close

ప్రధానాంశాలు

‘జగతి’ అక్రమాలు తేల్చారనే కృష్ణకిశోర్‌ సస్పెన్షన్‌

అసెంబ్లీలో ప్రస్తావిస్తామనే చీఫ్‌మార్షల్‌ అంశాన్ని తీసుకొచ్చారు
జగన్‌ కేసులో సహ నిందితులు, జైల్లో ఉన్నవారికి కీలకపోస్టులు
తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు, అమరావతి: జగతి పబ్లికేషన్స్‌లో ఆర్థిక అక్రమాలను వెలికితీసినందుకు కక్ష సాధింపుగా ఐఆర్‌ఎస్‌ అధికారి జె.కృష్ణకిశోర్‌ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్‌ చేసిందని చంద్రబాబు విమర్శించారు. తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కృష్ణకిశోర్‌ డిప్యుటేషన్‌పై ఏపీకివచ్చారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి (ఈడీబీ) సీఈవోగా పనిచేశారు. ఆయన 27ఏళ్ల సర్వీసులో చెడ్డపేరు లేదు. 2010లో హైదరాబాద్‌లో పని చేసినపుడు జగతి పబ్లికేషన్స్‌లో ఆదాయ మదింపు చేశారు. ఈ కంపెనీ రూ.350 ప్రీమియంతో జారీచేసిన షేరుకు అంత విలువలేదన్నారు. షేర్‌ విలువ రూ.10లోపు ఉంటుందని, రూ.122 కోట్ల పన్ను చెల్లించాలని నివేదిక సమర్పించారు. జగన్‌కు వ్యతిరేకంగా పనిచేసినందునే కక్షసాధింపుగా ఆయన్ని సస్పెండ్‌ చేశారు. ఇది దుర్మార్గం’’ అని చంద్రబాబు మండిపడ్డారు. ‘‘ఈడీబీ భూములు కేటాయించదు. ప్రోత్సాహకాలివ్వదు. పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రచారం చేస్తుంది. పెట్టుబడులు పెట్టే వారితో మాట్లాడి ఆయావిభాగాలకు అనుసంధానం చేస్తుంది. ఇందులో అవినీతి ఎక్కడ జరుగుతుంది?’’ అని ప్రశ్నించారు.

అసెంబ్లీలో లేవనెత్తుతామనే..
‘‘సీఎం జగన్‌ కేసులో సహ నిందితులకు ముఖ్యమైన స్థానాలు కేటాయించారు. ఏ1, ఏ2లు ఐఏఎస్‌ శ్రీలక్ష్మిని తీసుకొని కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. కృష్ణకిశోర్‌ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతామనే భయంతోనే చీఫ్‌మార్షల్‌ అంశాన్ని తీసుకొచ్చారు. నేను అసభ్యపదజాలం వాడానని సీఎం అంటున్నారు. వీడియోలో అది ఎక్కడా లేదు. ఉన్మాది అన్నట్లుంది. ఇది అభ్యంతరకర పదం కాదు. ప్రతిపక్ష నేతను ఎట్లా దెబ్బతీయాలా అని చూస్తున్నారు. చీఫ్‌మార్షల్‌ ఘటనపై స్పీకర్‌ అసెంబ్లీని వాయిదా వేసి, ముఖ్యమైన నాయకులను, సంబంధం ఉన్నవారిని పిలిచి మాట్లాడాలి. సీఎంకు అనుభవం లేదు.. ఆవేశం, గర్వం ఉన్నాయి’’ అని చంద్రబాబు విమర్శించారు.

జగన్‌ సమాధానం చెప్పాలి..
‘‘ప్రజలు అధికారం ఇచ్చింది కక్ష తీర్చుకోవడానికా? జగన్‌ ఎంపీగా ఉన్నప్పుడే షరతులతో కూడిన బెయిల్‌లో స్పష్టంగా చెప్పారు. సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి వీల్లేదు. ప్రతి శుక్రవారం వాయిదాలకు రావాలన్నారు. ఎంపీగా ఉండే సాక్ష్యాలను తారుమారు చేశారని, సీఎంగా ఉంటే ఇంకా తారుమారు చేస్తారని సీబీఐ ఇటీవల కోర్టుకు తెలిపింది. ఆ తర్వాత కృష్ణకిశోర్‌ను సస్పెండ్‌ చేశారంటే సాక్షులను బెదిరించడం, సహనిందితులను కాపాడటమే’’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.