close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
10రోజుల్లో... వేల పడకలు

దిల్లీలో భారీ కొవిడ్‌ ఆస్పత్రి ప్రారంభం

ఇరవై ఫుట్‌బాల్‌ మైదానాలతో సమానమైన విస్తీర్ణం.. పది వేల పడకలు.. అందులో వెయ్యి పడకలకు ఆక్సిజన్‌ సదుపాయం.. గ్రంథాలయం.. ఇవీ దిల్లీలో ఛత్తర్‌పుర్‌లోని రాధాస్వామి సత్సంగ్‌ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఆస్పత్రి ప్రత్యేకతలు. ప్రపంచంలోని అతిపెద్ద కొవిడ్‌ ఆస్పత్రుల్లో ఒకటయిన ఈ కేందాన్ని దిల్లీ లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ బైజల్‌ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. సర్దార్‌ పటేల్‌ కొవిడ్‌ కేర్‌ కేంద్రం-ఆస్పత్రి (ఎస్‌పీసీసీసీ-హెచ్‌)గా పిలిచే ఈ ఆస్పత్రిని కేవలం పది రోజుల్లోనే సిద్ధం చేశారు.  లక్షణాలు లేని కరోనా బాధితులకు, ఓ మాదిరి లక్షణాలున్నవారికి ఐసోలేషన్‌ కేంద్రంగా ఉండేలా దాన్ని తీర్చిదిద్దారు.


డీఆర్‌డీవో ఆధ్వర్యంలో వెయ్యి పడకల ఆస్పత్రి

ఈనాడు, దిల్లీ: దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) వెయ్యి పడకలతో సర్దార్‌ పటేల్‌ కొవిడ్‌ ఆస్పత్రిని సిద్ధం చేసింది. టాటా ట్రస్ట్‌, కేంద్ర హోం శాఖ, వైద్య ఆరోగ్య శాఖల సహకారంతో కేవలం 12 రోజుల్లోనే దాన్ని ఏర్పాటుచేశారు.అందులో 250 ఐసీయూ పడకలు ఉన్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ఈ ఆస్పత్రిని ఆదివారం సందర్శించారు. అక్కడి ఏర్పాట్ల వివరాలను వారికి డీఆర్‌డీవో ఛైర్మన్‌ సతీశ్‌ రెడ్డి వివరించారు. డీఆర్‌డీవో పర్యవేక్షణలో సాయుధ బలగాల వైద్య సేవల బృందం ఈ తాత్కాలిక ఆస్పత్రిని నిర్వహిస్తుంది.

దిల్లీలో డీఆర్‌డీవో ఆసుపత్రి... ఐసీయూ వార్డుకు సంతోష్‌ బాబు పేరు

దిల్లీలో వెయ్యి పడకలతో డీఆర్‌డీవో ఏర్పాటు చేసిన సర్దార్‌ పటేల్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో పలు వార్డులకు - చైనా బలగాలతో ఘర్షణలో అమరులయిన భారతీయ సైనికుల పేర్లను పెట్టారు. నాటి ఘర్షణలో వీర మరణం పొందిన తెలుగు తేజం కర్నల్‌ బి.సంతోష్‌ బాబు పేరును ఐసీయూ, వెంటిలేటర్‌ వార్డుకు పెట్టారు.

ఒకే రకమైన చికిత్స

కొవిడ్‌ రోగులందరికీ అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఒకే రకమైన చికిత్స అందించేలా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులందరితోనూ ఆన్‌లైన్‌లో ఓ గ్రూప్‌ ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ప్రభుత్వ, ప్రైవేటు అని తేడా లేకుండా అన్నిచోట్లా ప్రామాణికమైన చికిత్స అందుతుందని భావిస్తున్నారు. అలాగే వైద్యుల మధ్య అవసరమైన సలహా, సంప్రదింపులకు దీనివల్ల వీలుపడుతుంది.


ఇవీ ప్రత్యేకతలు..

* మొత్తం పడకలు: పది వేలు, మరో 200 వరకు పెంచుకోవచ్చు.
* విస్తీర్ణం: పొడవు 1700 అడుగులు, వెడల్పు 700 అడుగులు
* 50 పడకలకు ఒక ఎన్‌క్లోజర్‌ చొప్పున 200 ఎన్‌క్లోజర్లు
* రెండు విభాగాలు: ఒకటి కొవిడ్‌ కేర్‌ కేంద్రం- లక్షణాలు లేని పాజిటివ్‌ బాధితులకు ఇక్కడ చికిత్స(90శాతం పడకలు)

రెండోది.. ప్రత్యేక కొవిడ్‌ ఆరోగ్య సంరక్షణ కేంద్రం- లక్షణాలున్నవారికి ఇక్కడ చికిత్స (ఆక్సిజన్‌ సదుపాయంతో పది శాతం పడకలు)
* ప్రతి రోగికి ఒక పడక, ఒక స్టూల్‌, చిన్న ప్లాస్టిక్‌ కప్‌బోర్డ్‌, డస్ట్‌బిన్‌
* నిర్వహణ సౌలభ్యం కోసం కార్డ్‌బోర్డ్‌తో పడకల తయారీ
* ప్రతి మంచం వద్ద ల్యాప్‌టాప్‌, ఫోన్‌ ఛార్జింగ్‌ సౌకర్యం
* ఆడుకునేందుకు వీలుగా క్యారంబోర్డు, చెస్‌ వంటి రిక్రియేషన్‌ వసతి, గ్రంథాలయం.
* 18 వేల టన్నుల సామర్థ్యంతో ఏసీ
* సిబ్బంది: ఐటీబీపీ, ఇతర కేంద్ర సాయుధ బలగాల నుంచి వెయ్యి మందికి పైగా వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది; వీరు కాకుండా మరో వెయ్యి మంది పారామెడికల్‌ సిబ్బంది
* నిర్వహణ: ఆస్పత్రిలో చేరడం నుంచి డిశ్ఛార్జి అయ్యేవరకు ప్రతి వివరం ఈ-హాస్పిటల్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా  నిర్వహణ
* స్వచ్ఛంద సేవ: పడకలు, పరుపులు, దుప్పట్లు వంటివాటిని పౌరసమాజం, స్వచ్ఛంద సంస్థలు సమకూర్చాయి. ఆస్పత్రి రోజువారీ నిర్వహణకు రాధా స్వామి సత్సంగ్‌ బియాస్‌ అనే మత సంస్థ నుంచి స్వచ్ఛంద సేవకుల తోడ్పాటు. దక్షిణ దిల్లీలోని ఛత్తర్‌పుర్‌లో ఉన్న ఈ సంస్థ ఆవరణలోనే ఆస్పత్రి ఏర్పాటు.
* ఆహారం: రోజుకు ఐదుసార్లు పోషకాహారం. రోగనిరోధక శక్తిని పెంచే చవన్‌ప్రాష్‌, పండ్ల రసాలు, ఆయుష్‌ మంత్రిత్వశాఖ సిఫార్సు చేసిన ఆయుర్వేద కషాయం.

- ఈనాడు ప్రత్యేక విభాగం

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.