close

ప్రధానాంశాలు

తెలంగాణ పోలీసులను తప్పుపట్టకూడదు

సుప్రీంకోర్టు కమిటీ, హక్కుల కమిషన్‌ ఏమంటాయి?
రేప్‌ చేసిన వారిని పోలీసులు కాల్చడం తప్పేనని తేల్చుతాయి..
ఇక ఏ పోలీసు, ఏ ప్రభుత్వ పెద్దా శిక్షించేందుకు ముందుకు రారు

చట్టాలు మార్చేలా దేశం  మొత్తం అడుగు వేయాలి
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ వ్యాఖ్యలు

ఈనాడు, అమరావతి: దిశ ఘటనలో తెలంగాణ పోలీసులు చేసింది తప్పేనని జాతీయ మానవహక్కుల కమిషన్‌, సుప్రీంకోర్టు కమిటీలు నిర్ధారిస్తాయని.. అదే జరిగితే రేపు అత్యాచారం చేసినవారిని శిక్షించేందుకు ఏ పోలీసు అధికారి, ఏ ప్రభుత్వ పెద్దా ముందుకు రారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. అప్పుడు దోషులు యథేచ్ఛగా బయట తిరుగుతారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో శుక్రవారం ‘దిశ బిల్లు 2019’పై చర్చకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లలో మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరిగాయో వివరిస్తూ దిశ చట్టం రూపకల్పనకు దారితీసిన పరిస్థితులను వివరించారు.

వాళ్లని చంపడం తప్పే అంటారు!
‘‘దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ తర్వాత ఏం జరిగింది? జాతీయ మానవహక్కుల కమిషన్‌ దర్యాప్తు, సుప్రీంకోర్టు కమిటీలు.. సిట్‌ అంట, కమిటీలు అంట.. వీళ్లంతా ఏంచేస్తారు? అత్యాచారం చేసి చంపడం తప్పే అయినా పోలీసులు కాల్చడం కూడా తప్పే అంటారు. అలా చెబితే.. రేపు ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి ఘటనలు జరిగితే వాళ్లను శిక్షించేందుకు ఏ పోలీసు అధికారీ ముందుకు రారు. ఏ ప్రభుత్వ పెద్దా ముందుకు రారు. అప్పుడేం జరుగుతుంది? తప్పు చేసినవాళ్లు యథేచ్ఛగా బయటకు వస్తారు. బాధితుల తల్లిదండ్రులు రోదిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనే చట్టపరంగా ఏం చేయాలనే ఆలోచనల్లోంచే దిశ చట్టం తీసుకొస్తున్నాం. ఇలాంటి ఘటనల్లో త్వరగా న్యాయం జరగాలని ప్రతి కుటుంబం కోరుకుంటోంది. నిర్భయ ఘటన జరిగి ఏడేళ్లయినా ఇప్పటికీ దోషులకు శిక్ష పడలేదు. ఈ చట్టాలను మార్చేందుకు దేశం మొత్తం అడుగు వేయాలి. ఇలాంటి చట్టాల్లో కొన్ని రాష్ట్ర పరిధిలో, కొన్ని ఉమ్మడి జాబితాలో ఉన్నాయి.. అందుకే రాష్ట్రంలో రెండు చట్టాలు తెచ్చాం. ఒకటి రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది. అప్పుడు జాతీయస్థాయిలో చర్చ జరుగుతుంది. మరో చట్టం రాష్ట్రంలోనే ఆమోదం పొందుతుంది. పిల్లల విషయంలో ఒక తండ్రి ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచించి ఈ చట్టాలు చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు.

అత్యాచారానికి మరణదండన
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, బాలలపై అత్యాచారాలకు పాల్పడితే కఠినశిక్షలు.. చివరకు మరణశిక్ష కూడా విధించేద]ుకు వీలుకల్పించే దిశ బిల్లును శాసనసభ శుక్రవారం ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్‌ దిశచట్టం - క్రిమినల్‌ లా(ఏపీ సవరణ) బిల్లు-2019పై 3 గంటల పాటు 15 మంది సభ్యులు మాట్లాడారు. అంతకుముందు జగన్‌ మాట్లాడుతూ.. ఈ చట్టంలో భాగంగా రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తున్నామని, మహిళలపై జరిగే నేరాలమీదే అక్కడ విచారిస్తారని చెప్పారు. వీరికి సహకరించేలా డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. అత్యాచారానికి పాల్పడినట్లు కచ్చితమైన సాక్ష్యాధారాలు ఉంటే మరణశిక్ష విధించేలా చట్టం మారుస్తున్నామన్నారు. అత్యాచారానికి అందుబాటులోని సాక్ష్యాలున్నప్పుడు జీవితఖైదు విధించేలా మార్పులు చేస్తున్నామన్నారు. చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల కేసుల్లో పోస్కో చట్టం కింద ఇప్పుడు 3-7 ఏళ్లవరకు శిక్ష ఉండగా దాన్ని జీవితఖైదుగా మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలను వేధించడంపై ఇంతవరకు ఎలాంటి చట్టమూ లేదని, ఇప్పుడు సీఆర్‌పీసీలో కొత్త సెక్షన్‌ ఏర్పాటుచేసి ఇందుకూ శిక్షలు నిర్ణయించినట్లు చెప్పారు. తొలిసారి తప్పు చేస్తే రెండేళ్లు, మరోసారి తప్పు చేస్తే నాలుగేళ్ల శిక్ష విధించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. మహిళలకు సంబంధించిన నేరాల్లో నిందితుల జాబితాను అన్ని దర్యాప్తు సంస్థలకూ అందుబాటులో ఉంచుతామని చెప్పారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.