close

ప్రధానాంశాలు

మోదీ ఇష్టారాజ్యం

  ఎంతకాలం ప్రజల గొంతు నొక్కుతారు?: చిదంబరం
భారత్‌ బచావో ఆందోళనలో సోనియా విమర్శలు
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధమని ప్రకటన
రాహుల్‌ గాంధీనేగానీ రాహుల్‌ సావర్కర్‌ను కాదన్న యువనేత
ఈనాడు - దిల్లీ

రోజూ రాజ్యాంగానికి అవహేళన
ఎప్పుడు బుద్ధిపుడితే అప్పుడు ఏదో ఒక అధికరణాన్ని పెట్టడమో తొలగించడమో చేస్తున్నారు. రాష్ట్రాల హోదాను మార్చేస్తున్నారు. చర్చలేకుండా బిల్లులు ఆమోదిస్తున్నారు...ఇలా ప్రతిరోజూ మోదీ, షాలు ఇష్టారీతిన రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు.
- సోనియా గాంధీ

ప్రాణం పోయినా క్షమాపణ చెప్పను
భారత్‌లో అత్యాచారాలు (రేప్‌ ఇన్‌ ఇండియా) అన్న వ్యాఖ్యలు చేసినందుకు నేను క్షమాపణలు చెప్పాలని భాజపా అంటోంది. ఉన్నది ఉన్నట్టు చెప్పాను. ప్రాణాలైనా విడుస్తానుగానీ, క్షమాపణ మాత్రం చెప్పను. నా పేరు రాహుల్‌ సావర్కర్‌ కాదు.. రాహుల్‌ గాంధీ. సత్యం చెప్పినందుకు ఏ కాంగ్రెస్‌వాదీ క్షమాపణలు చెప్పడు.
- రాహుల్‌ గాంధీ

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధమని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించారు. ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడే పార్టీ కాంగ్రెస్‌ ఒక్కటేనని, ఇప్పుడు కూడా వెనక్కి తగ్గబోమని అన్నారు. ‘భారత్‌ బచావో’ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ శనివారం ఉదయం ఇక్కడి రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. మోదీ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. ప్రజల మధ్య గొడవలు పెట్టి అసలైన సమస్యల నుంచి దృష్టి మరల్చడమే మోదీ- షాల ఏకైక ఎజెండా అని వ్యాఖ్యానించారు. వారి పాలన ఇష్టా రాజ్యంగా కొనసాగుతోందని ధ్వజమెత్తారు. పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ ఆవేశంగా మాట్లాడుతూ ‘భారత్‌లో అత్యాచారాలు’ (రేప్‌ ఇన్‌ ఇండియా) అన్న వ్యాఖ్యలు చేసినందుకు గాను భాజపా చేస్తున్న డిమాండ్లకు లొంగి తాను క్షమాపణ చెప్పబోనని స్పష్టం చేశారు. అధికారం కోసం మోదీ జమ్మూ-కశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాల్లో నిప్పుపెట్టారని ఆరోపించారు. సీనియర్‌ నేత చిదంబరం ప్రసంగిస్తూ ఎంతకాలం ప్రజల గొంతులను నొక్కుతారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు కమల్‌నాథ్‌, అశోక్‌ గహ్లోత్‌, భూపేష్‌ బఘెల్‌ తదితరులు ప్రసంగించారు.


ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిన మోదీ

ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినందుకు ప్రధాని మోదీ, ఆయన సహాయకుడు అమిత్‌ షాయే క్షమాపణలు చెప్పాలి. భారత ఆర్థిక వ్యవస్థ నాశనం కావాలని శత్రువులంతా కోరుకున్నారు. వారు ఆ పని చేయలేకపోయినా ప్రధాని మోదీ మాత్రం ఒంటి చేత్తో నాశనం చేశారు. అధికారం కోసం వారేమైనా చేస్తారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన న్యాయవ్యవస్థ, మీడియా, ఇతర సంస్థలన్నీ తమ విధులను మరిచిపోయాయి. యూపీఏ హయాంలో మీడియా విమర్శలు చేస్తే మేం అంగీకరించాం. ఇప్పుడు మీడియా తన కర్తవ్యాన్ని విస్మరించింది. మిమ్మల్ని(మీడియాను) అణగదొక్కుతున్నారంటే అది మీపై జరిగే దాడి కాదు..భారత ఆత్మపై జరుగుతున్న దాడి. ఈ వ్యవస్థలేవీ భయపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్‌ అండగా ఉంటుంది. అందరం కలిసి దేశంలో నెలకొన్న భయానక వాతావరణాన్ని తొలగిద్దాం.

- రాహుల్‌ గాంధీ

 


పోరాడలేదంటే పిరికివారే

ప్రస్తుతం అంతటా అన్యాయమే రాజ్యమేలుతోంది. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఎవరైనా పోరాడకపోతే వారు పిరికివారుగా మిగిలిపోతారు. మీకు దేశంపై ప్రేమ ఉంటే దయ చేసి గొంతు విప్పండి. మీరు మౌనంగా ఉంటే విప్లవాత్మకమైన మన రాజ్యాంగం నాశనమవుతుంది. దేశ విభజన ప్రారంభమవుతుంది.
ఇప్పుడు ఎక్కడ చూసినా మోదీ ఉంటే అన్నీ సాధ్యమేనన్న ప్రచారం జరుగుతోంది. ఔను! భాజపా ఉంటే ఇవి కూడా సాధ్యమే....కిలో ఉల్లి వంద రూపాయలు కావడం...45 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా నిరుద్యోగం పెరగడం...నాలుగు కోట్ల మంది ఉద్యోగాలు పోవడం...15వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం...ఇవి కూడా సాధ్యమే.

- ప్రియాంక గాంధీ వాద్రా

 


అన్యాయాన్ని భరించడమే పెద్ద నేరం

అన్యాయాన్ని భరించడమే పెద్ద నేరం. ప్రజాస్వామాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమయింది. తుది శ్వాస ఉన్నంతవరకు కాంగ్రెస్‌ పార్టీ ఇందుకోసం పోరాడుతుంది. ప్రస్తుతం ‘అంధేరా నగరి... చౌపట్‌రాజా’ (గుడ్డి నగరంలో... గందరగోళం రాజు) అన్న పరిస్థితి నెలకొంది. మోదీ-షా ప్రభుత్వానికి పార్లమెంటు, ఇతర వ్యవస్థలు పట్టవు. ఒక పక్క రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకొంటూ మరోపక్క ప్రతిరోజూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు.

- సోనియా గాంధీ


ఆరేళ్ల క్రితమే తప్పుదోవ పట్టించారు

పెద్దపెద్ద వాగ్దానాలు చేసి ఆరేళ్ల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను తప్పుదోవపట్టించారు. ఆ వాగ్దానాలేవీ అమలు కాలేదు. అవన్నీ అబద్ధాలని తేలాయి. దేశానికి కొత్త దిశ ఇచ్చేలా కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలంతా కృషి చేయాలి.

- మన్మోహన్‌ సింగ్‌

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.