close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అనుకరణలు మనకొద్దు

స్వదేశీ సామాజిక మాధ్యమ వేదిక
‘ఎలిమెంట్స్‌’ యాప్‌నుఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి

ఈనాడు, దిల్లీ: అనుకరణకు దూరంగా దేశీయంగా మరిన్ని ఆవిష్కరణలను ప్రోత్సహించాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. దేశ యువత, ఐటీ నిపుణుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు అనువైన వాతావరణం నిర్మించుకోవాలన్నారు. తద్వారా ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ లక్ష్యాలను చేరుకొనేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. భారత్‌లో సాంకేతిక నిపుణులకు కొదవలేదన్నారు. వీరి ద్వారా మరిన్ని వినూత్న ఆవిష్కరణలు చేయడానికి సాంకేతిక రంగ సంస్థలు ముందుకు రావాలని కోరారు. ఆదివారమిక్కడ ఉపరాష్ట్రపతి నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో స్వదేశీ తొలి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎలిమెంట్స్‌’ యాప్‌ను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ...   ‘‘స్వదేశంలో మౌలిక వసతులను మెరుగుపర్చుకుంటూ, అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ, మానవ వనరుల శక్తిసామర్థ్యాలను పెంపొందించుకుంటూ ఓ బలమైన సరఫరా వ్యవస్థను నిర్మించుకునే లక్ష్యంతోనే ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’కు రూపకల్పన జరిగింది. స్వదేశీ శక్తిసామర్థ్యాలను గుర్తించి వాటిని ప్రోత్సహించడమే దీని ఉద్దేశం. భారతీయులందరూ స్థానిక ఉత్పత్తులు, సేవలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో (లోకల్‌ టు గ్లోకల్‌) కృషిచేయాలి. యువత  శక్తిసామర్థ్యాలను గుర్తించి సద్వినియోగం చేసుకోవాలి. ప్రధాని మోదీ ప్రారంభించిన ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌’.. ప్రస్తుత పరిస్థితుల్లో భారత యువ ఐటీ నిపుణులు మానవ జీవన ప్రమాణాలను పెంచడానికి అవసరమైన యాప్‌లను రూపొందించడానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇతరులను అనుకరించడం మానేసి కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి. కరోనా నేపథ్యంలో ఎదురవుతున్న సవాళ్లను అవకాశాలుగా మలచుకొని అందరం కృత నిశ్చయంతో ముందుకెళ్లాలి. తెలుగు సహా ఎనిమిది భారతీయ భాషల్లో అభివృద్ధి చేసిన ఈ ‘ఎలిమెంట్స్‌’ యాప్‌ మరిన్ని భారతీయ భాషల్లో రావాలని ఆకాంక్షిస్తున్నాను. వినియోగంలో ఉన్న విదేశీ యాప్‌లకు దీటుగా ఈ యాప్‌ ప్రత్యామ్నాయంగా నిలవాలని ఆశిస్తున్నాను’’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆత్మనిర్భర్‌ భారత నిర్మాణంలో గురువుల పాత్ర కీలకమని ఆయన తెలిపారు. ఎలిమెంట్స్‌ యాప్‌ తయారీలో పాలుపంచుకున్న వెయ్యి మందికి పైగా ఐటీ నిపుణులను ప్రశంసించారు. ఈ యాప్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు ఉచిత ఆడియో, వీడియో కాల్స్‌ చేసుకోవడంతో పాటు చాటింగ్‌ ద్వారా సంభాషించుకునే సౌలభ్యం ఉంది. ఈ కార్యక్రమంలో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు, ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌, జీఎంఆర్‌ అధినేత గ్రంథి మల్లికార్జునరావు, కేంద్రమంత్రి సురేశ్‌ప్రభు, పారిశ్రామికవేత్త అనంత్‌ గోయెంకా, విద్యావేత్త టీవీ మోహన్‌దాస్‌ పాయ్‌ తదితరులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు.


ప్రధాని ఆకాంక్షలకు అనుగుణంగా ఎలిమెంట్స్‌ యాప్‌: రామోజీరావు

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మాట్లాడుతూ.. ‘‘ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. యాప్‌ అభివృద్ధి చేసిన నిపుణుల బృందానికి అభినందనలు. భారతీయులందరికీ ఇది గొప్ప సుదినం. ప్రధాని మేక్‌ ఇన్‌ ఇండియా ఆకాంక్షలకు అనుగుణంగా ఈ యాప్‌ ఉంది. ఎలిమెంట్స్‌ యాప్‌ పనితీరు, విలువలతో దేశం గర్వపడేలా చేస్తుందని విశ్వసిస్తున్నా. ప్రపంచస్థాయిలో ఈ యాప్‌ ఆదరణ పొందాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.