close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సగం పడకలు సర్కారుకే

రాష్ట్రంలో కార్పొరేట్‌ ఆసుపత్రులపై నియంత్రణ
ఐఏఎస్‌ కమిటీ పర్యవేక్షణ
యాప్‌ ద్వారా రోగులకు కేటాయింపు
ఆన్‌లైన్‌లో పరిశీలన
ప్రభుత్వ నిర్ణయం..  ప్రైవేటుతో చర్చలు

ఈనాడు, హైదరాబాద్‌: కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోని కొవిడ్‌ పడకల్లో సగం రాష్ట్ర ప్రభుత్వం తన పర్యవేక్షణలోకి తీసుకోనుంది. వాటి కేటాయింపులో పారదర్శకత కోసం ఒక యాప్‌ను తీసుకురానుంది. దీనివల్ల ఏ ఆసుపత్రిలో ఎన్ని పడకలు ఖాళీగా ఉన్నాయో తెలిసిపోతుంది. సర్కారు నిర్దేశించిన ధరలకు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందాలనుకునే వారు.. ఈ యాప్‌ ద్వారా పడకలను పొందవచ్చు. మిగిలిన 50 శాతం బెడ్లను ఆసుపత్రుల యాజమాన్యాలు తమ ఇష్టానుసారం కేటాయించుకోవచ్చు. ఆదివారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కార్పొరేట్‌ ఆసుపత్రుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సగం పడకలు తమ పర్యవేక్షణలోకి తీసుకోనున్నట్లు వెల్లడించగా కార్పొరేట్‌ ఆసుపత్రులు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం.

ఇప్పుడున్నవీ 30 శాతమే!
జీహెచ్‌ఎంసీ పరిధిలోని సుమారు 25 కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్సలు జరుగుతున్నాయి. వాటిలో కరోనా అనుమానిత లక్షణాలున్నవారికి, పాజిటివ్‌ వచ్చినవారికి, ఐసీయూలో చికిత్స అందించాల్సినవారికి, వెంటిలేటర్‌పై చికిత్స ఇవ్వాల్సిన వారికి.. ఇలా వేర్వేరు విభాగాలుగా పడకలను ఏర్పాటుచేశారు. ఒక్కో కార్పొరేట్‌ ఆసుపత్రిలో 300 నుంచి 800 వరకూ పడకలుండగా వాటిలో 20 నుంచి 30 శాతం కొవిడ్‌ బాధితుల కోసం కేటాయించారు. వాటిలోనూ సాధారణ ఐసోలేషన్‌ పడకలు తక్కువగా కేటాయించి, ఐసీయూ పడకలను ఎక్కువగా కేటాయించారు. ఉదాహరణకు ఒక ఆసుపత్రిలో 500 పడకలుంటే.. ఐసోలేషన్‌కు 50, ఐసీయూలో 80, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూలో 20 చొప్పున 150 పడకలను కొవిడ్‌ బాధితులకు కేటాయించారు. మిగిలినవి ఇతర సాధారణ రోగుల కోసం ఉంచారు. అయితే మున్ముందు కేసుల సంఖ్య మరింత తీవ్రమయ్యే అవకాశాలుండడంతో.. కొవిడ్‌ పడకలను 60 శాతం వరకూ పెంచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

బెడ్లు ‘అమ్ముడుపోతున్నాయా?’
ప్రస్తుతం కరోనా ఉద్ధృతి పెరగడంతో అనుమానిత లక్షణాలున్నవారు పెద్దసంఖ్యలో కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఎంతైనా చెల్లించడానికి సిద్ధపడుతున్నారు. ఆసుపత్రులు ఇదే అదనుగా ఎక్కువ నగదు చెల్లించేవారికే పడకలు ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. బీమా ఉన్నవారిని రెండో ప్రాధాన్యంగా పరిగణిస్తున్నాయి. ప్రభుత్వ నిర్దేశిత ధరలతో చేరాలని వచ్చినవారికి ‘పడకలు లేవ’ని చెబుతున్నారనేది ప్రధాన ఆరోపణ. ఏ కార్పొరేట్‌ ఆసుపత్రిని సంప్రదించినా.. పడకలు ఖాళీ లేవనే సమాధానమే వస్తుండడంతో.. నిజంగానే ఖాళీల్లేవా? లేక కేవలం డబ్బున్నవారికే కేటాయిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్‌లో చికిత్సలపై స్పష్టమైన ఆదేశాలిచ్చినా.. ఒక్క ఆసుపత్రి కూడా వాటిని పాటించడం లేదనే విమర్శలున్నాయి. అసలు ఎంతమందికి ప్రభుత్వ ధరలకు చికిత్స అందించారనే సమాచారమే లేదు. ఇలాంటి ఆరోపణలు తీవ్రమవడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది.

అవసరమైతే హోటళ్లు కూడా..
అవసరమైతే కార్పొరేట్‌ ఆసుపత్రులకు అనుబంధంగా కొన్ని హోటళ్లను కూడా కొవిడ్‌ చికిత్సల కోసం వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. వాటిలో ఆక్సిజన్‌ సిలిండర్లను అందుబాటులో ఉంచి, బాధితులకు చికిత్స అందించాలనే సూచన వచ్చినట్లు తెలిసింది.

మా సమస్యలూ చూడండి
ఆక్సిజన్‌ అవసరం పెరగడంతో సరఫరాదారులు ధరలను పెంచేశారనీ, కొన్ని ఔషధాలు, వ్యక్తిగత పరిరక్షణ కిట్ల ధరలు కూడా పెరిగిపోయాయనీ కార్పొరేట్‌ ఆసుపత్రుల ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ధరలకు తాము కొంత మేరకు చికిత్స అందిస్తున్నామనీ, అయితే కొన్ని బీమా సంస్థలు తమ కార్డుదారులకు కూడా అదే ధరకు చికిత్స అందించాలని కోరుతున్నాయనీ, అంత తక్కువ ధర తమకు సాధ్యం కాదనీ కార్పొరేట్‌ ఆసుపత్రుల ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. కరోనాకు భయపడి చాలామంది సిబ్బంది రావడం మానేశారని, ఎక్కువ జీతాలిచ్చి కొత్తగా నియమించుకోవలసి వస్తోందని.. తాము ఎదుర్కొంటున్న సమస్యలపైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని వారు కోరినట్లు తెలిసింది.ఈ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఉన్నతాధికారులు వారికి హామీ ఇచ్చారు.


ఒకే రకమైన చికిత్స

కొవిడ్‌ రోగులందరికీ అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఒకే రకమైన చికిత్స అందించేలా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులందరితోనూ ఆన్‌లైన్‌లో ఓ గ్రూప్‌ ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ప్రభుత్వ, ప్రైవేటు అని తేడా లేకుండా అన్నిచోట్లా ప్రామాణికమైన చికిత్స అందుతుందని భావిస్తున్నారు. అలాగే వైద్యుల మధ్య అవసరమైన సలహా, సంప్రదింపులకు దీనివల్ల వీలుపడుతుంది.


ఆన్‌లైన్‌లో కేటాయింపు

కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోని మొత్తం పడకలను ప్రభుత్వమే తీసేసుకుంటే నిర్వహణలో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలుండడంతో.. ఉన్నవాటిలో సగం మాత్రం తీసుకుని అధికారుల పర్యవేక్షణలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీని నియమించింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలు వీటిలో అమలవుతాయి. అయితే పీపీఈ కిట్లు, మాస్క్‌లు, ఇతర ఖరీదైన ఔషధాలకయ్యే ఖర్చును బాధితులు అదనంగా భరించాల్సి ఉంటుంది. ఏ కార్పొరేట్‌ ఆసుపత్రిలో ఎన్ని ఐసోలేషన్‌ పడకలు? ఎన్ని ఐసీయూ పడకలు? ఎన్ని వెంటిలేటర్లు? అందుబాటులో ఉన్నాయనేది ఆన్‌లైన్‌ విధానంలో ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుంటారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.