close

ప్రధానాంశాలు

పండగ ప్రయాణం ప్రయాసే!

సంక్రాంతికి నెల రోజుల ముందే కష్టాలు మొదలు
ఒక్కో రైల్లో భారీగా వెయిట్‌ లిస్ట్‌
50 శాతం అదనపు ఛార్జీలతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
  ప్రత్యేక రైళ్ల ఊసే ఎత్తని ద.మ.రైల్వే
  బుకింగ్‌ మొదలైన 2 గంటల్లోనే బస్సుల్లో సీట్లన్నీ భర్తీ
ఈనాడు - హైదరాబాద్‌

తెలుగువారి పెద్దపండగ సంక్రాంతికి నెల రోజుల ముందే ప్రయాణ కష్టాలు మొదలయ్యాయి. రైళ్లలో రిజర్వేషన్లు ఇప్పటికే పూర్తయిపోయాయి. కనీసం బస్సుల్లో అయినా టికెట్లు దొరుకుతాయనుకుంటే అక్కడా నిరాశే ఎదురవుతోంది. ముఖ్యంగా ఆంధ్ర వైపు వెళ్లే బస్సుల్లో బుకింగ్‌ తెరిచిన ఒకట్రెండు గంటల్లోనే సీట్లన్నీ నిండిపోయాయి. జనవరి 13 వరకూ రిజర్వేషన్లు పూర్తయిపోవడంతో.. పండక్కి సొంతూరు ఎలా వెళ్లాలన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

 10-13 నాలుగు రోజుల రద్దీ
హైదరాబాద్‌లో తెలంగాణ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు లక్షలాదిగా ఉన్నారు. పండక్కి ఊరెళ్లేవారిలో కొందరు 10వ తేదీ శుక్రవారం సాయంత్రం నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మిగిలిన వాళ్లు 11, 12 తేదీల్లో.. హైదరాబాద్‌కు దగ్గరలోని తెలంగాణ జిల్లాల ప్రయాణికులు.. ఏపీలో ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు చెందిన కొందరు 12, 13 తేదీల్లో ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
* హైదరాబాద్‌ నుంచి ఏపీ వైపు ఏపీఎస్‌ఆర్టీసీ సగటున రోజుకు 600 బస్సులు నడుపుతోంది. దాదాపు అవన్నీ నిండిపోయాయి. విజయవాడకు వెళ్లే కొన్ని సర్వీసులు, పగటి సమయంలో నడిచే మరికొన్ని ఇతర ప్రాంత సర్వీసుల్లోనే స్పల్పంగా సీట్లున్నాయి.
* ఏపీ వైపు టీఎస్‌ఆర్టీసీ నిత్యం 300 వరకు బస్సులు నడుపుతోంది. వీటన్నింటిలోనూ సీట్లు నిండిపోయాయి.
* విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, భీమవరం, ఏలూరు, ఖమ్మం, భద్రాచలం వైపు బస్సుల్లో వెయిటింగ్‌లిస్ట్‌ పరిమితి దాటిపోయింది.


 జనసాధారణ్‌ రైళ్లతోనే ఊరట

పండగ రద్దీ స్పష్టంగా కన్పిస్తున్నా ద.మ.రైల్వే ఇప్పటివరకు సంక్రాంతి ప్రత్యేక రైళ్లు ప్రకటించకుండా జాప్యం చేస్తోందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైళ్లలో అవకాశం లేకపోవడంతో ప్రైవేటు బస్సుల ఆపరేటర్లు భారీగా ఛార్జీలు పెంచేస్తున్నారు. ప్రత్యేక రైళ్లు ప్రకటించడంతో పాటు రెగ్యులర్‌ రైళ్లకు అదనపు బోగీలు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. రిజర్వేషన్‌ ఇక్కట్లు లేని జనసాధారణ్‌ రైళ్లను ముఖ్యంగా తెలంగాణ జిల్లాలకు పెద్దసంఖ్యలో నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.


50 శాతం అదనపు బాదుడు

రెగ్యులర్‌ బస్సుల్లో సీట్లు అయిపోవడంతో.. ఉభయ రాష్ట్రాల ఆర్టీసీలు ప్రత్యేక బస్సుల బుకింగ్‌ మొదలుపెట్టాయి. ఇటీవలే బస్సుల ఛార్జీలు పెరగ్గా.. ఇప్పుడు ప్రత్యేక బస్సుల పేరుతో మరో 50 శాతం వసూలు చేస్తుండటంతో ప్రయాణికులపై ఛార్జీల భారం గణనీయంగా పడుతోంది. టీఎస్‌ఆర్టీసీ గతేడాది 4,500 వరకు ప్రత్యేక బస్సులు నడపగా.. ఈసారి 5వేల వరకు సంక్రాంతి ప్రత్యేక బస్సులకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందులో 3,500 వరకు తెలంగాణ జిల్లాలకు, మిగిలినవి ఏపీ వైపు నడపాలని భావిస్తోంది. ఏపీఎస్‌ఆర్టీసీ కొన్ని ప్రత్యేక బస్సుల్లో రిజర్వేషన్లు మొదలుపెట్టింది.


రైళ్లలో రిగ్రెట్‌..

ప్రధాన రైళ్లన్నింటిలోనూ రిజర్వేషన్లు ఎప్పుడో పూర్తయిపోయాయి. సగటున నాలుగైదు వందల వరకు..కొన్నింట్లో దాదాపు వెయ్యి వరకు వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లను ద.మ.రైల్వే జారీచేసింది. ఆ పరిమితీ దాటిపోయింది. ఫలితంగా 10, 11, 12, 13 తేదీల్లో.. జన్మభూమి, కోణార్క్‌, సాయినగర్‌ షిర్డి-విశాఖ, ఈస్ట్‌కోస్ట్‌, ఫలక్‌నుమా, విశాఖ, గోదావరి, గరీబ్‌రథ్‌, నర్సాపూర్‌, గౌతమి, ఎల్‌టీటీ విశాఖ, చార్మినార్‌, నాగావళి వంటి రైళ్లన్నీ టికెట్‌ తీసుకోలేని రిగ్రెట్‌ దశకు చేరాయి. సింహపురి, శాతవాహన, గోల్కొండ, రాయలసీమ వంటి రైళ్లలో 150-200 వరకు నిరీక్షణ జాబితా ఉంది. శబరిలో 300పై మాటే.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.