close

ప్రధానాంశాలు

మేం అమలు చేయం

‘పౌరసత్వ’ చట్టంపై ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం
5 రాష్ట్రాల సీఎంల నిరసన
తిరస్కరించే అధికారం వారికి లేదన్న హోంశాఖ అధికారి
ఈశాన్య రాష్ట్రాల్లో అమిత్‌ షా పర్యటన రద్దు
జపాన్‌ ప్రధాని అబె భారత పర్యటన కూడా..
బెంగాల్‌లో నిరసనకారుల విధ్వంసం

పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు పెరుగుతున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ 5 రాష్ట్రాల సీఎంలు నిరసన గళమెత్తారు. తమ రాష్ట్రాల్లో అమలు చేసే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. అయితే వారికి ఆ అధికారం లేదని కేంద్ర హోంశాఖ స్పష్టీకరించింది. అల్లర్ల నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల్లో అమిత్‌ షా పర్యటన, జపాన్‌ ప్రధాని అబె భారత పర్యటన రద్దయ్యాయి.

దిల్లీ, గువాహటి: పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎంలు తాజాగా నిరసన గళం వినిపించారు. ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని.. దాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని ఉద్ఘాటించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని తిరస్కరించే అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు లేవని కేంద్ర హోంశాఖ సీనియర్‌ అధికారి ఒకరు స్పష్టంచేశారు. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో భాగమైన కేంద్ర జాబితాలో ఆ చట్టం ఉంటుందని తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

రెండో స్వాతంత్య్ర సమరమిది: మమత
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తాను చేసున్న పోరాటాన్ని రెండో స్వాతంత్య్ర సమరంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని పశ్చిమ బెంగాల్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు కానివ్వబోనని ఉద్ఘాటించారు. ‘‘మతప్రాతిపదికన పౌరసత్వం కల్పించడం ఎందుకు? నేను దీన్ని అంగీకరించను’’ అని ఆమె పేర్కొన్నారు.

లౌకికత్వంపై దాడి: అమరీందర్‌
పౌరసత్వ సవరణ చట్టాన్ని భారత లౌకికత్వంపై దాడిగా పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కూడా తమ నిరసనను తెలిపారు.

సరకుల కోసం బారులు
ఘర్షణలతో గురువారం అట్టుడికిన అసోంలో పరిస్థితులు శుక్రవారం కాస్త మెరుగయ్యాయి. పలుచోట్ల నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నా.. హింస చెలరేగలేదు. గువాహటిలో ఉదయం కర్ఫ్యూను సడలించారంటూ స్థానిక ఛానెళ్లలో వార్తలు రావడంతో ప్రజలు నిత్యావసర సరకుల కోసం దుకాణాల ముందు బారులు తీరారు. అయితే, గువాహటిలో కర్ఫ్యూను సడలించలేదని అధికారులు స్పష్టం చేశారు. దిబ్రూగఢ్‌తోపాటు మేఘాలయలోని షిల్లాంగ్‌లో మాత్రం కర్ఫ్యూను సడలించారు.

రైల్వేస్టేషన్లలో విధ్వంసం
పౌరసత్వ సవరణ చట్టంపై పశ్చిమ బెంగాల్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. ముర్షీదాబాద్‌ జిల్లా బెల్డాంగా రైల్వేస్టేషన్‌లో నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. ఒక్కసారిగా వేలమంది దూసుకొచ్చి రైల్వేస్టేషన్‌కు నిప్పుపెట్టారు. రైల్వే పరిరక్షక దళం సిబ్బందిని చితకబాదారు. హావ్‌డా జిల్లాలోని ఉలుబెరియా రైల్వేస్టేషన్‌లో ఆందోళనకారులు రైళ్లపై రాళ్లు విసిరారు. డ్రైవర్‌ను గాయపర్చారు. రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు.

‘జామియా మిలియా’లో లాఠీఛార్జి
దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం శుక్రవారం రణరంగాన్ని తలపించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు భారీయెత్తున నిరసన చేపట్టారు. పార్లమెంటు హౌస్‌ వైపు దూసుకెళ్లేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. లాఠీఛార్జి చేశారు. ఈ ఘర్షణలో 100 మందికిపైగా విద్యార్థులు, 12 మంది పోలీసులకు గాయాలయ్యాయి. 42 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అరుణాచల్‌ ప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లో నిరసనలు చోటుచేసుకున్నాయి.


అబె, షా పర్యటనలు రద్దు

పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనల నేపథ్యంలో జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబె భారత పర్యటన రద్దయింది. అబె, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య వార్షిక సదస్సు గువాహటిలో ఈ నెల 15 నుంచి 17 వరకు జరగాల్సి ఉంది. మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌ల్లో ఆది, సోమవారాల్లో జరగాల్సిన తన పర్యటనలను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రద్దు చేసుకున్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.