close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జల జగడాల పరిష్కారం ఎలా?

కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టి
  జలసంఘం, నదీ బోర్డులతో సంప్రదింపులు

ఈనాడు హైదరాబాద్‌: అంతర్‌ రాష్ట్ర జల వివాదాలను పరస్పర సహకారంతో పరిష్కరించడం ఎలా అన్నదానిపై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ దృష్టి సారించింది. కేంద్ర జలసంఘం, దేశంలోని నదీ బోర్డులతో విస్తృతంగా చర్చించి విధానపరమైన మార్పులకు శ్రీకారం చుట్టనుంది. అంతర్‌ రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఏళ్ల తరబడి కొనసాగడం, వీటిని పరిష్కరించడానికి ఏర్పాటు చేసే ట్రైబ్యునళ్ల విచారణలు సుదీర్ఘ కాలం కొనసాగుతుండటం, తీర్పుల తర్వాత కూడా రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కారం కాని నేపథ్యంలో పరస్పర సహకారంతో పరిష్కరించడం ఎలా అన్నదానిపై కేంద్రీకరించింది. దిల్లీలోని సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చిలో జల్‌శక్తి మంత్రిత్వశాఖ ప్రత్యేకంగా ఓ రీసెర్చి చెయిర్‌ను ఏర్పాటు చేసింది. ఈ విభాగం ప్రస్తుతం అంతర్‌రాష్ట్ర జల వివాదాలపై దేశవ్యాప్తంగా ఉన్న బోర్డులతో సంప్రదింపులు ప్రారంభించింది.
  సమస్యలపై ఆరా.. విస్తృత చర్చలు
దేశంలో సుమారు 160 అంతర్‌ రాష్ట్ర పరస్పర సహకార ఒప్పందాలు ఉన్నాయి. ట్రైబ్యునళ్లు ఇచ్చిన తీర్పులు, రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాలను అమలు చేయడానికి 8 నదీ యాజమాన్య బోర్డులు, రెండు అథారిటీలు ఉన్నాయి. వీటి పనితీరు ఎలా ఉంది, ఆచరణలో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ఎలాంటి సహకారంతో వీటిని పరిష్కరించుకోవచ్చు.. తదితర అంశాలపై కేంద్ర జల్‌శక్తి అధికారులు విస్తృతంగా చర్చిస్తున్నారు. కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ ఆర్‌.కె.గుప్తా, ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రెయినేజి సెక్రటరీ జనరల్‌ పాండ్యా, సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చికి చెందిన శ్రీనివాస్‌ చివుకుల తదితరులు మూడు రోజుల పాటు అన్ని బోర్డులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించారు. కృష్ణా, గోదావరి, తుంగభద్ర బోర్డుల ఛైర్మన్లు పరమేశం, చంద్రశేఖర్‌ అయ్యర్‌, రంగారెడ్డిలు హైదరాబాద్‌ నుంచి పాల్గొన్నారు. బోర్డు పరిధి ఇంకా నోటిఫై చేయకపోవడం వల్ల కృష్ణా, గోదావరి బోర్డుల పనిపై ప్రభావం, ఇతర అంశాల గురించి చర్చించారు.
సుదీర్ఘ చరిత్ర కలిగిన తుంగభద్ర బోర్డు పనితీరు గురించి ఆ బోర్డు ఛైర్మన్‌ రంగారెడ్డి వివరంగా కేంద్ర జల్‌శక్తి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. 1953 నుంచి 66 సంవత్సరాలుగా ఈ బోర్డు పనిచేస్తుంది. కేంద్ర జల్‌శక్తి, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణల నుంచి సభ్యులున్నారని, రెండు అంతర్‌ రాష్ట్ర కాలువలు ఉన్నాయి.., రిజర్వాయర్‌, వరద గేట్ల నిర్వహణ, హెడ్‌ రెగ్యులేటర్‌, కాలువలు, విద్యుత్తు, చేపలు ఇలా అన్నింటిపైనా బోర్డుదే పూర్తి ఆధిపత్యమంటూ, బోర్డు నిర్వహణలో ఉన్న సానుకూల అంశాలు, బలహీనతల గురించి వివరించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. కాలువల ఆధునికీకరణకు ఒకరు అంగీకరిస్తే ఇంకొకరు అంగీకరించకపోవడం, తాగునీటి పథకాలు, కొత్త ఎత్తిపోతల వల్ల ప్రాజెక్టు ఆయకట్టు సమస్యలను ఎదుర్కోవడం, బోర్డు పరిధి కాలువలకు నీటిని విడుదల చేయడంవరకే ఉండటం వల్ల అనధికార నీటి వినియోగం వల్ల సమస్యల గురించి ప్రస్తావిస్తూనే టెలిమెట్రీ, నిరంతర పర్యవేక్షణ ద్వారా ఎలా మంచి ఫలితాలు సాధించింది కూడా వివరించినట్లు తెలిసింది. కావేరి నీటి యాజమాన్య అథారిటీ, నర్మదా కంట్రోల్‌ అథారిటీ, బ్రహ్మపుత్ర, బెట్వా నది, బన్‌సాగర్‌ కంట్రోల్‌ బోర్డులు, భాక్రా అండ్‌ బియాస్‌, అప్పర్‌ యమునా రివర్‌ బోర్డులు, దామోదర్‌ వ్యాలీ రిజర్వాయర్‌ రెగ్యులేషన్‌ కమిటీతో కూడా కేంద్ర జల్‌శక్తి అధికారులు చర్చించారు. ప్రస్తుత బోర్డుల సానుకూలతలు, బలహీనతలు, కొత్తగా వచ్చే బోర్డులు పటిష్ఠంగా పనిచేయాలంటే ఎలా ఉండాలి, అంతర్‌ రాష్ట్ర జల వివాదాలను పరస్పర సహకారంతో పరిష్కరించుకోవడంలో బోర్డుల పాత్ర ఎలా ఉండాలన్న దానిపై కేంద్ర జల్‌శక్తి ఓ విధానాన్ని రూపొందించనుంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.