close

ప్రధానాంశాలు

అత్యాచారానికి మరణదండన

7 రోజుల్లో పోలీసు దర్యాప్తు.. 14 రోజుల్లో న్యాయవిచారణ పూర్తి
మహిళలు, బాలలపై క్రూరమైన నేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు
ఆంధ్రప్రదేశ్‌ దిశబిల్లు, ప్రత్యేక న్యాయస్థానాల బిల్లులకు శాసనసభ ఆమోదం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, బాలలపై అత్యాచారాలకు పాల్పడితే కఠినశిక్షలు.. చివరకు మరణశిక్ష కూడా విధించేందుకు వీలుకల్పించే దిశ బిల్లును శాసనసభ శుక్రవారం ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్‌ దిశచట్టం - క్రిమినల్‌ లా (ఏపీ సవరణ) బిల్లు-2019పై 3 గంటల పాటు 15 మంది సభ్యులు మాట్లాడారు. దీని ప్రకారం 16 ఏళ్లలోపు బాలికలపై సామూహిక అత్యాచారానికి తెగబడే నేరగాళ్లకు జీవితఖైదు లేదా మరణదండన విధించనున్నారు. మహిళలపై అత్యాచారానికి పాల్పడేవారికి కూడా పదేళ్లకు తక్కువ కాకుండా.. గరిష్ఠంగా మరణశిక్ష అమలు చేయనున్నారు. మహిళలను సామాజిక, డిజిటల్‌ మాధ్యమాల ద్వారా వేధించినా, లైంగిక కోరికలు తీర్చాలని ఒత్తిడిచేసినా, ఆయా మాధ్యమాల్లో వారిని కించపరిచేలా వ్యవహరించినా, పోస్టులు చేసినా, బాలలపై లైంగికదాడులకు పాల్పడినా కఠినశిక్షలు విధించనున్నారు. బిల్లులోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.

మహిళలపై వేధింపులు (354 ఈ)

మాటలు, చేతలు, చర్యల ద్వారా అవమానపరచటం, దుర్భాషలాడటం, వ్యక్తిగతంగా, ఫోన్‌, మెయిల్స్‌, సామాజిక మాధ్యమాలు, డిజిటల్‌ మాధ్యమం ద్వారా వేధించటం, అవాంఛిత సందేశాలు పంపడం, వాటిల్లో మహిళలను కించపరిచేలా వ్యవహరించటం, పోస్టులు చేయటం, లైంగికకోరికలు తీర్చాలని ఒత్తిడి, బలవంతం చేయటం. లేనిపక్షంలో వారికి హాని కలిగిస్తామంటూ బెదిరించటం తదితర నేరాలు ఈ సెక్షన్‌ పరిధిలోకి వస్తాయి.
శిక్ష: మొదటిసారి నేరానికి రెండేళ్లవరకూ జైలుశిక్ష, రూ.లక్ష వరకూ జరిమానా, రెండోసారి నేరానికి పాల్పడితే నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల వరకు జరిమానా.


బాలలపై లైంగిక దాడి (354 ఎఫ్‌)

లైంగిక కోరికతో బాలల రహస్యభాగాలను తాకటం, వారిపై లైంగికదాడి చేయటం తదితర నేరాలు ఈ సెక్షన్‌ కిందకు వస్తాయి.
శిక్ష: అయిదేళ్లకు తక్కువకాకుండా గరిష్ఠంగా ఏడేళ్ల వరకూ జైలుశిక్ష, జరిమానా


బాలలపై తీవ్రమైన లైంగిక దాడి (354 జీ)

పోలీసులు, సాయుధ బలగాలు, ప్రభుత్వోద్యోగులు, జైలు అధికారులు, సంరక్షణాధికారులు, ఆసుపత్రి సిబ్బంది, యాజమాన్యం, విద్యాసంస్థలు, మతసంస్థల యాజమాన్యం లేదా సిబ్బంది ఆయా ప్రాంగణాల లోపల బాలలపై చేసే లైంగిక దాడి, బాలలపై జరిగే సామూహిక లైంగికదాడి తదితర నేరాలు ఈ సెక్షన్‌ పరిధిలోకి వస్తాయి.
శిక్షలు ఇలా: పద్నాలుగేళ్లకు తక్కువ కాకుండా.. గరిష్ఠంగా జీవితకాల కారాగార శిక్ష, జరిమానా


సత్వర దర్యాప్తు- సత్వర న్యాయవిచారణ
* నేరం జరిగిన ఏడు పనిదినాల్లోగా పోలీసులు దర్యాప్తు పూర్తిచేసి అభియోగపత్రాలు న్యాయస్థానంలో దాఖలుచేయాలి.
* అభియోగపత్రం దాఖలైన 14 రోజుల్లోగా న్యాయస్థానాల్లో కేసు విచారణ పూర్తికావాలి.
* దిగువకోర్టులో శిక్షపడితే దానిమీద అప్పీలుకు పైకోర్టుకు వెళ్లేందుకు మూడునెలలే గడువు.


జిల్లాకో న్యాయస్థానం
మహిళలు, బాలలపై జరిగే నేరాల సత్వర న్యాయవిచారణకు అవకాశం కల్పించేందుకు ఉద్దేశించిన ఏపీ ప్రత్యేక న్యాయస్థానాల బిల్లు-2019ను కూడా శాసనసభ శుక్రవారం ఆమోదించింది. దీని ప్రకారం సత్వర న్యాయవిచారణ కోసం ప్రతి జిల్లాలోనూ ఓ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.