close

ప్రధానాంశాలు

భక్త వనం.. మేడారం

ఆదివారం ఒక్కరోజే 3 లక్షలమందికి పైగా దర్శనం
  అధికారులను విస్తుగొలుపుతున్న అనూహ్య రద్దీ
  డీజీపీతో కలిసి అభివృద్ధి పనులు పరిశీలించిన సీఎస్‌
  నెలాఖరులోపు పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మేడారం, న్యూస్‌టుడే: మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం వివిధ రాష్ట్రాల నుంచి మూడు లక్షలమందికిపైగా తరలిరావడంతో మేడారం భక్తవనాన్ని తలపించింది. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు మహాజాతర జరగనుండగా ఈ దఫా ముందస్తు మొక్కులకు భక్తులు ప్రాధాన్యమిస్తుండటంతో మేడారంలో రోడ్లన్నీ వాహనాలు, భక్తులతో నిండిపోయాయి. పక్షం రోజుల ముందే అనూహ్యంగా రద్దీ పెరగడంతో తెల్లవారుజామున 2 గంటల నుంచే దర్శనాలు ఆరంభమై, రాత్రి వరకు కొనసాగాయి. పార్కింగ్‌ స్థలాలు వాహనాలతో నిండిపోవడంతో మహాజాతర అప్పుడే మొదలైందా? అనే సందేహం కలుగుతోందని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. మహా జాతర సమయంలో ఇక్కడ భక్తుల రద్దీ సహజం. అందుకు భిన్నంగా ఈ దఫా నెల ముందే అమ్మవార్ల దర్శనానికి బారులుదీరుతుండటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏటా దాదాపు కోటి మంది జాతరకు హాజరవుతారని అంచనా. ఈ క్రమంలో తమ ఆరాధ్య దైవాల దర్శనం కష్టసాధ్యమవుతుందనే భయంతో ఎక్కువ మంది ముందస్తు మొక్కులకే మొగ్గు చూపుతున్నట్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

సౌకర్యాలు అంతంతే..
జాతర కోసం 21 శాఖల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వారంతా జాతర నాటికి పనులు పూర్తిచేసే లక్ష్యంతో ఉన్నారు. జంపన్న వాగు స్నానఘట్టాల వద్ద తుంపర స్నానానికి ఏర్పాటు చేయడం మినహా మిగిలిన పనులన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి.

తరతరాలు గుర్తుండాలి: సీఎస్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేడారం జాతరను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని, జాతరను అన్ని శాఖల సమన్వయంతో తరతరాలు గుర్తుండేలా గతంలో కంటే వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్నారు. ప్రతి భక్తుడూ మంచి అనుభూతితో తిరిగి వెళ్లేలా చూడటమే అందరి లక్ష్యం కావాలని సూచించారు. ఆదివారం సీఎస్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో పర్యటించారు. అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. సీఎస్‌, డీజీపీలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. ఎత్తు బంగారం(బెల్లం)తో తులాభారం వేయించుకున్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.