవారం నాటికి 1340 పడకలు ఖాళీగా ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ ప్రకటనలో తెలిపింది. వీటిలో అత్యధికంగా గాంధీ ఆసుపత్రిలో 1058 పడకలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం గాంధీ, కింగ్‌కోఠి, ఛాతీ, ఫీవర్‌ ఆసుపత్రుల్లో కలుపుకొని మొత్తంగా 877 పడకల్లో కొవిడ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇందులోనూ కరోనా అనుమానితులు 284 మంది ఉండగా, కొవిడ్‌ నిర్ధారించినవారు 877 మంది ఉన్నారు.

మహమ్మారితో కౌన్సిలర్‌ మృతి
సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: సంగారెడ్డికి చెందిన ఓ మహిళా కౌన్సిలర్‌(58)కు కొవిడ్‌ బారిన పడి మరణించారు. వారం కిందట కరోనాతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చేరి.. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందారు. ఈమె భౌతికకాయాన్ని సంగారెడ్డికి తరలించి కొవిడ్‌-19 నిబంధనల ప్రకారం అంత్యక్రియలు చేపట్టారు. సంగారెడ్డి హాస్టల్‌గడ్డలోని ఆమె నివాస కాలనీకి వైద్యులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు వెళ్లి రసాయనాలు పిచికారీ చేయించారు. ఆమె కుటుంబీకులతో పాటు, బంధువులు, సన్నిహితులకు వైద్య పరీక్షలు చేయనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.


కరోనాతో బాలింత కన్నుమూత
అనాథగా 15 రోజుల శిశువు

ఖమ్మం వైద్య విభాగం, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో ఓ గ్రామానికి చెందిన బాలింత(28) కరోనాతో మృతి చెందింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఈమెను జూన్‌ 21న కుటుంబీకులు ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా కాన్పు చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండటంతో 28న ఇంటికి పంపించారు. ఆ తర్వాత తల్లికి జ్వరంతో పాటు వాంతులు కావడంతో జులై 3న తిరిగి ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆమె శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతోండటంతో.. వైద్యులు కరోనా పరీక్షలు చేయించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమెకు వైరస్‌ ఉందని ఆదివారం అర్ధరాత్రి వచ్చిన నివేదికల్లో తేలింది. అప్పటికే పరిస్థితి విషమించిన బాలింత సోమవారం తెల్లవారుజామున మరణించింది. దీంతో 15 రోజుల మగబిడ్డ తల్లి ప్రేమకు దూరమయ్యాడు. గ్రామస్థులు మృతదేహాన్ని తీసుకురావడానికి అభ్యంతరం తెలపడంతో ఖమ్మంలో అంత్యక్రియలు నిర్వహించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.