close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సంపూర్ణ విశ్వాసంతోనే ముందుకు

అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారమే వ్యాక్సిన్‌
భారత్‌ బయోటెక్‌ టీకా విడుదలపై ఐసీఎంఆర్‌ వివరణ

ఈనాడు, దిల్లీ: కరోనా వ్యాధి నియంత్రణకు భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన స్వదేశీ టీకాను ఆగస్టు 15నాడు విడుదల చేయనున్నట్లు శుక్రవారం చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు ఐసీఎంఆర్‌ శనివారం స్పష్టం చేసింది. టీకా విడుదల తేదీని ముందే నిర్దేశించటం తొందరపాటు చర్య కావచ్చేమోనంటూ వెలువడుతున్న సందేహాలను తోసిపుచ్చింది. ఈ మేరకు సంస్థ సుదీర్ఘ వివరణ ఇచ్చింది. ఎక్కడా తొందరపాటు లేదని, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారమే ముందుకెళ్తున్నట్లు వెల్లడించింది. భారత్‌ బయోటెక్‌ సంస్థ రూపొందించిన టీకాను లోతుగా అధ్యయనం చేసిన తర్వాత దానిపై తమకు నమ్మకం వచ్చిందని, ఆ విశ్వాసంతోనే దాన్ని వేగంగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్లు పేర్కొంది. నిబంధనల పేరుతో జరిగే జాప్యాన్ని పరిహరించి వేగంగా అనుమతులు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే శుక్రవారం ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ క్లినికల్‌ సైట్స్‌ ఇన్వెస్టిగేటర్స్‌కి లేఖలు రాసినట్లు ఐసీఎంఆర్‌ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
* ‘‘ప్రస్తుతం ప్రపంచం మొత్తం మహమ్మారితో పోరాడుతున్న సమయంలో ప్రజల ప్రాణాలు రక్షించడానికి సమర్థవంతమైన టీకాను అభివృద్ధి చేయడం అత్యంత ప్రధానం.
* ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టీకాలు వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నప్పటికీ, దేశీయంగా పూర్తి స్వదేశీ వ్యాక్సిన్‌ను ప్రోత్సహించడం అత్యంత ముఖ్యం. అదే సమయంలో భద్రత, నాణ్యత, నైతిక విలువలతోపాటు అన్ని రకాల నియంత్రణావసరాలకు కట్టుబడి ఉండటం ప్రధానం.
* ఐసీఎంఆర్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సహకారంతో భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ఒక ఇన్‌యాక్టివేటెడ్‌ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ నుంచి వచ్చిన డేటాను క్షుణ్ణంగా సమీక్షించి, దాని గుణగణాలను పరిశీలించిన తర్వాత అది విశ్వసనీయంగా కనిపించడంతో దాన్ని వైద్యపరంగా అభివృద్ధి చేయడానికి (క్లినికల్‌ డెవెలప్‌మెంట్‌) ఐసీఎంఆర్‌ చేయూతనందిస్తోంది.
* వ్యాక్సిన్‌ అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఏకకాలంలో మనుషులు, పశువులపై ప్రయోగాలకు అనుసరిస్తున్న అంతర్జాతీయ విధానాలనే ఐసీఎంఆర్‌ అమలు చేస్తోంది.
* దస్త్రాల నత్తనడక ద్వారా ఎదురయ్యే ఇబ్బందుల నుంచి స్వదేశీ వ్యాక్సిన్‌ అభివృద్ధి ప్రక్రియకు రక్షణ కల్పించాల్సి ఉంది.
* ప్రస్తుతం తలపెట్టిన రెండో దశ ప్రయోగాలను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలన్నదే ప్రధాన లక్ష్యం. అందువల్ల సమర్థత కోసం ఎలాంటి జాప్యంలేకుండా మనుషులపై ప్రయోగాలు పూర్తిచేయాల్సి ఉంది.
* ప్రజల భద్రత, ప్రయోజనాలకు ఐసీఎంఆర్‌ ఎల్లవేళలా సర్వోన్నత ప్రాధాన్యం ఇస్తుంది. ఇప్పుడూ అందుకు కట్టుబడే ఉంది’’ అని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.